Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు నగరము

సంగ్రహ ఆంధ్ర

గుంటూరు ప్రభువువద్ద సేనానిగానున్న రాయన మంత్రి చెక్కించినది.

ప్రాత గుంటూరు నందలి అగస్త్యేశ్వరాలయమున పాండురాజ శాసన మొకటి కలదు. ఇది శాలివాహన శకము 1079 వ సంవత్సరమునకు సరియైన క్రీ శ 1157 వ సంవత్సరమునాటిది. ఇందు ఆ సంవత్సరమున అగస్త్యేశ్వరస్వామి గుడియు, మంటపము, పరివారపు గుళ్ళు, ప్రాకారము కట్టించబడినట్లు వ్రాయబడియున్నది. ఇందు “గడ్డి పూండివలయు చుట్టు పొలము చతుశ్శ్రమము" ఆచంద్రార్కముగ దేవాలయమున కియ్యబడినట్లు వ్రాయ బడియున్నది. 'గడ్డిపూండి' అను గ్రామము ఇపు డిచట లేదు. కాని గుంటూరునుండి మంగళగిరికి పోయెడి మార్గమున గడ్డిపూడి వంతెన యనుపేర నొక వంతెన యుండెడిదని తెలియవచ్చుచున్నది. ఆ ప్రదేశమున నివసించెడు కొందరు మాలలను గడ్డిపూడి మాలలని ఇప్పటికిని పిలుచుచున్నారు. ఈ ఆధారములనుబట్టి ఒకప్పుడిచట గడ్డిపూండి యను గ్రామమున్నట్లు మన మూహింపవచ్చును.

తిక్కనకవి, తన తాతయగు మంత్రి భాస్కరుడును, తన తండ్రి కొమ్మనయు గుంటూరు విభులని వ్రాసి యున్నాడు. వీరందరు పండ్రెండవ శతాబ్దినాటివారు.

గుంటూరునందు ఇప్పుడు ఎఱ్ఱచెరువుగల స్థలమున ఒక పెద్ద రాతిగుండు ఉండెడిదనియు, పూర్వము మోహనరాజు, గోపాలరాజు అను నిద్దరు రాజపుత్రులు కుష్ఠవ్యాధిచే పీడితులై తీర్థయాత్రా సందర్భమున ఇచ్చటికి వచ్చి ఎఱ్ఱచెరువులో స్నానముచేసి యొడలు తుడుచుకొనగా వారి వ్యాధి కొంతవరకు తగ్గెననియు, అందుచే వారు ఈ గ్రామముననే ఆరునెలలుండి ప్రతిదినము స్నానముచేసి పరిశుద్ధదేహులై ఆరోగ్యవంతులైరనియు, అచటి రాతిగుండును వారు పగులగొట్టించి దానితావున పెద్ద తటాకమును గావించిరనియు, ఇచట అగస్త్యుని పేర అగస్త్యేశ్వర దేవాలయమును కట్టించి ప్రతిష్ఠ గావించిరనియి, తూర్పుభాగమున మెట్లు కట్టించి వినాయకుని ప్రతిష్ఠించి, ఆ భాగమునకు వినాయక ఘట్టమని పేరుపెట్టిరనియు ఒక ప్రతీతి కలదు. పగులగొట్టబడిన గుండువలన ఈ గ్రామమునకు 'గుండూరు', 'గుంటూరు' అను పేర్లు వచ్చెనందురు. పై విషయములలోని సత్యాసత్యములు తెలియవు. ఒకప్పుడు ఈ గ్రామమునకు 'గుండూరు' అను పేరును సాధించుచు సి. పి. బ్రౌనుపండితుడు వ్రాసియున్న లేఖ ఒకటి ఒకానొక ప్రాచ్య పుస్తకాలయమున నున్నట్లు తెలియుచున్నది. గుంటూరునగరము, పూర్వము నిజాము కాలములో 'ముర్తుజానగర్ ' అని పిలువబడుచుండెడిది. 1788 వ సంవత్సరములో నిజాము ఈ నగరమును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీవారికి ఇచ్చివేసినట్లు ఆధారములు కలవు.

ప్రాత గుంటూరని ఇపుడు వ్యవహరింపబడుచున్న భాగమే పురాతనమైన గుంటూరుపట్టణమై యుండెను. ఫ్రెంచివారు కోటప్పకొండను తమ స్వాధీనమున నుంచుకొని, అచటనే తమ సైన్యమునుంచిరి. పిదప గుంటూరు నందు గల రెండు చెరువుల యందును నీరు సమృద్ధిగ నున్నందున తమ సైన్యమును గుంటూరు నగరమునకు తరల్చుకొనివచ్చి, ప్రాత గుంటూరునందు 1752 వ సంవత్సరమున వీరు ఒక కోటను కట్టించియుండిరి.

ఇప్పుడు రామచంద్రపుర అగ్రహారము అనబడు ప్రాంతము 1718 వ ప్రాంతమున రామచంద్ర పాలెము అని వ్యవహరింపబడుచుండెడిది. అనంతరము ఈగ్రామము యొక్క పొలిమేరలోని భూమి కొందరు సద్బ్రాహ్మణులకు దానము చేయబడినందున ఈ ప్రాంతమునకు రామచంద్రపుర అగ్రహార మను నూతన నామధేయము కలిగెను. ఈ అగ్రహార మిప్పుడు గుంటూరు నగరములోని అంతర్భాగమై యున్నది.

ఆ కాలముననే చాకలివాండ్రు తమకు అనుకూలముగ నుండునట్లు వారిలో పెద్దయగు సంగడు అనువానిపేర ఒక పేట కట్టి అచటనే గుంట నొకదాని నేర్పరచుకొనిరి. గుంటూరులో నొక భాగమైన ఈ పేట ఇప్పుడు సంగడి గుంట యనబడు చున్నది.

చింతపల్లి జమీందారులైన వాసిరెడ్డివారు తమ రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మార్చిన పిమ్మట, తాము గుంటూరు నగరమునకు వచ్చి నివసించుటకై నల్ల చెరువునకు ఉత్తరదిశ యందు కొన్ని గృహములు నిర్మాణము కావించుకొని, చుట్టుప్రక్కల నుండు స్థలమును ప్రజల నివాసార్థమై ఉచితముగ నిచ్చిరి. అట్లీయ

368