Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్ప గ్రంథాలయములు

సంగ్రహ ఆంధ్ర

1629 నాటి ఇటాలియను నిఘంటువును, తదితర అమూల్య సంపుటములును ఇందు చేరియున్నవి. 1814 లో స్థాపింపబడిన లెనిన్‌గ్రాడ్ గ్రంథాలయములో నిర్మింపబడిన 25 పఠనాగారములలో 2099 మంది ఒకేసారి కూర్చుండి చదువుకొను సౌకర్యము కలదు. పెక్కు విదేశసంస్థలకు మార్పిడిపద్ధతిపై ఈ గ్రంథాలయము బహుళసంఖ్యలో గ్రంథములను, సరఫరా చేయుచున్నది. బాలురకును,అంధులకును కార్మికకర్షకులకును ప్రత్యేకముగా గ్రంథాలయము లేర్పరచుట సోవియట్ రష్యా యందొక ప్రత్యేక విశిష్టత.

జర్మనీ : ప్రపంచములో ఒక్క జర్మనీలో మాత్రమే ప్రత్యేకమైన శాస్త్రగ్రంథములు పరిశోధకుల కుపయోగించునవి బహుళ సంఖ్యలో ప్రకటింపబడినవి. బెర్లిను నగరమందలి ప్రష్యను రాష్ట్రీయ గ్రంథాలయము చెప్పదగినది. దానియందుగల 20 లక్షల గ్రంథములకు తోడుగ ఏటేట 50 వేల క్రొత్త గ్రంథములు చేరుచుండును. ఇందు మాస, పక్షాదులయందు ప్రచురింపబడు పత్రికలు 20 వేలు కలవు. 2 లక్షల చ. అ. వైశాల్యము గల 13 అంతస్తులతో ఈ గ్రంథాలయ భవనము ఒప్పారు చుండును. వివిధ విజ్ఞానములకు వర్గీకృతము లయిన గ్రంథసూచికలు (కేటలాగులు) వేయి కలవు. అక్షర క్రమమున 3 వేల గ్రంథసూచికా సంపుటములు కలవు. అట్టివి 90 సంపుటములు ఏటేట అందు చేరుచుండును. అందు 320 మంది సిబ్బందియు, 76 మంది ప్రత్యేక శాస్త్ర నిపుణులును గలరు. వీ రందరును గ్రంథవర్గీకరణములోను, పాఠకులకు వలసిన గ్రంథముల నందిచ్చుటలోను సాయపడుదురు. సర్వశాస్త్రీయ గ్రంథాలయములకును కలిపి సమష్టిగ్రంథ సూచిక యొకటి ప్రకటింపబడెను. దీని మూలమున పాఠకుడు తన స్థానిక గ్రంథాలయముద్వారా ప్రష్యానుండి తనకు కావలసిన గ్రంథములను తెప్పించుకొనవచ్చును. పై నుదహరింపబడిన ప్రష్యను గ్రంథాలయము కాక, జర్మనీయందు ఈ క్రింది గ్రంథాలయములుగూడ గలవు.

గ్రంథములు
1. స్టేట్ లైబ్రరీ, బెర్లిన్ ( రెండవ ప్రపంచ సంగ్రామములో నశించినవి పోగా) 15,00,000
2. స్టేట్ లైబ్రరీ, మ్యూనిక్ 20,00,000
3. లీప్జిగ్ గ్రంథాలయము 20,00,000

రెండవ ప్రపంచసంగ్రామములో జర్మనీలో మొత్తము 25,00,000 గ్రంథములు నశించినవి.

ప్రాన్సు : ఫ్రాన్సుదేశము యొక్క రాజధానీ నగరమయిన పారిసు గ్రంథాలయము ప్రపంచములో అన్నిటికంటె అద్భుతానందవహ మయినట్టిది. "బిల్లి యోధీఖ్ నేషనేల్" అని దీనికి పేరు. ఇందు దాదాపు 60,00,000 సంపుటములు, 1,50,000 వ్రాత ప్రతులు, 4,50,000 పతకములు, నాణెములు, 50,00,000 ముద్రణములు (prints), చెక్కడముల దిమ్మెలు (engravings) కలవు.

ఇంగ్లండు: ఇంగ్లండులో 1341న ఒకానొక మతగురువు ఒక గ్రంథాలయమును, బోడ్లీ అను నాతడు ఆక్స్‌ఫర్డ్ నందు మరొక గ్రంథాలయమును స్థాపించిరట. 1425 లో రిచర్టు వెల్లింగ్టన్, విలియమ్ చెరి అనువారు లండన్‌లో స్థాపించిన 'లా' గ్రంథాలయమే నేటికి నిలిచియున్న వాటిలో పురాతనమైనది. 16 వ శతాబ్దమున స్థాపింప బడిన 'ఇన్నర్ టెంపుల్ గ్రంథాలయము'లో శిలాశాస్త్ర గ్రంథములు 40 వేలు ఉన్నవట. ఈ గ్రంథాలయము ప్రజా పరిపోషితము.

ఆంగ్ల దేశమున 1850 వ సంవత్సరమున 'ఎవర్టు' గ్రంథాలయ చట్టముతో ప్రారంభమైన గ్రంథాలయోద్యమము చాలకాలము మందముగా సాగెను. 1880 - 90 మధ్య విక్టోరియారాణి జూబిలీ ఉత్సవసందర్భమున సంపాదితములయిన గ్రంథములతోను, 'కార్నిగీ' సంస్థవారి ప్రోత్సాహముతోను (1890-1899), కార్నిగీసంస్థ వారి దేశీయ గ్రంథాలయ విస్తరణ పథకముతోను (1920-27), 1927 నాటికి 50 దేశీయ గ్రంథాలయములును, 480 ఇతర గ్రంథాలయములును వెలసినవి. వీటి మూలమున గ్రంథాలయ విస్తరణోద్యమము బ్రిటనులో చక్కగా సాగినది. జనాభాలో నూటికి 96.3 వంతులు పుస్తకములను చదువగలుగుట కవకాశమేర్పడినది. గ్రామ నగర ప్రాంతములందు మొత్తముమీద 1 కోటి 30 లక్షల పుస్తకములున్నవి. సంవత్సరమునకు చదువబడిన పుస్తకములసంఖ్య 8 కోట్లు. నేడు బ్రిటనులోని గ్రంథాలయ పటిష్ఠీకరణ,

438