Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర

ముల ననుసరించి దుస్తులు ధరించెడివారు. వీరిలో మహ మ్మద్ కులీమాత్రము స్థానిక వేషభాషల ననుకరిం చెను. గోలకొండ ప్రభువులలో మహమ్మదు కులీ ఒక్కడే గడ్డ మును తీయించి వేసెను. ఆతడు తెలుగుభాషను అభ్యసించి కొన్ని పద్యములు వ్రాసెను. అవి ఇపుడు అలభ్యములు. స్థానిక ములుగు జరుగు ఉరుసులలో అతడు పాల్గొను చుండెడివాడు.

స్థానిక ప్రజలు తమతమ సంప్రదాయముల ననుసరించి కోట్లు, పాగాలు, దోవతులు, ధరించుచుండిరి. హుక్కా పీల్చుట గౌరవ సూచకముగా భావింపబడుచుం డెను. ధనికులు మద్యపానప్రియులై, వేశ్యాలోలురై యుండిరి. ఇక్కడి ప్రజలు శుభ్రమయిన వస్త్రములు ధరించెడివా రనియు, చక్కని దేహచ్ఛాయ కలవారై యుండిరనియు ఎత్తైనవారనియు, సుందరాకారము కలిగియుండిరనియు, విదేశీయుల వ్రాతల వలన తెలియుచున్నది. రాజులు, రాజాధి కారులు బ్రాహ్మణుల కన్నియలకు వివాహములు కావించుట పుణ్యకార్యముగ భావించెడివారు. వస్త్ర దానము, అన్నదానము విరివిగ జరుగుచుండెను.

పెండ్లిండ్ల సందర్భమున, పెండ్లి కుమార్తె కన్నులకు కాటుక, సుర్మా తీర్చెడివారు. చంద్రబింబమువంటి తిలకమును దిద్దువారు. ముత్యాలపాపట తీర్చెడివారు. వివిధ పుష్పములచే కేశాలంకరణము చేసెడి వారు. పెండ్లికుమార్తె పాదములకును, చేతులకును, పారాణి నలంకరించెడివారు. ఈ సందర్భమున ముత్తైదువులకును, కన్నియలకును, ముత్యాల అంచు చీరలను కానుకలుగ నొసగుచుండిరి.

గోలకొండ నగరము వివిధ కళలకు విద్యలకు కేంద్ర ముగ వర్ధిల్లినది. శిల్పము, చిత్రకళ, చక్కని వ్రాత, అభిమాన విషయములుగ నుండెను. భవన నిర్మాణ నై పుణి ఆనాటి వారికి వెన్నతో బెట్టిన విద్యయై యుండెను. సుల్తానుల దర్బారులలో, సమర్థులగు ఇంజనీర్లుండిరి. జ్యోతిష్కులకు, విద్వాంసులకు, మతగురువులకు, కవులకు, గోలకొండ దర్బారునందు సముచితస్థానము లభించినది. యూనానీ, డచ్చి వైద్యులు రాజ గౌరవమునకు పాత్రు లైరి. సంవత్సరమునకు 800 లు పగడాల వేతనమునిచ్చి ఒకానొక డచ్చి శస్త్ర చికిత్సకుని తన ఆస్థాన వైద్యునిగ నియమించి సుల్తాను గౌరవించెను. రాజు ఫర్మానాలు పారశీక భాషలో నుండెడివి.

చక్కని దస్తూరియే కాక, ప్రత్యేక లేఖన పద్ధతు లెరి గిన గూఢచారులుండిరి. అట్టి లేఖనలను చదువగలిగిన కారణముననే అక్కన్న మాదన్నలు గోలకొండ సుల్తాను ఆదరానుగ్రహములకు పాత్రులై రని జనశ్రుతి. గోల కొండ సుల్తానులు పారసీకము, అరబ్బీ, ఉర్దూ, తెలుగు అను భాషలకు ఉచితరీతి ఆదరము కల్పించిరి. పండితులను కవులను సత్కరించి, వారిచేత కృతులు వ్రాయించిరి. అమీర్ షా, మహమ్మద్ షీరాజీ, కాసిం బేగ్ వంటి పండి తులు నేటికిని ఉర్దూ, పారసీక వాఙ్మయ చరిత్రలో పేరు పొందిన కవులు. నాటి ఉర్దూ కావ్యములు ప్రత్యేక తను కలిగియుండి, సాహిత్యమునకు అలంకార ప్రాయము లయిన రచనలుగా కీర్తింపబడుచున్నవి.

గోలకొండ సుల్తానుల కాలమున తెలుగు కవులు ప్రత్యేకాదరమునకు పాత్రులైరి. రాజులేకాక రాజాధి కారులును పండితుల సత్కరించి వారిచేత గ్రంథములు వ్రాయించిరి. ఆనాడు వ్రాయబడిన కావ్యములు ఆంధ్ర వాఙ్మయమునందు ప్రత్యేక గుణములుకలపై యున్నవి. అచ్చ తెనుగు కావ్యరచన కుతుబు షాహీల కాలమున వెలువడుట వారికి స్థిరకీర్తి దాయక మైనది. అద్దంకి గంగా ధర కవి రచించిన 'తపతీ సంవరణోపాఖ్యానము', పొన్న గంటి తెలగనార్యుని 'యయాతి చరిత్ర' గోలకొండ సుల్తానులకు, అధికారులకు గొప్పకీర్తి నార్జించినవి. మరిం గంటి సింగరాచార్య కవివంటివారెందరో సుల్తానొసగిన మన్ననలకును, గౌరవ బిరుదములకును పాత్రులైరి. రామదాసు కీర్తనలు తానాషా కాలమున రచింప బడి

గోలకొండ సుల్తానులు ప్రదర్శించిన మత సామరస్య మెన్నదగినది. ప్రభువులు మహమ్మదీయులు. పాలిత ప్రజలలో అధిక సంఖ్యాకులు హిందువులు. ఒకటి రెండు సందర్భములందు తప్ప గోలకొండ చరిత్రలో, హిందూ మహమ్మదీయ మత సామరస్యమునకు ఎట్టి భంగము కలుగలేదు. ఔరంగ జేబు గోలకొండను ముట్టడించుటకు గల హేతువులలో తానాషా హిందూప్రజలయందు చూపిన అభిమాన మొకటి యని చరిత్రవలన తెలియును.