విజ్ఞానకోశము - 3
చంపూకావ్యములు (సంస్కృతము)
భూమ్నా భవంతి యత్రైతే గుణాస్సర్వే తథా౽పరే
నీలకంఠస్య వక్రోక్తిః సా ముగ్దేందుకలానిభా.
అను శ్లోక పాదములచే తేటపడుచున్నది. ఈ కావ్యారంభమునందలి
'వందే వాంఛితలాభాయ కర్మ కిం తన్న వేద్యతే'
కిం దంపతి మితి బ్రూయాముతాహో దంపతీ ఇతి'
అను శ్లోకము నీలకంఠదీక్షితుని వక్రోక్తి నైపుణ్యమునకు ప్రకృష్టమైన ఉదాహరణము. ఈ కావ్యమున, ద్వితీయా శ్వాసమునందలి విష్ణుస్తవము, తృతీయాశ్వాసమున, బృహస్పతి శక్ర శుక్రులతో గావించిన సంభాషణములు ప్రశస్తములు. విష్ణుస్తవోదాహరణము :
“అసాధారణ షాడ్గుణ్యం, అఖిలలోక శరణ్య మాలక్ష్య
సర్వప్రమాణ పరాయణం, భగవంతం నారాయణం,
అసకృత్ప్రణిపతన్, అసకృదుత్థాయ, బధ్నన్ శిరస్యం
జలిం, అసకృదావర్తయ న్ప్రణవం, అసకృదనుస్మరన్
పరతత్త్వం, అశ్రుపూర్ణైః లోచనైః అవిరలపుల
కాంకితైః, అంగకై రానందగద్గదైశ్చ వచోభిరిత్థ మస్తావీత్.
క్షంతారం సకలాగసాం, జడధియాం
యంతార, మంతస్తమో
హంతారం, జగతా మనుత్తరపరా
హంతాంకితోరస్థలం,
ఉద్యత్కౌస్తుభశోభ ముత్పలవనీ
సచ్ఛాయ మచ్ఛా౽యత
స్నిగ్ధాపాంగతరంగ మైక్షిషి పరం
బ్రహ్మా౽చ్యుతం శాశ్వతం
కింతర్కై రతి వక్రైః, కింఫలముపబృంహణైర్వివిధైః
అత్రైక్షిషి శ్రుతీనామాశయమహిరాజభోగశయనం'
అహో ! ధన్యోస్మి, ధన్యోస్మి (నీ. వి. చం. ద్వి. ఆ.) .
ఈ ప్రశస్త విష్ణుస్తవము కవికి గల శివకేశవా౽భేదభావమునకు తార్కాణము. ఎడ నెడ ఈ కావ్యమున, కవి, యాజ్ఞికుల కర్మపరతను, అనిత్యస్వర్గాది ఫలములందు వారికిగల వాంఛను అపహాసపూర్వకముగ ప్రదర్శించి యున్నాడు.
దైవజ్ఞ సూర్యపండితుడు 'నృసింహ చంపువు'ను రచించెను. ఇది ఉల్లాసచతుష్టయవిరాజితము, సరసము, ప్రహ్లాద చరిత మిందు సుందరముగ పొందుపరచబడినది. కవి వ్రాసికొనిన ఆత్మీయాంశము లాధారముగ, 'ఇతడు నాగనాథ ద్విజుని పౌత్రుడు, జ్ఞానరాజాభిధుని తనయుడు, భారద్వాజగోత్రజుడు, సంగీతాగమకావ్య నాటక పాండితీమండితుడు, గణితాగమప్రతరణకర్ణధారుడు, లక్ష్మీపతి ప్రీతికొర కీకావ్యమును రచించెను' అని తెలియుచున్నది. సంకర్షణపండితుడు వ్రాసిన 'నృసింహ చంపువు' మరియొకటి కలదు. గ్రంథావతారికను బట్టి ఈ కవి, మీమాంసాజన్మ భూమి, కవికులతిలకుడు, ప్రౌఢపండితుడు, నిఖిలన్యాయ సాంఖ్యాగమములకు ఖని, వేదాంతపారగుడు, శ్రీ నృసింహ ప్రసాదమున ఈ చంపువును రచించెను అని అవగతమగు చున్నది. అనంతుని పుత్రుడగు కేశవభట్టు వ్రాసిన నృసింహ చరిత్రము సుప్రసిద్ధమైనది. ఇతడు మాధ్యందినవేదపారగుడు, లౌగాక్షికులారవిందతరణి, మీమాంసాయుగతర్క తంత్ర చతురుడు, సాహిత్యరత్నాకరుడు అని తెలియు చున్నది. తిరుపతి వేంకటేశుడు నాయకుడుగా, పద్మినీ పరిణయాది కథలతో, వేంకటేశ చంపువును రచించిన కవి ధర్మరాజపండితుడు. ఇతడు 17 వ శతాబ్దివాడు. శివానుగ్రహము కారణముగా, మృత్యుముఖమున బడకుండ, మార్కండేయు డాత్మరక్షణ మొనర్చుకొనిన వృత్తాంతముచే నలరారు 'శివచంపువు'ను సంతరించిన పండితుడు కవి వాదిశేఖరుడు. శివమహత్త్వ ప్రతిపాదక మయిన 'శివలీలాచంపువు' ను వ్రాసిన విద్వాంసుడు విరూపాక్షకవి. శ్రీకృష్ణుని చరితమును మనోహరముగ ప్రతిపాదించు 'కృష్ణభూషణచంపువు' ను రచించిన పండితుడు నరసింహకవి. త్రిపురాసురసంహారకథ నాశ్రయించి, 'త్రిపుర విజయ చంపువు' ను గ్రథన మొనర్చిన బుధుడు నృసింహామాత్యుడు. 17 వ శతాబ్దాంతమున నున్న ఇతడు తంజావూరు ప్రభువగు ఏకోజీ మహారాజునకు మంత్రియై యుండెను. 'త్రిపుర దహనచంపువు' ను నిర్మించిన కోవిదుడు నిత్యామృతమతి అను కవి. సుబ్రహ్మణ్య జనన వృత్తాంతమును 'కుమారచంపువు' గా రచించిన కవి, రెండవ శరభోజిరాజు. ఇతడు తంజావూరు భోసల వంశ్యుడు. క్రీ. శ. 1800 సంవత్సర ప్రాంతమువాడు.
మహాపురుష జీవితములను ఇతివృత్తముగ గైకొని కొందరు సంస్కృత కవులు చంపూకావ్య రచన సల్పిరి.
589