Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుంటూరు నగరము

ఒంగోలు (27,810 జనాభా); బాపట్ల (22,748 జనాభా); నర్సారావుపేట (22,243 జనాభా) అనునవి యితర ప్రసిద్ధ పట్టణములు.

ఇతరపురములు 19 కలవు: పొన్నూరు, నిడుబ్రోలు, మంగళగిరి, సత్తెనపల్లి, వేటపాలెము, భట్టిప్రోలు, చేబ్రోలు, రేపల్లె, అద్దంకి, చిలకలూరుపేట, వినుకొండ, అల్లూరు, కొత్తపట్టణము, కొల్లిపర, కొల్లూరు, గురజాల, తాడేపల్లి, ఫిరంగిపురము, దుగ్గిరాల, మాచెర్ల, రెంటచింతల. ఇవి పంచాయతీ సభలుగల పురములు.

చరిత్ర : క్రీస్తు శకారంభ ప్రాంతీయ శతాబ్దములలో బౌద్ధమత బ్రాబల్య మిచట హెచ్చుగా నుండెను ఈ జిల్లాలోని నాగార్జునకొండ, అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి, చందవోలు అనుచోట్ల లభ్యములగుచున్న శిథిలములనుబట్టి ఈ నగరములు ఆనాడు బౌద్ధమత ప్రచారమునకై ఏర్పరుపబడిన ప్రధాన కేంద్రము లని చెప్పవచ్చును. అందును నాగార్జునకొండ, అమరావతి మిక్కిలి ప్రసిద్ధములు. ప్రప్రథమముగా ఆంధ్రరాజ్యమును స్థాపించిన శాతవాహనులు నాలుగున్నర శతాబ్దములు ధాన్యకటకము (ధరణికోట) నుండి పరిపాలించిరి. ధాన్యకటక మందలి బౌద్ధ విహారములు, బౌద్ధ విశ్వవిద్యాలయము లోక ప్రసిద్ధిని పొందియుండెను. ఇప్పుడు శిథిలావశేషములు మాత్రమే కనబడును.

తరువాత ఈ జిల్లా 3 వ శతాబ్ద ప్రాంతమునుండి 7 వ శతాబ్దము వరకు పల్లవుల యధీనమం దుండెను. వారి తరువాత విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, వరుసగా ఈ జిల్లాను పాలించినట్లు నిదర్శనములు కలవు. విష్ణుకుండినుల జన్మస్థానమునకే వినుకొండ యను పేరు కలదు. వేంగీచాళుక్యుల రాజ్యము 12 వ శతాబ్దములో అంతమొందగనే వెలనాటిచోడులు తెనాలితాలూకాలోని చందవోలును రాజధానిగా చేసికొని ఒక శతాబ్దమువరకు పాలించిరి. 12 వ శతాబ్దములో ఈ జిల్లా కాకతీయుల వశమయ్యెను. పల్నాటియుద్ధము 12 వ శతాబ్దములోనే కారెంపూడి వద్ద జరిగెను. హైహయ వంశములోని ఒక రాజకుటుంబములో జరిగిన యుద్ధ మిది. 1324 లో ప్రోలయ వేమారెడ్డి ఒంగోలు తాలూకాలోని అద్దంకి రాజధానిగా కొండవీటి రెడ్డిరాజ్యమును స్థాపించెను. ఇది 1424 వరకు కొనసాగెను. భారతములోని అరణ్య పర్వ శేషమును తెనిగించిన ఎఱ్ఱాప్రెగడ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానకవియై యుండెను. ప్రోలయ కొడుకైన అనపోతారెడ్డి రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్చెను. శ్రీనాథ మహాకవి వీరి యాస్థానములో విద్యాధికారిగా నుండెను. 1424 తరువాత కొండవీటి రాజ్యము (గుంటూరుజిల్లా) విజయనగరాధీశుల వశమయ్యెను. తరువాత 1565 లో తళ్ళికోట యుద్ధానంతరము కోస్తాజిల్లా లన్నిటితోబాటు గుంటూరుజిల్లాకూడ గోల్కొండ నవాబులకు అధీనమయ్యెను. నైజాముచే 1765 లో సర్కారుజిల్లాలు ఇంగ్లీషువారికి ఇయ్యబడెను. ఇంచుమించుగా అప్పటినుండి గుంటూరుజిల్లా ఆంగ్లేయుల వశమం దుండిపోయెను. 1794 లో గుంటూరుజిల్లా ప్రత్యేక జిల్లాగా నేర్పడియుండి, 1859లో కృష్ణాజిల్లాతో కలిపివేయబడెను. 1904 లో తిరిగి గుంటూరుజిల్లా ప్రత్యేకించబడెను. 1953 లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర మేర్పడినపుడు ఇచట హైకోర్టు నెలకొల్పబడెను. తరువాత 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగనే అది హైదరాబాదునకు తరలింపబడెను.

పు. ప్ర. శా.

గుంటూరు నగరము :

గుంటూరు నగరము గుంటూరు జిల్లాకు ప్రధాన స్థానము. ఈ పట్టణము వేయి సంవత్సరములకు పూర్వమే ప్రసిద్ధిగాంచిన పట్టణమని నిరూపించుటకు కొన్ని శాసనాధారములు కనిపించుచున్నవి. శాలివాహనశకము 1069 కు సరియైన క్రీ. శ. 1147 వ సంవత్సర శాసనమొకటి విజయవాడ నగరములోని మల్లేశ్వరస్వామి దేవాలయ మంటపమున నున్నది. ఈ శాసనము, దత్తనామాత్య సోముడను ఒకమంత్రి గుంటూరు పురమున దేవాలయములు కట్టించి, చెరువులు త్రవ్వించినట్లు తెలుపుచున్నది. అచటనే కల మరి రెండు శాసనములలో మొదటిదానిని బట్టి ఉదయ రాజను నాతడు గుంటూరు ప్రభువై యుండగా. అతని యొద్దనున్న కూచన యను మంత్రి ఆశాసనమును చెక్కించినట్లు తెలియుచున్నది ఈ శాసనము తిక్కన జననకాలము నాటిదై యున్నది. (క్రీ. శ. 1280) రెండవ శాసనము 1255 వ సంవత్సరమునాటిదై యున్నది. ఈ శాసనము

367