Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఘనాదేశము

విషయములందు కూడ ఈ రాజ్యములు పరస్పర సహకారముతో వ్యవహరించెను. ఫ్రెంచి వారితోను, పశ్చిమ ఆప్రికాయందలి ఇతర ప్రాంతములవారితోను సంబంధములు పెట్టుకొనబడెను. అనేకములయిన సాంకేతిక విషయములలోను, శాస్త్రవిషయములలోను వివిధ ప్రభుత్వములమధ్య తరచుగా సంప్రతింపులు జరుగు చుండెను. అట్టి సాంకేతిక శాస్త్రీయ విషయములలో 'ట్సెట్సి' (Tsetse) అను వ్యాధిని నిర్మూలన మొనర్చుట, మిడతలను ఇతరములయిన తెవుళ్ళను స్వాధీనములోనికి తెచ్చుట మొదలగునవి పేర్కొనదగినవి.

శీతోష్ణస్థితి : ఘనాఉన్న ఆఫ్రికా ప్రాంతమునందు రెండు ప్రధానములయిన వాయుమండలము లున్నవి. (1) ఈశాన్యవర్తక పవనములు. వీటికి స్థానికముగా హర్‌మట్టన్(Harmattan) అని వ్యవహారము. ఈ పవనములు అధికములయిన ఉష్ణోగ్రతలు(temperatures)గల సహారా ఎడారినుండి వీచును. ఈ పవనములు వేడిగాను, పొడిగాను ఉండును. వీటికి ప్రతికూలముగా సముద్రమునుండి నైఋతి పవనములు వీచును. యథార్థమునకీ పవనములు భూమధ్యరేఖను దాటిన మీదట ప్రక్కకు తిరిగిన ఆగ్నేయ వర్తక పవనములే. నైఋతి పవనములు సముద్రమున కడ్డముగా ప్రయాణించుట వలన, చల్లగను, తేమగలవి గను ఉండును.

సంవత్సరము పొడుగునను అన్ని తావులందు తరతమ భావములచేగల అధికోష్ణోగ్రతలు; దక్షిణమునుండి ఉత్తరము వరకు వర్షఋతువునందు ప్రాంతీయ పరిస్థితినిబట్టి వర్ష పాతములో హెచ్చుతగ్గులు ; సముద్రము నుండి గల దూరభారములనుబట్టి శీతాకాలము యొక్కయు, వేసవి కాలముయొక్కయు, పరిమాణము అధికము, తీక్ష్ణమునగు సూచనలు పొడసూపుట — ఇవి ఘనాదేశమందలి శీతోష్ణస్థితి యొక్క ప్రధాన లక్షణములు.

ఘనాదేశమందు ఎక్కువ ప్రాంతములో అత్యధికమయిన దైనిక, మాసిక, ఉష్ణోగ్రతయందలి సగటు ముమ్మరము (mean maximum) మార్చి నెలలో గాని, ఫిబ్రవరి నెలలోగాని ఘటిల్లును. కనిష్ఠములయిన ఉష్ణోగ్రతలు ఆగస్టు నెలలో కలుగును.

ఎసియామా (Esiama) అను కావున గరిష్ఠ వర్షపాతము - అనగా సంవత్సరమునకు 80 అంగుళములకు పైగా ఉండును. వర్షపాతము ఉత్తర ప్రాంతమునకు పోయిన కొలదియు క్రమముగా సంవత్సరమునకు 40-50 అంగుళముల వరకు తగ్గును .

నదీమండలములు : ఘనాయందు విశేష ప్రాంతమున అనేకములయిన కాలువలును, నదులును అల్లిబిల్లిగ ప్రవహించుచున్నవి. ఇవన్నియు సంవత్సరము పొడుగున ప్రవహింపవు. అధికమైన చెమ్మగల ప్రాంతములలో గూడ తీక్షణమైన వేసవులయందు చిన్న నదులన్నియు ఎండి పోవుటయో లేక ప్రవాహము బాగుగా తగ్గిపోవుటయో జరుగును. వర్షములు ప్రారంభమగుటతో మరల ఈ నదులు నిండుగా ప్రవహించును. ఆదేశమందు నదులు సమృద్ధిగా నుండుటచే రోడ్ల నిర్మాణము, వాటిపోషణము మిగుల వ్యయశీలముగ నుండును. 'వోల్టా' యనునది ఘనా దేశముయొక్క మహానది. దీని నిడివి 1000 మైళ్లు. ఈనది వంకర టింకరగా ప్రవహించుటచే 15 వ శతాబ్దిలో పోర్చుగీసువారు దీనికి 'వోల్టా' అని పేరిడిరి. ఆ దేశమందలి నీటిపారుదల విధానము ప్రధానముగా ఈ నది మూలముననే జరుగుచున్నది. దేశ వైశాల్యములో 67 శాతము ఈ నదిక్రింద పారుదల యగుచున్నది.

వ్యవసాయము : ఘనాలో వ్యవసాయము ప్రధానమైన వృత్తిగా నున్నది. శ్రామికులలో 70 శాతమునకు పైగా వ్యవసాయము వలన జీవించుచున్నారు. శేషించిన వారిలో గొప్ప నగరములందు నివసించు అత్యల్ప సంఖ్యాకులైన ప్రజలు భూములను పూర్తిగా కోల్పోవుటేకాక, కనీసము తమ పెరడులయందు కూరగాయలను పండించుకొను అవకాశమును కూడ కోల్పోయిరి.

ఆ దేశమున ప్రధానమైన పంట కోకో. అన్ని ప్రదేశములందును ఈపంట పండించబడు చున్నది. ఈ పంటను పండించు ప్రాంతములో స్థానికోపయోగమునకై పెండలమువంటి దుంప పదార్థము (yans), అరటిపండ్లు, బొంత అరటి కాయలు (bananas), కోకోయమ్స్ (cocoyams), 'కాస్సవా' (cassava) అను ఒక జాతి దుంపలు, మొక్కజొన్న, వరి, మిరియములు, గ్రుడ్లు, ఓక్రాస్ (okras), ఉల్లి, టొమాటోలు, ఆవోకడో

545