Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గురుమూర్తిశాస్త్రి

ఈ శతాబ్దియందు నక్షత్రవీధుల (galaxies) చలనమును గురించి ముఖ్యమయిన అపేక్షణము (observation) చేయబడినది. ఆ అపేక్షణమిది: నక్షత్రవీథులు ఒండొంటినుండి వేరై దూరదూరముగను, వేగముగను కదలుచున్నవి. ఇది హబ్బుల్ (Hubble) యొక్క సూత్రము ననుసరించి జరుగుచున్నది. ఆ సూత్రమిది : V=r/r అందు T అనునది యొక స్థిరాంశము (constant) జ్యోతిశ్శాస్త్రీయ అపేక్షణములనుబట్టి అది 6×1016 క్షణికములుగా (seconds) నుండునట్లు నిశ్చయింపబడినది. మాక్‌యొక్క సూత్రమును, విశ్వమందలి అనేకములైన సాపేక్షతాసంబంధి (relativistic) నమూనాలను ఆధారము చేసికొని అది అనుమేయింపబడినది. స్థిరాంశమైన T గురుత్వాకర్షణ సంబంధియగు 'g' అను స్థిరాంశముతో కలుపబడినదని అనుమేయింపబడినది. ఇచటి సంబంధము GPT=1 ఇచట P అనునది విశ్వమందలి పదార్థముయొక్క మధ్యమ సాంద్రతయై (mean density) యున్నది.

గురుత్వాకర్షణమును గూర్చిన మన జ్ఞానమందలి పరిమితులు, సాధ్యమైన పరిశోధన మార్గములు : ఐన్‌స్టెన్ గురుత్వాకర్షణ సిద్ధాంతమునందు గ్రహ చలనములు, బుధగ్రహముయొక్క నీచస్థానపు అభివృద్ధి రూపసంఘటనము కూడ చేరియున్నను, ఇంతవరకు దానిమూలమున పరిభ్రమణమునకు సంబంధించిన సముద్రపు పోటుపాటు మొదలగు సంఘటనలను వివరించుటకు సాధ్యముకాలేదు. మరియు పెక్కు ఆకాశ సంఘటనలు గురుత్వాకర్షణ సిద్ధాంతము మూలమున వివరింపబడినవి కలవు. దీని అధ్యయనము ప్రకృతిని ఇతోధికముగ అవగాహన చేసికొనుటకు ఉపకరింపగల అమూల్యమైన సాధనము కాగలదు. గ్రహములును, ఉపగ్రహములును సాధారణముగా ఒక దిశయందే పరిభ్రమించును. గ్రహములు మండలములలో తిరుగును. వాటి పరిమాణములు 'జ్యామెట్రిక్ సీరీస్' (బోడ్ సిద్ధాంతము) అనువాటితో పరస్పరముగా సంబంధించియున్నవి. గ్రహములయొక్కయు ఆ గ్రహములకు చెందిన ఉపగ్రహములయొక్కయు సగటు చలనములు (mean motions) పరస్పరముగా అనుగుణ స్థితి (existence of commensurability) యొక్క సాధారణ నిష్పత్తులలో (simple ratios) సంబంధించియున్నవి. అధికతర పరిమాణములో నక్షత్రవీథులు వాటి మధ్యగల దూరముల ననుసరించి వెనుకకు పోవుట సంభవించును. ఈ సంఘటనలను అధ్యయనము చేయునపుడు మనకు గురుత్వాకర్షణ విషయమున పరిశోధన మొనర్చుటకు తగిన సఫల మార్గములు లభింప గలవని ఆశింపవచ్చును. ఈ కార్యసిద్ధికై ప్రాయోగికమును, గణిత శాస్త్రీయమును నగు ఈ రెండు మార్గములు మనముపయోగింపవచ్చును. రాబిన్ సన్, బోండె అను నిరువురును ఐన్‌స్టెన్ యొక్క సాధారణ సాపేక్షతా సిద్ధాంత గురుత్వాకర్షణ సంబంధి తరంగముల యొక్క అస్తిత్వమును ముందుగా తెలియజేసినదని చూపియున్నారు. పరిభ్రమించు నొక పదార్థము గురుత్వాకర్షణ సంబంధి తరంగములకు ఉత్పత్తి స్థానముగా పనిచేయగలదనియు, భూభ్రమణమునందలి మాంద్యమునకు కారణము తన్మూలమున గురుత్వాకర్షణ సంబంధి తరంగ ప్రసరణము కావచ్చుననియు ఊహింపబడినది. అట్టి తరంగము లున్నప్పటికిని, మనకింకను వాటిని కనుగొను సాధనము లభించియుండలేదు. ప్రస్తుతకాలమున గురుత్వాకర్షణమునందలి మరియొక సమస్య పరిశీలింప బడుచున్నది. అది గురుత్వాకర్షణ సంబంధి క్షేత్రముయొక్క క్వాంటిజేషన్ (quantization) అనునది. రెండు కణముల మధ్యగల విద్యుదయస్కాంతీయ ఆంతరక్రియను వాటిమధ్య ఛాయా చిత్రముల వినిమయము (interchange) గా భావింపదగుపని మన మెరుగుదుము. గురుత్వాకర్షణ సంబంధి క్షేత్రమునుండి ఇట్టి గురుత్వాకర్షణ అణుచిత్రము (particle picture) మనకు లభింపవచ్చు నని ఆశింపబడుచున్నది.

యస్. యం. అ.


గురుమూర్తిశాస్త్రి :


శ్రీపైడాల గురుమూర్తిశాస్త్రి క్రీ. శ. 18 వ శతాబ్దము వాడు. ఆంధ్రుడు. ములికినాటి బ్రాహ్మణుడు. తమిళ దేశమునందుగల తిరునల్వేలిమండలమునందలి కయత్తార్ అను గ్రామమున నివసించినవాడు. అనేక శాస్త్రముల యందు సంపూర్ణ పాండిత్యము కలవాడు. సంగీతశాస్త్ర లక్ష్యలక్షణముల నెరిగినవాడు. గానముచేయుచు వాగ్గేయ కారుడై కీర్తి నార్జించిన ఘనుడు.

401