Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీసుదేశము (భూ)

సంగ్రహ ఆంధ్ర

ఏథెన్సు నగరములో సగటున 14"-15" ల వాన కురియును. ఒండుమట్టితో కూడియుండు మైదానములలో తప్ప ఇతరత్రకల భూములు సారవిహీనములు. వివరములను తెలిసికొనవలెనన్న గ్రీసుదేశమును భౌగోళికముగా నాలుగు భాగములు చేయవచ్చును : 1. మేసిడోనియా, ధ్రేసులలో చేరియున్న ఈశాన్యభాగము; 2. గ్రీకు ద్వీపకల్పము; 3. పెలెపోనెసస్ (Peloponnesus); 4. గ్రీకు దీవులు.

మేసిడోనియా, థ్రేసు : ఈశాన్యదిశయందున్న గ్రీసుదేశము యొక్క ఈ భాగము బాల్కను ప్రదేశముల యొక్క అనుబంధముగా నున్నది. ఈ ప్రాంతమందు అంచెలుగానుండు మైదానములు కలవు. ఉత్తరమందు క్రమముగా ఎత్తుగా లేచుచున్న చిన్నకొండలు రొడోవ్ (Rhodope) పర్వతము లనబడుచున్నవి. గ్రీసునందలి ఈ ప్రాంతము వ్యవసాయముదృష్ట్యా ఇతర భాగముల కంటె అధిక ప్రాధాన్యమును వహించుచున్నది. ఇది జనాకీర్ణమై యున్నది. యుగోస్లేవియా సరిహద్దుమీదుగా ఉత్తరమునుండి ఏజియన్ సముద్రములోనికి ప్రవహించు చున్న వరదార్ నదియొక్క లోయ ప్రస్తుతము రష్యావారి పలుకుబడిలోనున్న డాన్యూబ్ ప్రాంతమునకు త్రోవను కల్పించుచున్నది. ఈ కారణముచే ఈ ప్రాంతము రాజకీయముగా భయ ప్రమాదములకు గురియగు చుండును. మైదానములు వేసవిలో పొడిగా నుండును. ఇది శీతకాలమందును, వసంతఋతువునందును వరదలకు లోనగుచుండును. అందుచేత ఆ కాలములందు నేలలు చిత్తడిగ నుండి చలిజ్వరములు వచ్చుచుండును. ఈ చిత్తడి నేలలు క్రమముగ సారవంతమగు భూములుగా మారి ఫలవంతము లగుచున్నవి. ఇచట శీతకాలము మిక్కిలి దుర్భరమై యుండును. సాధారణముగా మంచు కురియుచుండును. వేసవిలో మిక్కిలి పొడిగానుండును. కనుక ఆ కాలమందలి వ్యవసాయము నీటిపారుదలమీదనే ఆధారపడియుండును. ఇచట ఆలివు వృక్షములు పెరుగవు. ద్రాక్షఫలములు, తదితర ఫలములు పండును. పొగాకు బాగుగా అభివృద్ధిచెందును. ఇవి అన్నియు ఎగుమతి చేయబడును. సముద్రతీర ప్రాంతములు పల్లముగను, తేమగను ఉండును. అందుచే ఈ ప్రాంతములందు సాధారణముగ జనావాసము లేర్పడవు. ఇందు రెండు ముఖ్యమైన రేవు పట్టణములు కలవు. వీటిలో సెలోనికా యొకటి. ఇది వరదార్ నదీముఖద్వారమువద్ద నున్నది. 1951 వ లెక్కల ననుసరించి ఇందలి జనాభా 2,17,049. ఇది గ్రీసుదేశము నందలి రెండవ పెద్దపట్టణము. ఒక ఉత్తర గ్రీసునకేకాక యుగోస్లేవియా, బల్గేరియాలలో కొంతభాగమునకుకూడ ఈ రేవు వరదార్ నదీలోయగుండా ఒక నిర్గమనద్వారమై యున్నది. రెండవ పట్టణము కవల్ల (Kavalla) అనునది. ఇది థ్రేస్‌లో నున్నది. ఇందలి జనాభా 50,000 మంది. మేసిడోనియా రాజ్యము గ్రీసుదేశమునంతయు కొంతకాలము పాలించియున్నను, మేసిడోనియా చక్రవర్తి యగు అలెగ్జాండరు దూరపు ఆసియాలోకూడ సామ్రాజ్యమును విస్తరింపజేసి యున్నను, గ్రీసుయొక్క ప్రాచీన ఘనకృత్యములలో ఉత్తరదేశము విశేషముగా పాల్గొన లేదు.

గ్రీకు ద్వీపకల్పము: ఇది చారిత్రకముగా అధిక ప్రాముఖ్యమును చెందియున్నది. మధ్యనున్న ముడుత పర్వతపంక్తి యొకటి యుగోస్లేవియా, ఆల్బేనియా దేశముల సరిహద్దులనుండి దక్షిణముగా వ్యాపించియున్నది. ఈ పర్వతములు నిమ్నోన్నతమగు నైసర్గిక స్థితియు, సంశ్లిష్టమగు భూతత్త్వ నిర్మాణమును కలవి. ఈ పర్వత శ్రేణి ఉత్తర దిశయందు ప్రత్యేక ఖండముగా విచ్ఛిన్నమై దక్షిణ భాగమందు పిండస్ పర్వత మనబడు ఏకాండపు శిలోచ్చయముగ ఏర్పడియున్నది. ఇందు పశువుల కాపరులకు ఆవాసములగు కొన్ని గ్రామములు మాత్రమే కలవు. గొఱ్ఱెలు, మేకలు ఇచట మేపబడుచుండును. వ్యవసాయము స్వల్పముగ జరుగును. పర్వతపు వంపులమీది అడవులు నరికివేయబడుటచే విపరీతమగు భూమికోత (soil erosion) ఏర్పడెను. శీతకాలమున వర్షములు మిక్కుటముగా నుండును. పర్వతప్రదేశములందు లోతైన మంచు ఏర్పడుచుండును.

పశ్చిమ గ్రీసు (మధ్య పర్వతశ్రేణికి పశ్చిమ భాగము) ఎత్తు తక్కువగా నుండును. అందు తీరమునకు సమాంతరముగా మడ్డిచిట్టెముగట్టిన ముడుత కొండలవరుసలుకలవు. అచట చిన్న చిన్న తీరపు మైదానములు కలవు. వాటి యందలి పొడవులేని సెలయేళ్ళు అయోనియన్ సముద్ర

532