విజ్ఞానకోశము - 3
చంపూకావ్యములు (సంస్కృతము)
చంద్రుని ఉపరితలమందు అగపడు అన్ని వైఖరులను వివరించగల సంపూర్ణమగు సిద్ధాంతమేదియు లేదు. అచట నున్న పర్వతపంక్తులకును, మైదానములకును భూమియొక్క భూతత్త్వరూపములను వివరించు సిద్ధాంతములే చెప్పుటకు వీలగును. కాని చంద్రబిలములను గూర్చి వివరించు సిద్ధాంత మేదియు ఇంతవరకు కనబడదు. చంద్రునిపైనున్న బిలములయొక్క ఉత్పత్తిని గూర్చి రెండు ముఖ్యమైన సిద్ధాంతములు గలవు. మొదటిది అగ్నిపర్వత సంబంధమగు సిద్ధాంతము. రెండవది ఉల్కా సంబంధమగు సిద్ధాంతము. అగ్నిపర్వత సంబంధమగు సిద్ధాంతము పురాతనమైనది. ఉల్కా సంబంధమగు సిద్ధాంతము 19 వ శతాబ్దము చివరి భాగమున బయలుచేరినది.
యుగయుగములనుండియు మానవునిపైనను, వాతావరణము పైనను చంద్రునకు గొప్ప ప్రభావమున్నట్లు చాల విషయములు మనలో వ్యాపించియున్నవి. అవి యన్నియు ఊహామాత్రములేకాని, యదార్థవిషయములు కావనియు, ఆ సంబంధమగు విశ్వాసము లన్నియు మూఢ విశ్వాసములే యనియు తెలియుచున్నది. సూర్యునినుండి చంద్రుడు గ్రహించిన శక్తిలో సుమారు 1/500,000 వంతు మాత్రమే చంద్రుని నుండి భూమిపై బడుచున్నదని శాస్త్రజ్ఞులు వేసిన లెక్కలవలన తెలియుచున్నది. అందుచే వాతావరణముపై చంద్రునికి గల ప్రభావ మత్యల్పమనియు, సముద్రపు పాటు పోటులకు, తరంగములకు, ముఖ్య కారణము చంద్రుడనియు, తద్వారా వాణిజ్యముపైనను, సముద్రప్రాంత ప్రదేశముల వాతావరణము పైనను కొంత ప్రభావ ముండవచ్చుననియు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. భూమికిని, చంద్రునకును గల దూరములో గలుగు మార్పులకును, భూమియొక్క అయస్కాంత శక్తికిని స్వల్పమగు సంబంధము గూడ నున్నట్లు శాస్త్రజ్ఞులు తెలియజేయుచున్నారు. ఇటీవల రెండు సంవత్సరముల క్రిందట రష్యను శాస్త్రజ్ఞులు రాకెట్లలో చేసిన అంతరిక్షయానమున చంద్రగోళము దరిదాపులకు పోయి - కొన్ని క్రొత్త పర్వత పంక్తులను కనిపెట్టిరి.
బి. వి. ర.
చంపూకావ్యములు (సంస్కృతము) :
గద్య పద్య చంపూ భేదమున కావ్యము త్రివిధము. ఛందోబద్ధమయినది పద్యకావ్యము. తద్భిన్నమయినది. గద్యకావ్యము, గద్యపద్యముల కలయికచే నేర్పడినది చంపూ కావ్యము, 'చంపయతి' 'చంపతి ' అను వ్యుత్పత్తిచే నిది చంపువైనది. ద్రాక్షా మధువుల కలయికవలె, జంత్రగాత్రసంగీతముల మిశ్రణము కైవడి, చంపూకావ్యమున దాదాపు తుల్యప్రమాణము గల గద్యపద్యముల సమ్మేళనము మనోహర మగుచున్నది.
వైదికోపాఖ్యానములు, పాలీ భాషామయ బౌద్ధ జాతక కథలు, పంచతంత్ర హితోపదేశాది సంస్కృత కావ్యములు, చంపూ కావ్య నిర్మాణ ప్రణాళికి మూలములని తెలియుచున్నది. గుప్త యుగమునందలి శాసనములు క్రీ. శ. 4వ శతాబ్దినాటికే చంపూకావ్యములు రచింపబడి యుండె ననుటకు నిదర్శనములు. క్రీ. శ. 7వ శతాబ్దికి పూర్వముననే చంపూకావ్య మొక స్వతంత్ర సారస్వత ప్రక్రియగా అంగీకరింపబడియుండె ననుటకు దండికావ్యా దర్శము నందలి 'గద్యపద్యమయీ కాచి చంపూరిత్యభి ధీయతే' అను నిర్వచనమే ప్రమాణము. ఈ నిర్వచనమునకు నాట కాదులయందు అతివ్యా ప్తిని ఆశంకించిన హేమచంద్రాచార్యుడు (క్రీ. శ. 12) చంపూకావ్యలక్షణమును సంస్కరించి, 'గద్యపద్యమయీ సాంకోచ్ఛ్వాసా చంపూః' అని తన కావ్యానుశాసనమునందు నిష్కృష్టమైన చంపూ నిర్వచన మొనర్చెను.
చంపూ కావ్యమునకు సంస్కృత వాఙ్మయమున సముచితస్థానము లభించెను. చంపూకావ్యమును సంస్కృత కవులు భిన్నభిన్న ప్రయోజనములను సాధించుటకు వాడిరి. పరిణయకథాత్మక చంపువులు కొన్ని వెలసినవి.. క్రీ. శ. 950 ప్రాంతమువాడైన త్రివిక్రమభట్టు చంపూకావ్యమునకు ఆద్యప్రవర్తకుడుగా భావింపబడుచున్నాడు. ఇతడు శాండిల్య గోత్రోత్పన్నుడు. శ్రీధరుని పౌత్రుడు, నేమాదిత్యుని పుత్రుడు. దక్షిణమున ప్రసిద్ధిచెందిన మాల్యఖేటమున (Malkhed) కధీరుడును, రాష్ట్రకూట కుల చూడామణియు నగు తృతీయ - ఇంద్రరాజు నాస్థానమున, ఈ కవి ప్రముఖపండితుడై యుండెను. ఇంద్రరాజు కృష్ణా - తుంగభద్ర సంగమస్థలమున నున్న
583