Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్ప గ్రంథాలయములు

సంగ్రహ ఆంధ్ర

ంనదలి సంఖ్యలు వాటిపై లిఖింపబడెడివి. గ్రంథాలయాధికారుల నామములు రాజులపేళ్ళవలె జాబితాగా వ్రాయబడుచుండెను.

కాన్ట్సాంటినోపిల్ : కాన్ట్సాంటైన్ చక్రవర్తి తన సామ్రాజ్యకేంద్రమును బాస్ఫరస్ నదిపైగల యొక క్రొత్త నగరమునకు మార్చినపుడు, అచట నొక ప్రభుత్వ గ్రంథాలయమును ఆతడేర్పరచెను. అందు క్రైస్తవ వాఙ్మయమునుగూడ చేర్చియుండవచ్చును. అతని తరువాతి ప్రభువులగు జూలియన్, థియొడోసియస్ అను వారలు గ్రంథాలయ సంపుటములను 6900 నుండి ఒక లక్షవరకు పెంచిరి. జూలియన్ కాలమున కాన్ట్సాంటి నోపిల్ గ్రంథాలయాధికారిక్రింద ఏడుగురు వ్రాయసగాండ్రు ఉండెడివారట !

మధ్యయుగములో ప్రాచీనగ్రంథములు నిషేధింప బడినవి. విజ్ఞానము మతమునకు దాస్యము చేసినది. ఐరోపా యందు మోడువారిన గ్రంథాలయోద్యమ లత బ్రిటిష్ ద్వీపములందు చిగురించినది. 'టార్ససు' నివాసియగు థియొడారు రోమునుండి కాంటర్బరీకి పెక్కు పుస్తకములను తెచ్చెను (క్రీ. శ. 7 వ శతాబ్ది). ఆర్చిబిషప్ విగ్బర్టు స్థాపించిన యార్కు నగర గ్రంథాలయము కాంటర్బరీ గ్రంథాలయముకంటె గొప్పది. నాటి గ్రంథాలయాధికారి ఆల్షన్ (alcuin) తన ఆధీనమునగల గ్రంథముల కర్తల నామావళిని పద్యములలో వర్ణించెను. దీనినిబట్టి అట్టి గ్రంథాలయము 12 వ శతాబ్దినాటికైనను ఇంగ్లండు ఫ్రాన్సులయందు సహితము లేదనిన అత్యుక్తి కాదు. కాని అది 12 వ శతాబ్దమున దగ్దమాయెను. క్రీ. శ. 774లో 'ఫుల్టా' వద్ద స్థాపింపబడిన గ్రంథాలయమును చార్లిమాన్ అనునతడు అభివృద్ధిపరచెను. అది మధ్యయుగములో అసమానమైన కీర్తిని గడించెను, ఆ యుగములో అతడు సిల్వెస్టరువంటి గ్రంథసేకరణపిపాసాయుతుడు. అతడెంతో ధనమును వెచ్చించి ఇటలీ, జర్మనీ, బెల్జియమ్ దేశముల నుండి గ్రంథములను సేకరించెను. ప్రతి క్రైస్తవ ప్రార్థనాలయమున గ్రంథాలయమొకటి ఉండవలె ననునది 'బెనెడిక్టు' ఋషియొక్క ప్రధానసూత్రము. ప్లూరి, మెల్క్‌గాల్ ఈ ఋషి యొక్క పీఠస్థానములు. ఇవి స్వీయ గ్రంథాలయముల మూలమున ప్రసిద్ధికెక్కినవి.

ఇటలీలోని 'మాంటికాస్సినో' గ్రంథాలయము ఎన్నో కడగండ్లపాలై నేటికిని వర్థిల్లుచున్నది. మొదట (6 వ శ .) అది లంబార్డుల యొక్కయు, తరువాత సారసేనుల యొక్కయు ముట్టడులకు తట్టుకొన్నను, 9 వ శతాబ్దమున దగ్ధమై పునర్నిర్మింపబడెను.

ఫ్రాన్సులో ఫ్లూరి, కూని, కొర్చి అను ప్రదేశముల యందును; జర్మనీలో ఘల్డా, కార్వే, స్వన్హెమ్ అనుచోట్ల యందును ప్రప్రథమమున గ్రంథాలయములు వెలసినవి. ఇట్లే ఇంగ్లండులో కాంటర్బరీ, యార్క్, పేర్మత్‌జారో, విట్బి, గ్లాస్టన్‌బరీ, క్రాయ్‌లాండ్, పీటర్‌బరో, డర్హమ్ అను కేంద్రములందు మొట్టమొదట గ్రంథాలయములు బయలుదేరెను. నాటి ప్రార్థనాలయములు గ్రంథాలయములుగ పనిచేసి, లాటిన్ వాఙ్మయమును సంరక్షించెను.

సర్వప్రజోపయోగార్థము గ్రంథాలయములు వెలయ వలెనను సిద్దాంత బీజములు మొట్టమొదట అమెరికాలో మొలకెత్తెను. అవి సుదూర దేశములందు సైతము వ్యాపించెను. 1876 లో 103 మందితో స్థాపించబడిన అమెరికా గ్రంథాలయ సంఘముయొక్క సభ్యుల సంఖ్య 103 నుండి 12,000 లకు పెరిగినది. ఆ సంఘముయొక్క నిర్విరామ కృషి ఫలితముగా 644 గ్రంథాలయములు 6500 వరకు పెంపొందెను. 1925 లో ఒక ప్రత్యేకోద్యోగి గ్రంథాలయ పరిశీలనమునకై నియమింపబడెను. ఒక సంవత్సర తీవ్రకృషివలన ఒక నివేదిక వెలువడెను. 6 కోట్ల 40 లక్షలమంది ప్రజలు సాలునకు 24 కోట్ల పుస్తకములు చదివి రనియు, 9 కోట్ల రూపాయలు వ్యయము చేయబడె ననియు ఆ నివేదికలో పేర్కొనబడెను.

అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఘనతమమైన గ్రంథాలయము "లైబ్రరీ ఆఫ్ కాంగ్రెసు" (Library of Congress) అను పేరుతో నొప్పుచున్నది. ఇది క్రీ. శ. 1900 లో స్థాపిత మయినది. ఈ గ్రంథాలయమున 98,50,000 గ్రంథములు కలవు. న్యూయార్క్ నగరములోని పబ్లిక్ లైబ్రరీలో 55,00,000 గ్రంథములు కలవు. గ్రంథాలయముల అభివృద్ధి విషయములో అమెరికా విశ్వవిద్యాలయముల కృషి అమోఘముగా పెంపొందినది. ఈ క్రింది విశ్వవిద్యాలయములలో పుస్తక సంఖ్య లిట్లున్నవి :

436