విజ్ఞానకోశము - 3
గ్రీసుదేశము (భూ)
ఉన్నది. 1951 వ సంవత్సరపు లెక్కలనుబట్టి దీని విస్తృతి 51,168 చ. మైళ్ళు. జనాభా 76,32,801. ఇందు ప్రజాస్వామిక ప్రభుత్వము కలదు. ఇచటి ద్రవ్యమానమునకు (monetary unit) 'డ్రాక్మ' అని పేరు. ఇవి 84 అగుచో ఒక పౌను (స్టెర్లింగు) తో సమానమగును. ప్రజలలో పెక్కురు ప్రాచీనసంప్రదాయపు (orthodox) చర్చికి చెందిన క్రైస్తవులు. రాజ్యాంగ విధానము ననుసరించి ఇతర మతములకు చెందిన జనులకు కూడ ఇచట మత స్వాతంత్ర్యము కలదు.
ప్రాచీన వైభవమునకు గ్రీసుదేశము మిక్కిలి ప్రసిద్ధి గాంచియున్నది. ఇది పశ్చిమఐరోపా నాగరకతయందును పరిపాలనావిధానమునందును పురోగామిగా ప్రసిద్ధి నొంది యున్నది. కాని నేడు కేవలము జీవికకొరకే గ్రీకులు ప్రకృతిని, తోటిమానవులను కఠినముగా ఎదుర్కొనవలసినవా రగుచున్నారు. తూర్పు మధ్యధరాసముద్రమునను ఉపగమించు మార్గమును (టర్కీతో కలిసి) తన యధీనమునం దుంచుకొనుటకు తోడ్పడునట్టి గ్రీకుయొక్క నైసర్గికస్థితి మూలముననే అది యూరపుఖండమున ప్రాక్పశ్చిమదేశ గతములయిన రాజకీయ పక్షముల మధ్య ఏర్పడిన సంఘర్షమున ప్రప్రథమమున బలియయ్యెను. 1830 వ సంవత్సరమువరకు గ్రీసుదేశము టర్కీ దేశముయొక్క అధికారమునకు లోబడియుండెను. కాని దానికి స్వాతంత్ర్యము లభించినపిదప 1923 లో జనాభాయొక్క వినిమయము జరిగెను. అందుచే 6,00,000 మంది టర్కీ దేశీయులు స్వదేశమును విడిచిపోయిరి. 15,00,000 మంది గ్రీకుదేశీయులు గ్రీసుదేశమునకు వలస వచ్చిరి. ఇదివరకే దారిద్ర్యముతో పీడింపబడుచున్న గ్రీసుదేశములో ఇంత మంది కాందిశీకులు ఇముడుట అతికష్టసాధ్య మయ్యెను. కాని దేశమందు ఈ వినిమయమువలన ఒకేజాతికి చెందిన జనాభా ఏర్పడెను. ఇప్పటికిని అనేకమంది దేశాంతరములం దున్నారు. రెండవ ప్రపంచయుద్ధ కాలమందు గ్రీసుదేశము ఇతర ప్రధానశక్తులమూలమున ఉపద్రవమునకు గురి అయ్యెను. తదుపరి దేశముయొక్క ఉత్తరభాగమందున్న సోవియట్ రష్యాపక్షమువా రగు గోరిల్లాలకును ప్రజాస్వామిక మగు గ్రీసుప్రభుత్వమునకును మధ్య అంతర్యుద్ధము ప్రవర్తిల్లెను. అమెరికాదేశముయొక్క సహాయముతో గ్రీసుదేశము ఛిన్నాభిన్నమైన తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకొన్నది. నేడు గ్రీసు సంప్రదాయ సిద్ధమయిన తన ప్రాచీన వైభవానుగుణముగా ఆగ్నేయ యూరపునందలి ప్రజాస్వామికమున కొక ఉప స్తంభమువలె నిలిచియున్నది.
గ్రీసుదేశము నిమ్నోన్నతమగు భూమి కలది. ఇది ఆయా ఋతువులందే మిక్కిలి వేగముగా ప్రవహించు నదులతో కూడి యున్నది. ఇందు మధ్యమధ్య విచ్ఛిన్నమయిన తీరపుమైదానములు కలవు. వాయవ్యదిశనుండి ఆగ్నేయమువరకు వ్యాపించియున్న ఇందలి ఎగుడు దిగుడు కొండల వరుసలు బాల్కను పర్వతముల ధోరణిని అనుకరించుచున్నవి. వీటిలో పిండస్ పర్వతములు అత్యంతము ముఖ్యములైనవి. ఏజియన్, ఎడ్రియాటిక్ మడుగుల క్రుంగుదలయొక్క ఫలితముగా ఈ దేశము అనేకములగు ద్వీపకల్పములతోను, ద్వీపములతోను ఏర్పడియున్నది. దేశముయొక్క మిట్టపల్లములతో కూడిన నైసర్గికస్థితియు, విచ్ఛిన్న తీరరేఖయు గ్రీకులను సముద్రయానమందు అభిరుచి కలవారినిగా చేసెను. ప్రాచీన కాలమునుండియు వారు నౌకాయానమునకు సంబంధించిన సంప్రదాయమును కలిగియుండిరి. నేటికిని గ్రీసు యొక్క పరిమాణమును, ఉపపత్తుల (resources) ను బట్టి చూడగా దానికి అట్టి దేశము లన్నిటికంటె గురుతర భారమును మోయగల నౌకాసంపత్తి (shipping tonnage) కలదనవచ్చును. ఈ దేశమందు మధ్యధరామండలమునకు చెందిన ప్రత్యేక శీతోష్ణస్థితి కలదు. ఇచట సిరొకో (sirocco) అనబడు వాయువులు వీచుచుండును. పొడిగాను, ఉష్ణముగాను ఉండు వేసవియు, సౌమ్యవృష్టి గల శీతకాలమును ఇచట కనిపించును. దేశముయొక్క ఉత్తరభాగమం దున్న మేసిడోనియా, థ్రేస్ అను మైదానములు మాత్రమే తీవ్రమగు . శీతకాలములతో కూడిన ఖండాంతర్గత శీతోష్ణస్థితివంటి శీతోష్ణస్థితిని కలిగియుండును. మధ్యగత పర్వత సముదాయము కారణముగా పశ్చిమగ్రీసులో చాలినంత వాన పడును. ఆ వర్షపాతము తరచుగ 50" లకు మించి యుండును. కాని దేశము యొక్క తూర్పుభాగమున అల్ప వర్షపాతము, తరచుగ నీటిక్షామము ఘటిల్లును.
531