Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుంటుపల్లి

శాతవాహన రాజుల కాలములో వర్ధిల్లిన గొప్ప బౌద్ధ సంఘారామము. గుంటుపల్లి పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు తాలూకాలోనున్న కామవరపుకోటకు ఆరుమైళ్ల దూరములో గల ఒక పల్లెగ్రామము. దీనికి ఉత్తరదిశగా ఒక మైలు దూరములో తూర్పుపడమరలుగా వ్యాపించిన ఒక కొండ కలదు. ఆ కొండ మధ్యభాగమున దక్షిణ ముఖముగా, గుఱ్ఱపులాడమువలెనుండు భాగ మొకటి కలదు. అది యొక గుహ. దానిలోతు అరమైలుండును. ఆ గుహా ముఖద్వారము వెడల్పు 500 గజములు. దానికి పడమటి శాఖలో ఒక విలక్షణమైన చైత్య గృహమును, దానికి ప్రాగుత్తరమునందు ఒక విహారమును తొలువ బడినవి. వీటియన్నిటి దరీముఖములు పైకి నిరాడంబరములుగా గనుపించును. కాని లోనికిపోయి చూచినచో పైకప్పుభాగము శిల్పవైభవముతో నలరారుచు మిక్కిలి చిత్రముగా నుండును.

పూడికొనిపోయిన ఈ గుహాలయప్రాంతమును క్రీ. శ. 1889 వ సంవత్సరములో అలెగ్జాండరు రే అను మహాశయుడు త్రవ్వించి, ప్రపంచమునకు ఈ ప్రాచీన గుహాలయములను బయల్పరచి, బౌద్ధమత చరిత్రకును, బౌద్ధ శిల్పచరిత్రకును మహోపకారము గావించెను. ఈ ప్రదేశములో దొరకిన రాతిపెట్టెలు, శిలావిగ్రహములు, పూసలు, బంగారపు భిక్షాపాత్ర మొదలైన వస్తుజాలము మద్రాసు మ్యూజియమునందు భద్రపరుపబడినవి.

ఇచ్చటి గుహలు అంత అందముగా లేనిమాట నిజమే కాని, ఆ రూపమే వాటి ఘనతను, ప్రాచీనతను జాటుచున్నవి. ఇవన్నియు నిరాడంబరముగాను, నిరలంకృతము గాను ఉండి బౌద్ధమత సంప్రదాయ పరిస్థితులను వ్యక్తము చేయుచున్నవి.

ఈ గుహాలయముల నిర్మాణపద్ధతి, బుద్ధగయవద్ద గల "బారాబరు" కొండలలో మలచబడిన అశోకునికాలము నాటి 'లోమక ఋషి' గుహాలయ నిర్మాణపద్ధతిని పోలి యుండుటచేతను, క్రీ. పూ. రెండవ శతాబ్దినాటి లిపిలో నున్న ఒక పురాతనకాలపు శాసనము లభించుటచేతను, ఇవి పురాతనకాలమునాటివని రూఢియగుచున్నది. ఇవి సాతవాహన రాజులకాలమునాటివి.

ఈ గుంటుపల్లి సంఘారామములో 'సుయజ్ఞ నాథు' డను శ్రమణకుడు నివసించుచు బౌద్ధమతమును గూర్చి ప్రచారము చేయుచుండెడివాడనియు, ఆతడు గొప్ప పండితుడనియు, మహా విజ్ఞానవేత్తయనియు అక్కడ దొరకిన శాసనములనుబట్టి తెలియుచున్నది. అక్కడ బౌద్ధభిక్షువులు సుఖముగా జీవించుచు, తమ నిత్య నైమిత్తిక కార్యక్రమములను నిర్విఘ్నముగ కొనసాగించు కొనుటకును, శాంతజీవనమును నెరపుకొనుటకును అనువుగానుండు విధముగా నిర్మింపబడిన ఆరామములు, విహారములు పెక్కులున్నవి. ఇవన్నియు ఆనాడు బౌద్ధ భిక్షువులతోను, ఇతర విజ్ఞానవేత్తలతోను నిండియుండెడివి.

ఈ పురాతన బౌద్ధ సంఘారామములలో పూజా పురస్కారములు జరిగినట్లు సరియైన నిదర్శనములు కనపడక పోవుటచే, ఇవన్నియు హీనయాన బౌద్ధమత సంప్రదాయమునకు చెందినవని నిశ్చయింపవచ్చును. అప్పటికింకను మహాయాన మత సంప్రదాయము తలయెత్తి యుండలేదనుట స్పష్టము. ఆంధ్రదేశములో మహాయానమత సంప్రదాయము ప్రబలి బౌద్ధమతము మహోన్నతదశ నొంది బహుళవ్యాప్తి కలిగియున్న సమయమున గుంటుపల్లి బౌద్ధారామము ఒక విశిష్టస్థానమును వహించియుండెనని చరిత్రకారులు భావించుచున్నారు.

గుంటుపల్లిలోనున్న బౌద్ధవిహారములలో కొన్ని పర్వతగుహలలో మలచబడినవియు, మరికొన్ని ప్రత్యేక ముగా ఇటికలతోను, రాళ్ళతోను నిర్మింపబడినవియు కలవు. ఇవన్నియు ఒకేకాలములో గాక వేరువేరు కాలములలో నిర్మింపబడినవని నేటి పురాతత్త్వ శాస్త్రజ్ఞు లూహించు చున్నారు. వాటి వివరములు ఈ క్రిందివిధముగా నున్నవి.

I గుహావిహారములు : ఈ గుహావిహారములు సాతవాహన రాజుల కాలమునందు నిర్మింపబడినవి. ఇవి అతి పురాతనమైనవి.

(1) చైత్యగృహము : ఈ చైత్యగృహము భారత దేశములో, ఇతరస్థలములలో కనిపించు చైత్యగృహముల వలె చతురస్రముగాకాక, వలయాకారముగా నుండి, సాతవాహనయుగపు శిల్పుల ప్రత్యేక వైలక్షణ్యమును, వారి అనన్య సామాన్యమైన శిల్పరచనాప్రతిభను వేనోళ్ళ చాటుచున్నది. దీని వ్యాసము 18 అడుగులు; ఎత్తు 14 అడుగుల 9 అంగుళములు : దీని మధ్యభాగములో నొక

359