Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుణగ విజయాదిత్యుడు

గాంగులు లోపలిభాగమునకు పారిపోయి గంగకూటమను చోట తలదాచుకొనిరి. కాని విజయాదిత్యుడు వెంటనంటి పోయి అక్కడకూడ వారిని ఓడించి తిరిగి రాష్ట్రకూటుల ఆధిపత్యమును వారు అంగీకరించునట్లు చేసెను

ఈ దండయాత్ర ముగిసినతరువాత రాజధానికి తిరిగివచ్చి కొంతకాలమువరకు విజయాదిత్యుడు తన రాజ్య వ్యవహారములలో నిమగ్నుడయ్యెను. క్రీ. శ. 800 సం. లో అమోఘవర్షుడు మరణించగా రెండవకృష్ణుడు రాష్ట్రకూట రాజ్యమునకు ఏలికఅయ్యెను. ఇది జరిగిన కొన్నిరోజులకే ఘూర్జర ప్రతీహారవంశపు రాజైన భోజుడు రాష్ట్రకూట రాజ్యముమీద దండెత్తివచ్చి మాలవరాష్ట్రమును వశపరచుకొనెను . పూర్వము అమోఘవర్షుని కాలములో తనకు జరగిన అవమానమునకు ప్రతీకారము చేయుటకయి తగిన సమయముకొరకు వేచియున్న విజయాదిత్యుడు, కృష్ణరాజునకు ఈ విధముగా కలిగిన కష్టమును పురస్కరించుకొని స్వాతంత్ర్యము ప్రకటించెను. పాండురంగ సేనానిని రాష్ట్రకూటులపై దండుతో పంపించెను. కృష్ణరాజునకు ఈ సమయములో, అతని బావమరదియు, దాహళ మండలమునకు రాజును అయిన సంకిలుడు బాసటగా నిలిచెను కాని వీరిద్దరు కలిసికూడ వేంగీచాళుక్య సైన్యముల ధాటికి తట్టుకొనలేకపోయిరి. ఈ విధముగా ఓడిపోయి కృష్ణరాజు తన రాజ్యమును సహితము వదలిపెట్టి దాహళమండలములో తలదాచు కొనెను. ఈలోగా ద్రవిడ దేశములో ఒక ఉపద్రవము సంభవించెను. అక్కడి చోళరాజు ఒకడు - పాండ్య, పల్లవరాజుల వత్తిడికి తట్టుకొనలేక గుణగ విజయాదిత్యుని సహాయమును అర్థించెను. ఈచోళరాజునకు సహాయార్థము విజయాదిత్యుడు సైన్యమును పంపించి పాండ్య పల్లవ రాజులను ఓడించి వారివద్దనుండి అపారధనమును సంపాదించెను.

తరువాత విజయాదిత్యుడు రాష్ట్రకూటులమీద మరియొక దండయాత్ర సాగించెను. ఈ యాత్రలో వేంగీ చాళుక్య సైన్యములు కళింగదేశములోనుండియు, కళింగమును అంటియున్న చక్రకూటమండలములో నుండియు, పోవలసివచ్చెను. దీనివలన విజయాదిత్యునకు, కళింగరాజయిన భూపేంద్రవర్మతోను, చక్రకూట మండల పరిపాలకుడైన బద్దెగ రాజుతోను పోరు సంభవించెను. కడకు భూపేంద్రవర్మను, బద్దెగరాజును ఓడించి విజయాదిత్యుడు దాహళమండలము ప్రవేశించి దాని రాజధాని అయిన కిరణపురమును ముట్టడించెను. అక్కడ జరిగిన యుద్ధములో ఓడిపోయి సంకిలుడు, కృష్ణునితో లోపలి భాగమునకు పారిపోయెను. కిరణపురమును దహించి విజయాదిత్యుడు శత్రువులను వెంబడించెను. దారిలో దాహళ, నిరూట, దలెనాడు మొదలయిన దుర్గములను స్వాధీనము చేసికొని శత్రువులిద్దరును తలదాచుకొన్న అచలపురమును ముట్టడించెను. ఇక్కడ జరిగిన యుద్ధములో కూడ కృష్ణరాజు ఓడిపోయి సంధికోరెను. రాష్ట్రకూటరాజ్యము యావత్తు వేంగీ చాళుక్యుల అధీనములోనికి వచ్చెను. కాని, విజయాదిత్యుడు కృష్ణరాజును కనికరించి, అతని రాజ్యమును అతనికి ఇచ్చివేసి, రాష్ట్రకూట బిరుదములను కొన్ని ధరించి, వారి రాజ్యచిహ్నములైన గంగా యమునలను, పాలి ధ్వజమును మాత్రము పరిగ్రహించి, తన రాజధానికి తిరిగి వచ్చెను.

ఈ రాష్ట్రకూట దండయాత్రానంతరము విజయాదిత్యుడు మూడు, నాలుగు సంవత్సరములు మాత్రమే రాజ్యము చేసెను. ఈ కాలమంతయు ప్రశాంతముగనే గడచిపోయెను. ఈ విధముగా మొత్తము 43 సంవత్సరముల కాలము రాజ్యముచేసి క్రీ. శ. 891 లో ఈ మహారాజు దివంగతు డయ్యెను.

గుణగ విజయాదిత్యుడు పరరాజులతో అనేక యుద్ధములు జయప్రదముగా సాగించుటకును, 43 సంవత్సరముల కాలము దేశములో ఏ విధమయిన ఆంతరంగిక కలహములు అలజడులులేకుండ శాంతియుతముగా రాజ్య మేలుటకును ఇతని ఆశ్రితవర్గము ఒక ముఖ్యకారణము. వీరిలో పాండురంగసేనాని, వినయడిశర్మ, రాజాదిత్యుడు అనువారు ముఖ్యముగా ప్రశంసాపాత్రులు. పాండురంగనిని పండరంగడుగా కొన్ని శాసనములు వాక్రుచ్చు చున్నవి. పాండురంగ సేనాని తూర్పు చాళుక్యవంశరాజుల ప్రాపకములో ఉండుచు, వారికి నమ్మినబంటుగా ప్రఖ్యాతి చెందిన బ్రాహ్మణ వంశ్యులలో నొకడు. ఇతని తండ్రి కటకరాజు ఎల్లప్పుడు విజయాదిత్య మహారాజును అంటిపెట్టుకొని ఉండి. అతడు నొలంబులతో చేసిన యుద్ధ

387