విజ్ఞానకోశము - 3
ఘంటశాల
మైనదే. పవిత్రాశ్వమైన కంటకము పేర బౌద్ధక్షేత్రము నెలకొల్పబడినది. ఇది ఇట కంటకశైలముగా నుండి, క్రమముగా కంటక సేల. గంటసాలగా మారినది. ఈ విధముగా కొందరు తలంచుచున్నారు. కాని కంటకశైల నామము నాగార్జునకొండలోని ఒక గుట్టకు చెందినదని మరికొందరు తలంచుచున్నారు. ఈ కంటకశైలమును గురించిన ప్రస్తావనలు శాసనములందు మనకు లభించు చున్నవి. పెదవేగిశాసనము సంఖ్య 219 (1927) అమ రావతి శాసనము సంఖ్య 54, నాగార్జునకొండ శాసనము సంఖ్య 214 (1927) మొదలగు వానియందు కంటక శైలము ప్రస్తావింపబడినది.
ఘంటశాలలో కొన్ని పురాతన నాణెములు లభించినవి. వీటిలో కొన్ని పరిమాణమున నేటి అర్ధరూపాయతోను, పావులాలతోను తుల్యములుగను, కొన్నివీటికంటె చిన్నవిగను ఉన్నవి. ఇవి కంచు, రాగి, సత్తు అను లోహములతో చేయబడినవి. సత్తుతో చేయబడిన నాణెములు ఆంధ్ర చక్రవర్తులకు చెందినవి. వీనిపై స్తూపములు, తెరచాపలు, ఓడ, ఉజ్జయిని మున్నగు సంజ్ఞలు ముద్రితములై యున్నవి. ఆంధ్రుల విదేశవాణిజ్యము విరివిగా సాగుచుండె ననుటకు ఆనాటి నాణెములపై గల ఓడయొక్కయు తెరచాపల యొక్కయు సంజ్ఞలు నిదర్శనములుగా నున్నవని విన్సెంట్ స్మిత్ పండితుని అభిప్రాయము. లభించిన నాణెములలో కొన్ని ప్రసిద్ధాంధ్ర చక్రవర్తి యగు యజ్ఞ శ్రీ శాతకర్ణికి చెందినవని చారిత్రకులు నిర్ణయించినారు.
ఘంటశాలలో లభించిన నాణెములందు కొన్ని రోమను నాణెములుగూడ నున్నవి. వానిలో ఒక్కొక్కనాణెము మేలిమిబంగారముతో చేయబడి తూకమున నేటి సవరనునకు సమానముగనున్నది. ఒకవైపు రాజు విగ్రహము, వేరొకవైపు ఏదైన దేవత యొక్కగాని, దేవాలయము యొక్కగాని యాకారము ముద్రింపబడినది. దేవత పేరు, లేక దేవాలయము పేరు దానిక్రింద వ్రాయబడియున్నది. రెండువైపుల నగిషీపని కలదు. లభించినవానిలో ఒకటి అంటోనినస్ (Antoninus 138 A.D.) అను రాజునకు చెందినది. వేరొకటి హాడ్రియన్ (Hadrian 117 A. D.) అను రాజునకు చెందినది.
ఘంటశాల ప్రాచీనకాలపు ఓడరేవై, వాణిజ్యమునకు కేంద్రమగుటయేకాక బౌద్ధమతమునకు కూడలి స్థానముగా నుండెను. విదేశ వాణిజ్యమునకు కేంద్రమైన గంటసాలలో బౌద్ధులైన పలువురు వర్తకులు స్తూపములు, సంఘా రామములు కట్టించిరి. ఇచటినుండియే బౌద్ధ భిక్షువులు బుద్ధదేవుని ప్రేమసందేశములను తెలుపుటకు వివిధ దేశములకు నౌకామార్గమున వెళ్లుచుండిరి. అందుచేత గంటసాల విదేశీయబౌద్ధులకును, భారతదేశీయ బౌద్ధులకును కూడలిగా నుండెననదగును.
ఘంటశాలలో బౌద్ధమతమునకు సంబంధించిన శిథిలములు విరివిగా కనుపించును. వీనిలో శిథిలావస్థయందున్న ఇచటి స్తూపము ముఖ్యమైనది. ప్రాచీన శిథిలసంరక్షక సంఘమువారి నివేదిక ననుసరించి ఇప్పు డీగ్రామమునకు ఈశాన్యముననున్న ఈ స్తూపము ఆకృతిలో గుండ్రముగా నున్నది. మధ్యకొలత సుమారు 112 అడుగులు. ఎత్తు 23 అడుగులు. స్తూప మధ్యభాగమున 10 అడుగుల చచ్చౌకము కలిగి లోపల బోలులేని ఇటుకలతో కట్ట బడిన దిమ్మె యొకటి కలదు. దాని చుట్టును 19 అడుగుల చచ్చౌకము గల సమచతురావరణము కలదు. స్తూపము ఆయా భాగములందు అరలుగా విభజింపబడినది. ఈ అరలు మట్టితో గట్టిగా పూడ్చబడియున్నవి. స్తూపము చుట్టును 51/2 అడుగుల వెడల్పుతో 41/2 అడుగుల ఎత్తుతో పిట్టగోడ యొకటి కలదు. ఇది భక్తులకు ప్రదక్షిణ మార్గముగా నుపయోగింపబడుచుండెడిది. స్తూపము యొక్క నాలుగు వైపులందు మెట్లును, శిథిలములైన ఇతర భాగములును కనుపించుచున్నవి. స్తూప ప్రాంతమున కొన్ని పాలరాళ్లు కనుపించును.
శ్రీపాదము : ఇది బుద్ధభగవానుని పాద చిహ్నము చెక్కబడిన పాలరాయి. ఇదియే గంటసాలలో దొరకిన పాదచిహ్నము. ఈ రాతి యొక్క మూడు కోణములు విరిగిపోయినవి. అమరావతిలో దొరకిన శ్రీపాద చిహ్నముతో దీనికి పోలిక కలదు. పాదముల మడమల వెనుక పద్మ పుష్ప గుచ్ఛము కలదు. మడమల మీద రెండు చక్రము లున్నవి. చక్రప్రాంతములందు స్వస్తికయు, త్రిశూలముమ కనిపించును.
శిలా స్తంభము : బుద్ధవనమని నేడు వాడుకలో నున్న గ్రామపు పశ్చిమ ప్రాంతమున శిలా స్తంభమున్నది. ఇది
537