విజ్ఞానకోశము - 3
గుఱ్ఱపు దళము
"ఫ్రెడరిక్ ది గ్రేట్" అను ప్రష్యాప్రభువు కాలములో ఆశ్వికదళముల ప్రాధాన్యము మరల హెచ్చెను. అతడు చేసిన 22 యుద్ధములలో, 15 యుద్ధములందు తుపాకుల సహాయమును పొందిన, సుశిక్షితములైన ఆశ్వికదళముల యొక్క ప్రయోగమువలన విజయము సిద్ధించెను. 1775-81 లో జరిగిన అమెరికా విప్లవములోను, ఫ్రెంచి విప్లవములోను ఆశ్వికదళముల ప్రాముఖ్య మంతగా కనిపించదు. నెపోలియన్ తన దండయాత్రలందు అనేకములైన ఆశ్వికదళములను ఉపయోగించినను, వాటిని ప్రముఖముగా శత్రువుల జాడలను అరయుటయందును, రహదారుల యొక్క పరిశీలనమందును, ఆత్మరక్షణ మందును, శత్రువును తరుముటయందును మాత్రమే వినియోగించెను.
భారతదేశమందు 1857లో బ్రిటిషు ప్రభుత్వముపై జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటములో భారతీయులును, బ్రిటిష్ సైనికులును భారీయెత్తున ఆశ్వికదళములను ఉపయోగించినట్లు లిఖితపూర్వకములైన ఆధారము లున్నవి. అంతకుపూర్వము హిందూ-ముస్లిమ్ ప్రభువుల నడుమ జరిగిన పెక్కు యుద్ధములలోను, మహారాష్ట్రులకు బ్రిటిష్ ప్రభుత్వమునకు మధ్య జరిగిన పోరాటములలోను, ఇరుపక్షములవారును ఆశ్వికదళములను విరివిగా ఉపయోగించినట్లు చారిత్ర కాధారము లున్నవి.
రైఫిల్‌యొక్క ప్రవేశముతో ఆశ్వికదళ వ్యూహములు అంతరించినవనియు, ప్రత్యేకమైన కీలక ప్రాముఖ్యముగల కొన్ని యుద్ధకలాపములలో మాత్రమే ఆశ్వికదళము లుపయోగపడగలవనియు ఆధునికులైన కొందరు యుద్ధతంత్రజ్ఞులు అభిప్రాయపడిరి. కాని 1914 వ ప్రపంచ సంగ్రామములో బహుళ సంఖ్యాకములైన ఆశ్విక దళములు పాల్గొనెను. బ్రిటిష్, ఫ్రెంచి, జర్మన్, రష్యను ప్రభుత్వములు ప్రత్యేకమైన పెక్కు ఆశ్విక దళములను నిర్మించెను. చరిత్రలో మున్నెన్నడును కనివిని ఎరుగని రీతిని మొదటి ప్రపంచ సంగ్రామమున 1916లో పదిలక్షల ఆశ్వికులు యుద్ధరంగములన్నిటిలో పాల్గొనిరి. వీరి పాత్ర అత్యంత ప్రాముఖ్యము వహించినదని పెక్కురు భావించి యున్నారు. ఈ యుద్ధమందు విమానదాడుల భీతి నుండి విముక్తమైన ఇరుపక్షముల యొక్క ఆశ్వికదళములు శత్రువర్గముయొక్క సైనిక నివహములపైగాక ప్రధాన సైనిక కార్యాలయములపై, సరఫరా కేంద్రములపై, రైలు మార్గములపై తమ దృష్టిని కేంద్రీకరించి వాటిని విశేష నష్టముల పాల్జేసెను.
ఆధునిక యుగములో అనుపమానమైన విధ్వంసకశక్తి గల మారణాయుధములు పెక్కులు కనుగొనబడినను, ఆశ్విక దళమునకు గల ప్రాధాన్యములో ఇప్పటికిని మార్పురాలేదు. దీనికి సంబంధించిన యుద్ధ వ్యూహమునకు భంగమువాటిల్లలేదు. ఆధునిక సైనికావసరములను పురస్కరించుకొని ఆశ్వికదళములు గూడ యాంత్రిక (Mechanised) మొనర్పబడినవి. తరగతుల వారిగా యాంత్రిక మొనర్పబడిన ఆశ్వికదళములు వాటి కర్తవ్యములను పూర్వము కంటె చురుకుగా, శక్తిమంతముగా నెరవేర్చుచున్నవి. వీటికి సహాయపడు ఇతర యుద్ధాంగములు కూడ తమ ప్రత్యేక బాధ్యతలను సౌలభ్యముతో నిర్వహించుచు, త్వరగా జయమును సాధింపగలుగుచున్నవి. మారణ యంత్రములందు కాలానుగుణములైన మార్పులు ప్రవేశపెట్టబడనిచో యుద్ధశాస్త్రము పరిణతి నొందదు. భౌతికావసరములను బట్టి మానవుని యొక్క సృజనాశక్తి ఇతర రంగములలో వలెనే సైనిక రంగమందును అతిశయించుచున్నది. ఈ శక్తిని వినియోగించుకొనుటలో నేటి యుద్ధశాస్త్ర ప్రవీణులు దూరదృష్టిని ప్రదర్శించుచున్నారు. ఆశ్విక దళములలోను, ఇతర యుద్ధాంగములలోను కలుగుచున్న అభివృద్ధులు, మార్పులు ఇందుకు తార్కాణములు. ఆశ్విక దళములు ఈ కాలపు యుద్ధప్రస్థానమునందు అత్యల్ప పాత్రను వహించుననియు, అందుచే నిరుపయోగకరములనియు కొందరు సిద్ధాంతీకరించియున్నారు. అమెరికా సైన్యములో ఆశ్వికదళశాఖ రద్దుచేసియున్నారు. కాని రష్యావారు ఈసిద్ధాంతము నంగీకరించలేదు. రష్యా జర్మనీయుద్ధములో యాంత్రికమొనర్పబడినసోవియట్ ఆశ్వికదళముల పాత్ర ప్రపంచమును చకితముగా నొనర్చినది. రష్యనులు మూడు డివిజనులలో 20,000 మంది ఆశ్వికులను వినియోగించుట నిరుపమానమైన అంశముగా సైనిక శాస్త్రవేత్తలు ప్రశంసించియున్నారు. జర్మనులు ఒక్క ఆశ్విక దళమును మాత్రమే యాంత్రిక మొనర్చినందులకు ఆనాటి
407