Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుంటూరు జిల్లా

లను కలుపుచు మరియొక శాఖామార్గము తెనాలిగుండా పోవును. ఈరెండును బ్రాడ్‌గేజ్‌కి చెందినవి. వీటినిడివి 1331/4 మైళ్ళు. విజయవాడనుండి గుంటూరు మీదుగా గుంతకల్లునకొకటి, మాచెర్లకొకటి పోవునట్టి రెండు మీటరుగేజిలైన్లు కలవు. వీటినిడివి 162 మైళ్ళు (ఈ జిల్లాలో). ఈ మార్గములు గుంటూరు, సత్తెనపల్లి, నర్సారావుపేట, వినుకొండలను కలుపును. మొత్తముమీద అన్ని తాలూకాల ముఖ్యస్థానములు రైలు మార్గములచే కలుపబడి యున్నవి.

ఈజిల్లాలో జలమార్గములుకూడ రవాణా సౌకర్యములలో చేరియున్నవి. కృష్ణానది, బకింగుహాముకాలువ, రేపల్లెకాలువ, నిజాంపట్టణపు కాలువ, సరకులరవాణాకును, ప్రయాణములకును ఎంతయో ఉపయోగపడు చున్నవి.

వైద్యము : గుంటూరు జిల్లాలో 100 వైద్యశాలలు కలవు ఇందు 13 ప్రభుత్వమువి. గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో 'X' రే విభాగముకూడ కలదు. మొత్తము ప్రభుత్వ వైద్యశాలలలో 405 పడకల వసతులు కలవు. ఇవి గాక స్థానిక ప్రభుత్వముల (డిస్ట్రిక్టు బోర్డుల, లోకల్ బోర్డుల) యాజమాన్యమున నిర్వహింపబడునవి 87 వైద్యశాలలు చిన్నవి, పెద్దవి కలవు. వీటియందు 28 పడకల వసతులు కలవు. గుంటూరు, చీరాల, ఒంగోలు, రెంటచింతల పట్టణములలో క్రైస్తవ మిషనరీలచే నిర్వహింపబడు వైద్యశాలలు కలవు. బాపట్లలో 200 పడకల వసతులుగల క్రైస్తవ మిషనరీవారి కుష్ఠురోగ వైద్యశాల కలదు.

తంతి - తపాలాలు : జిల్లాలో మొత్తము 35 పెద్ద తపాలా కార్యాలయములు, 24 తంతి - తపాలాకార్యాలయములు, 532 శాఖా కార్యాలయములు కలవు.

విద్య: (1951) ఈజిల్లాలో 7 కళాశాలలుకలవు. ఇందు కళలకు, సైన్సుకు సంబంధించినవి 4, వ్యవసాయకళాశాల 1, సంస్కృత కళాశాలలు 2, వీటిలో 3,453 మంది బాలురు, 183 మంది బాలికలు చదువుచున్నారు.

ఉన్నతపాఠశాలలు 82 కలవు. వీటిలో 33,565 మంది బాలురు, 4,887 మంది బాలికలు కలరు.

సంస్కృత పాఠశాలయొకటి కలదు. ఇందు 31 మందిబాలురు, 11 మంది బాలికలు కలరు.

ట్రైనింగుస్కూళ్ళు 13 కలవు. వీటిలో 1.070 మంది బాలురు, 696 మంది బాలికలు కలరు.

మాధ్యమిక పాఠశాలలు 29 కలవు. ఇందు 3,381 మంది బాలురు, 650 మంది బాలికలు కలరు.

ప్రాథమికపాఠశాలలు 2,569 కలవు. ఇందు 1,33,465 మంది బాలురు, 90,682 మంది బాలికలు కలరు.

బేసిక్ స్కూళ్ళు 20 కలవు. ఇందు 1,427 మంది బాలురు, 1,177 మంది బాలికలు కలరు.

వయోజన విద్యాశాలలు 68 కలవు. వాటిలో 1,735 మంది పురుషులు, 51 మంది స్త్రీలు కలరు.

జిల్లా మొత్తమున అన్ని విధములయిన విద్యాసంస్థల సంఖ్య 2,789 కలవు. వీటిలో 1,78,127 మంది విద్యార్థులు. 98,337 మంది విద్యార్థినులు, మొత్తము 2,76,464 మంది చదువుకొనుచున్నారు.

ఈజిల్లాలో మొత్తము చదువు వచ్చినవారు 4,41,224 మంది.

పరిశ్రమలు : గుంటూరు, బాపట్ల, ఒంగోలు, సత్తెనపల్లి తాలూకాలలో పొగాకు పరిశ్రమ కలదు. ఈ తాలూకాలలో నున్న 117 పొగాకు పరిశ్రమాగారములలో 20,710 మంది కూలీలు పనిచేయుచున్నారు. గుంటూరులో ఒక గోనెసంచుల ఫ్యాక్టరీ కలదు. దుగ్గిరాలలో పసుపు ఫ్యాక్టరీలు, గుంటూరు, తెనాలి, స త్తెనపల్లి, నర్సారావుపేట తాలూకాలలో నూనెఫ్యాక్టరీలు కలవు. మంగళగిరియొద్ద రెండు సిమెంటుఫ్యాక్టరీలు, ఒక గుడ్డలమిల్లు కలవు. బాపట్ల తాలూకాలో జీడిపప్పు పరిశ్రమాగారము కలదు. ఈ జిల్లాలో మొత్తము 236 పెద్ద పరిశ్రమాగారములు కలవు. వాటియందు 27540 మంది కూలీలు పనిచేయుచున్నారు. (1951)

ఇవిగాక కంబళ్ళునేయుట, తాళ్ళునేయుట, చాపలు అల్లుట, బట్టల అద్దకము, బీడీలుచుట్టుట, కంచరి, వడ్రంగి పనులు, తోళ్ళపరిశ్రమ, మున్నగు కుటీరపరిశ్రమలు కూడ జిల్లాయంతటను కలవు. చీరాల, గుంటూరు, మంగళగిరి, పేటేరు గ్రామములలో చేనేత పరిశ్రమ ప్రసిద్ధిచెందియున్నది.

వృత్తులు : వ్యవసాయమే ఈ జిల్లాయందలి ప్రధాన వృత్తి. పెదవడ్లపూడి, చిలువూరు ప్రాంతములందు

365