Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రీన్‌లాండ్

అంగుళములు ; 'గాడ్‌తాబ్' లో (Godthaab) 26 అంగుళములు ; 'ఇవిగ్‌టట్' లో (Ivigtut) 46 అంగుళములు ; 'ఆంగో మాగ్ సాలిక్' లో (Angomagsolik) 37 అంగుళములు ; 'డామర్క్‌షాన్' లో (Damarkshon) 6 అంగుళములు .

జంతుసంపద : గ్రీన్‌లాండునందలి సన్తనజాతి జంతువులు (mamalia) ప్రకృతిలక్షణ విషయమున ఐరోపా సన్తనజాతి జంతువులకంటె ఎక్కువగా అమెరికా సన్తన జాతి జంతువులను పోలియున్నవి. కస్తూరివృషభము (nuskox); లెమింగ్ పోలార్‌తోడేలు; ఎస్కిమోకుక్క, రెయిన్‌డీర్ అను జంతువులన్నియు అమెరికానుండి వలస వచ్చినవే. జలచరములగు సీల్స్, తిమింగలములు, చేపలు కూడా అమెరికా జలచరజాతికి చెందినవే. రెయిన్‌డీర్లు, తెల్లకుందేళ్ళు, ఆర్కిటిక్ గుంటనక్కలు. పోలార్ ఎలుగుబంట్లు అన్ని ప్రాంతములయందును కనిపించును. తోడేళ్లు, కస్తూరి వృషభములు అడపదడప ఉత్తరగ్రీన్‌లాండ్ ప్రాంతమందు కనిపించును. ఆదియందు రెయిన్‌డీర్లు అసంఖ్యాకములుగా నుండెడివి. కాని వేట కారణముగా వాటి సంఖ్య క్రమముగా క్షీణించినది. మంచుతోలేని విశాలప్రదేశములయందు ఈ రెయిన్‌డీర్లు విశేషముగా గోచరించును. 'మే' అగ్రము (cape may) నుండి 'స్కోర్సుబీసౌండ్' వరకును - ఈ మధ్యప్రాంతమున కస్తూరి వృషభజాతి జంతువులు చిన్నచిన్న మందలుగా తిరుగుచుండును. పోలార్ ఎలుగు బంట్లు గ్రీన్‌లాండ్ సముద్రతీరము నందు ఎల్లెడల లభ్యమగును.

'సీల్' అను జలచర జంతువులలో అనేక రకములు గలవు. ఉదా : హుడెడ్‌సీల్ (తల, భుజము కప్పివేయ బడినట్టిది); గ్రీన్‌లాండ్‌సీల్; రింగ్డ్ సీల్ (ringed seal); హార్బర్ సీల్; గడ్డపు సీల్ (bearded seal); వాల్రస్, సముద్ర జలచరములలో పెక్కు రకములు కానరావు. కాని ఏకైకజంతువుయొక్క సంఖ్య అధికముగా నున్నది.

తిమింగలములలో అనేక జాతులు కలవు. వేటమూలమున ఇవి చాలవరకు సంఖ్యలో తగ్గిపోయినవి. గ్రీన్‌లాండు తిమింగలము లేక 'బౌహెడ్' అను తిమింగలము ఉత్తరసముద్ర జలములకు చెందిన 'రైట్' అను తిమింగల జాతికి చెందినది. ఇది దక్షిణతీర జలములలో గల 'రైట్ ' అను తిమింగలముల జాతికంటె స్పష్టముగా భిన్నమైనది. దీని పొడవు 70 అడుగులు. ఇది నల్లగా నుండును. దీనికి అడుగునమాత్రము తెల్లని మచ్చ ఒకటి యుండును. ఈ తిమింగలమువలన 275 పీపాల నూనెయు, 3,000 పౌనుల ఎముకలును లభింపవచ్చును. ఈ తిమింగలములు నిరంతరము జరుగు వేటకారణముగా పూర్వముకన్న అపురూపమైనవి.

కాడ్ (cod), కాప్లిన్ (coplin), రెడ్ ఫిష్ (red fish), నెపిసాక్ (nepisak) అను చేపల పరిశ్రమలు కలవు. షార్క్ (shark) అను చేపయొక్క కారిజము (liver) నుండి చమురు తీయబడును. తెల్లని నక్కల నుండియు, నీలివన్నె నక్కలనుండియు, పోలార్ ఎలుగుబంట్ల నుండియు విలువైన ఉన్ని లభ్యమగుచున్నది. ఉత్తరప్రాంతనుం దున్న 'ఆర్‌పిక్' (orpik) వరకును, స్కోర్స్ బీసౌండ్ వద్దను, కొన్నిచోట్ల పొదలును, కొన్నిచోట్ల చిన్నచిన్నవృక్షములును కన్పించును. 'జూలియెన్‌హాబ్ (Julianhab) మండలములో కొండరావిచెట్లు (birches) 20 అడుగుల ఎత్తువరకు పెరుగును విల్లో, ఆల్డర్, మౌంటెన్ ఆష్ అను వృక్షజాతులు విరివిగా పెరుగును. డిస్కోద్వీపమునందు కొండరావివంటి మరుగుజ్జు చెట్లు సాధారణముగా కనిపించును. అవి 3 అడుగుల ఎత్తుండును. రకరకములైన నాచులు, రుచికరము లైన మొక్కలు, పెరుగుదలకు అనువయిన స్థలముల యందు కాననగును. గ్రీన్ లాండులో నైరృతి దిక్కున పశువులకు మంచి గడ్డి లభించగలదు.

వ్యవసాయము, పరిశ్రమలు: గ్రీన్‌లాండులో వేసవికాలపు పరిమితి స్వల్పమగుటచేతను, శీతోష్ణస్థితి (climate) అత్యంత శీతలమగుటచేతను, క్యారటు, లెట్యూస్, టర్నివ్స్‌వంటి కూరగాయలు తప్ప ఇతర వ్యవసాయపు పంటలు పండించుట కష్టము. నైరృతిదిశలోనున్న ఇరుకుమూతి సముద్రశాఖల పరిసరములయందున్న పచ్చిక బయళ్ల యందు పశువులను, గొఱ్ఱెలను జయప్రదముగా సాకవచ్చును. జంతువుల చర్మములను పదును చేయుటయు, సముద్రపు జంతువులనుండి నూనె తీయుటయు ఈ దేశమునందలి ముఖ్యములైన పరిశ్రమలు.

ఇవిగ్‌టట్ వద్ద వర్తకమునకు ఉపయోగించు 'క్రియొ

519