Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోతముడు (అక్షపాదుడు)

సంస్థ. ఈ శయనమందిరములను 'గోతుల్' అనెదరు. బస్తర్‌కు చెందిన 'మురియ', 'మారియా' అను గోండులలో వివాహితులు కాని యువతీ యువకులకు ప్రత్యేకమైన గృహములు కట్టబడి యుండును. 'మురియా గోతుల్' అను గృహమునకు పెండ్లికాని బాల బాలికలు పోవుచుందురు. గృహేతర ప్రదేశములలో పగటి భోజనముచేసి బాలబాలికలు ఒకచోట సమావేశ మయ్యెదరు. తల్లిదండ్రు లెవ్వరు వారి పుత్త్రీపుత్రులను యీ 'గోతుల్' ను దర్శించుటకు అభ్యంతర పెట్టరు. ఆ సంస్థ జయప్రదముగా పనిచేయుటకు పెద్దల ప్రోత్సాహమును, సంఘముయొక్క అనుమతియు ముఖ్యకారణములయి యున్నవి. 'మురియా' యువతీయువకులు 'గోతుల్' ను తప్పక దర్శింపవలయును. అట్లుగాక తగినంత కారణము లేనిదే యచటికివచ్చుట మానిన యెడల అట్టివారికి, జరిమానా విధింపబడును. ఇట్లు నిరంతర సహవాసమువలనను, సాహచర్య కలిమివలనను గోతుల్ గృహంతర వర్తనులగు పడుచువారు కామ ప్రకోపితులగుట సహజముగా సంభవించును. విధాయకముగ వారు సంగమ కార్యములును జరుపుదురు. కాని ఒకే గుంపునకు చెందిన యువతీయువకులమధ్య ఇట్టి యువతీయువకుల మధ్య ఇట్టి

చిత్రము - 117

పటము - 3

దండారి అను పంట కోతలసమయములో గోండులు తెలుపు, నలుపు రంగులు పూసికొని నెమలియీకల కిరీటము ధరించి కావించు వినోదలీలావిలాస నృత్యములు.

అన్యోన్య సాంగత్యము తీవ్రముగా నిషేధింపబడుచున్నది.

యువతీ యువకులు కొన్ని సంవత్సరములవరకు పరస్పరము అతి సన్నిహితముగానుండి ఒకరిని గురించి యొకరు తెలిసికొను అవకాశము కలిగిన తరువాతనే వారిరువురకును వివాహము జరుగును. దీనివలన జీవితమునందు తగిన భాగస్వాములను ఎన్నుకొనుటకు మంచి అవకాశము లభించును. వివాహ మైనతరువాత భార్యగాని భర్తగాని గోతుల్‌లో సభ్యులుగా నుండరు. అసలు దానిని దర్శింపనే దర్శింపరు. మహాదేవుడు, నారాయణదేవుడు, దుల్హాపన్, మూరాడ్కి, బిగ్రహ, మరపన్, హొలెరాయ, బరియర్పన్, ఫర్సి పెన్ మొదలైన దేవతలను వీరు ముఖ్యముగా కొలుతురు.

సాధారణముగా మృతిచెందినవారు ఖననము చేయ బడుదురు. ఉన్నత పదవిలోనున్న వ్యక్తి మరణించిన యెడల దహనము చేయబడును. కాని ఆ వ్యక్తి ఖననముగాని, దహనముగాని చేయబడుటకు ముందు ఆతని లేక ఆమెయొక్క మృతికి కారణమును విధిగా తెలిసికొందురు. ఏవ్యక్తి అయినను మంత్రతంత్రముల మూలమున చనిపోయినయెడల అది ఆజాతికంతకు సంబంధించిన తీవ్ర సమస్యగా ఏర్పడును. ఆ మంత్రగానిని పట్టుకొని కఠినముగా శిక్షింతురు.

రా. ప్ర.


గోతముడు (అక్షపాదుడు) :

సుమారు మూడువేల సంవత్సరముల క్రిందటి ప్రాచీనార్యుల అనుపమేయ కుశాగ్రబుద్ధిని వెల్లడి చేయుటలో ప్రసిద్ధి కెక్కిన తత్త్వగ్రంథము లారు. ఈ ఆరింటిని షడ్దర్శనములని పిలచెదరు. ఈ షడ్దర్శనములలో న్యాయదర్శన మొకటి. ఈ న్యాయదర్శన కర్త గోతము డనువాడు. ఇతనికి అక్షపాదుడను విశేషనామము గలదు. న్యాయదర్శనమునకు న్యాయవిద్య, న్యాయశాస్త్రము, న్యాయసూత్రములు, తర్కశాస్త్రము అను నామాంతరములు కలవు.

ఈ న్యాయసూత్రములు రచించిన గోతము డెవడు? ఏ కాలమువాడు? ఏ దేశమువాడు? ఇతని పేరు గోతముడా? గౌతముడా ? ఇత్యాది విషయములను గూర్చి వాదోపవాదములు కలవు.

గోతములు, గౌతములు పెక్కుమంది కలరు ; సుమారు

441