Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపూకావ్యములు (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

కురుండక మను గ్రామమున (919) వ సంవత్సరమున పట్టాభిషిక్తుడై బ్రాహ్మణులకు అనేక గ్రామముల నొసగెననియు, ఆ కురుండక దానపత్రమును ఈ త్రివిక్రమభట్టే వ్రాసియుండెననియు బడోదాంతర్గతమయిన నవసారీ గ్రామమున లభించిన తామ్ర శాసన లిపివలన తెలియుచున్నది. త్రివిక్రమభట్టు నలచంపువును రచించెను. దీనికి 'దమయంతీచంపూకథ' యనునది నామాంతరము. ఇది 7 ఉచ్ఛ్వాసముల కావ్యము. ఈ చంపువు మహాభారతీయ వనపర్వాంతర్గత నలోపాఖ్యాన మాధారముగా నిర్మితమైనది. ఉచ్ఛ్వాసాంతిమ పద్యములందు, ఇది, హరచరణ సరోజపదాంకితము. (హరచరణసరోజ ద్వంద్వ మారాధయంతీ శుచికుశశయనీయే సా౽ థనిద్రాం జగామ -ద్వి. ఉ. శ్లో. 39) స్వయంవర పర్యంతముగ నలదమయంతుల ప్రేమకథ ఇందు వర్ణితమైనది. అవతారికాశ్లోకములలో, వాల్మీకిని, వ్యాసుని, బాణుని, గుణాఢ్యుని ఈ కవి ప్రశంసించెను. ఈ చంపువునందు మంత్రి సాలంకాయనుడు నలునకొసగిన ఉపదేశము, కాదంబరియందు శుకనాసుడు చంద్రాపీడున కొసగిన ఉపదేశము వలె హృద్యమును అమూల్యమునై ఒప్పారుచున్నది. త్రివిక్రమభట్టు భంగశ్లేష రచనయందు కృతహస్తుడు.


'భవంతి ఫాల్గునే మాసి వృక్షశాఖా విపల్లవాః
జాయంతే నతులోకస్య కదా౽పిచ విపల్ల వాః
                            (నల. చం. ఉ. 1 శ్లో. 27)

అను శ్లోకమునందు మొదటిపాదము నందలి 'విపల్ల వాః' అను పదమునకు 'విగతపల్లవాః' అనియు, రెండవపాదము నందలి 'విపల్లవాః' అను పదమునకు 'విపత్' 'లవాః' అనియు సభంగశ్లేష మనోహరముగ నున్నది. ఇట్లే


'బిభర్తి యో౽హ్యర్జున వారి పౌరుషం
కరోతి నమ్రే చ, నవా, రిపౌ, రుషం
నతేన రాజ్ఞా సహసా౽ గరాజితా
భవేన్మహీ కిం సహసాగరా, జితా'
                         (నల. చం. ఉ. 4 శ్లో. 18)

అను పద్యమునందలి సభంగశ్లేష సరసమును రమణీయమునై తనరారు చున్నది. ఈ కావ్యమునందు 7 వ ఉచ్ఛ్వాసమున కవికృతమయిన చంద్రోదయవర్ణనము కడుంగడు మనోజ్ఞము.


కైలాసాయితమద్రిభిః విటపిభిః
        శ్వేతాతపత్రాయితం
మృత్పం కేన దధీయతం జలనిధౌ
        దుగ్దాయితం వారిభిః ।
ముక్తాహారలతాయితం వ్రతతిభిః
        శంఖాయితం శ్రీఫలై :
శ్వేతద్వీపజనాయితం జనపదై
        ర్జాతే శశాంకోదయే.
                        (నల. చ. శ్లో. 28)

నలచంపువునందు కనిపించు ఉదాహరణములు న్యాయ వై శేషి కాది శాస్త్రములందు త్రివిక్రమభట్టు నిష్ణాతుడని తెలుపుచున్నవి. 'మదాలస చంపువు' అను మరియొక చంపువు నీతడు నిర్మించెను. కువలయాశ్వచరిత మనునది దీనికి నామాంతరము. నాయకు డిందు కువలయాశ్వుడు. నాయిక మదాలస. హృదయంగమము లయిన ఇందలి గద్యపద్యములు పాఠకులకు అమందానందసంధాయకములుగా నున్నవి.

కాయస్థకులజుడగు సోడ్డలకవి 'ఉదయసుందరీకథ ' ను నిర్మించెను. ఇందు 8 ఉచ్ఛ్వాసము లున్నవి. ఉదయ సుందరీ మలయవాహనుల వివాహోదంత మిందు సరసముగ వర్ణింపబడినది. మలయవాహనుడు ప్రతిష్ఠానా ధీశుడు. ఉదయసుందరి నాగలోకరాజగు శిఖండితిలకుని తనయ. మొదటి ఉచ్ఛ్వాసమున ఆత్మకథాంశములను కొన్నింటిని కవి వ్రాసికొనెను. వాటినిబట్టి, కొంకణమునకు క్రమముగా అధీశులయిన ఛిత్తరాజు, నాగార్జునుడు, ముమ్మణిరాజు అను సోదరులచే సత్కరింపబడినవాడు. లాటాధీశు డగు చాళుక్య వత్సరాజు ఆస్థానమున గౌరవము నొందినవాడు, క్రీ. శ. 1000-1070 సంవత్సరముల మధ్యకాలమున నున్నవాడు ఈ కవి యని తెలియు చున్నది. అవతారికయందు బాణుని, ఆతని హర్షచరితమును కవి ప్రశంసించెను. హర్ష చరితమునందలి గద్యమువలె ఈ చంపువునందలి గద్యము ఉజ్జ్వలమై ఒప్పుచున్నది. కథ కల్పితమును, చిత్తావర్జకమునై యున్నది.

'వరదాంబికాపరిణయచంపువు'ను 1540 వ సంవత్సర ప్రాంతమున రచించి వాసికెక్కిన విదుషీమణీ తిరుమలాంబ. ఈమె విజయనగరాధీశు డయిన అచ్యుత దేవ

584