Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గిబ్బను, ఎడ్వర్డు

త్సరమునుండి 1758 వ సంవత్సరమువరకు అతడక్కడనే యుండెను. ఆ తరువాత తండ్రియొద్దకు వచ్చెమ. తండ్రి కుమారుని తప్పులను క్షమించి సగౌరవముగా ఆదరించెను. మారుతల్లి సయితము గిబ్బనును కన్న కుమారునివలె ప్రేమించి ఆదరించినది.

1758 - 62 నడుమ గిబ్బను ఫ్రెంచి, ఆంగ్లభాషలలో అనేక ఉత్తమగ్రంథములను జదివి, రెండుభాషలలోకూడ చక్కని శైలి నలవరచుకొనెను.

తరువాత గిబ్బను పారిస్, ఫ్లారెన్సు, నేపిల్సు మొదలైన ప్రాంతములన్నియు కొంతకాలము తిరిగి 1764 సంవత్సరము అక్టోబరు 15 వ తేదీన రోం నగరముచేరి, ఆ సాయంకాల మాతడు పురాతన కాలపు రోమను పట్టణ శిథిలములను చూచుటకువెళ్ళెను. ఆదృశ్యములను చూచుటతోడనే అతనికి క్రమముగా పతనముచెందిన రోమనుసామ్రాజ్య చరిత్ర యంతయు ఒక్కసారి కన్నులకు కట్టగా, ఆలోచనా నిమగ్నుడై యున్న అతనికి కొందరు సన్యాసులు అక్కడ నున్న జ్యూపిటరు దేవాలయములో సాయంకాలపు ప్రార్థనలు జరుపుచున్నట్లు ఒక దృశ్యము మనోగోచరముకాగా, ఉద్రిక్తుడయ్యెను. అంత అతనికి మొట్టమొదట 'రోమనుపట్టణ పతన చరిత్ర'ను వ్రాయవలయునని బుద్ధిపుట్టినది గాని, ఆ తరువాత అనేకగ్రంథములను చదువుటవలన ఆ అభిప్రాయమును మార్చుకొని “రోమను సామ్రాజ్య పతన చరిత్ర"ను గురించి వ్రాయుటకు సంకల్పించుకొనెను.

ప్రతిభావంతుడైన గిబ్బను, తండ్రి నుండి సంక్రమించిన గ్రంథములతో తృప్తిచెందక, అనేక క్రైస్తవమత గ్రంథములను, మహమ్మదీయ మత గ్రంథములను, రోమను దేశమునకు సంబంధించిన అనేక చారిత్రక, న్యాయశాస్త్ర గ్రంథములను సేకరించుటయే గాక, ఇంకను నెన్ని యో ఆర్థిక, సాంఘిక, రాజకీయ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములను కూడ సంపాదించి వానిని ఆమూలాగ్రముగ చదివెను. ఈవిస్తృత గ్రంథపఠనము, ఆతడు సాధింపదలచిన ఘనకార్యమునకు చాలా తోడ్పడినది.

తండ్రి మరణానంతరము రెండు సంవత్సరముల తరువాత అన్ని విధములైన చిక్కుల నుండి విముక్తి పొంది తన ముప్పది అయిదవఏట లండను నగరమునకు వచ్చి, అచ్చట స్థిరనివాస మేర్పరచుకొని అంతకుముందు తాను కూడబెట్టుకొనిన మహావిజ్ఞాన సంపద సహాయముతో తాను సాధింపదలచిన మహత్కార్య నిర్వహణమునకు పూను కొనెను.

లండనులో స్థిరపడిన తరువాత, గిబ్బను అయిదారు సంవత్సరములు నిరంతరము కృషిచేసి 1776 వ సంవత్సరములో తన రోమను సామ్రాజ్య పతన చరిత్ర ప్రథమ సంపుటమును ప్రకటించెను. దీనిని ప్రజ లత్యుత్సాహముతో ఆదరించిరి గాని, ఆతడు ప్రాథమిక క్రైస్తవ మతముపట్ల చూపిన భావములకు కారణముగా, నిరంతర వాగ్వివాదములకును, పెక్కు జగడములకును, ఆక్షేపణలకును గురికావలసి వచ్చినది. అయినను దీనివలన ప్రజలలో అతనికి కొంత పలుకుబడికూడ లభించినది.

1774 వ సంవత్సరమున 'లార్డు ఇలియట్' సహాయముతో గిబ్బను పార్లమెంటున కెన్నుకోబడెను. కాని యీత డెన్నడును పార్లమెంటు సమావేశములలో మాట్లాడలేదు. పార్టీ ఆజ్ఞానుసారము తన ఓటింగు హక్కును మాత్రము వినియోగించుకొనెను.

1781 వ సంవత్సరమున గిబ్బను రోమను సామ్రాజ్య పతన చరిత్రయొక్క రెండవ, మూడవ సంపుటములను ప్రకటించెను. వీటిపై యెక్కువ తర్జనభర్జనలు జరుగ లేదు. ప్రజలు మిక్కిలి ఉత్సాహముతో వాటిని పఠించిరి.

లండను మహానగరములో తనకువచ్చు స్వల్ప ఆదాయముతో జీవించుట కష్టమని తలచి గిబ్బను 'లాసినా'లోని తన మిత్రుని ఆహ్వానము ననుసరించి అక్కడికిపోయి తన స్వగృహమునందు మిగిలిన భాగములను ప్రశాంతముగా పూర్తిచేయదలచి సెప్టెంబరు 1783 వ సంవత్సరములో అక్కడకు పోయెను.

లండను నగరములో నుండగానే రోమను చరిత్ర నాలుగవ సంపుటమును చాలవరకు పూర్తిచేసెను గాని, 'లాసినా' చేరిన తరువాతనే దానిని ప్రకటించెను. గిబ్బను యిక్కడ తన అపూర్వమైన గ్రంథాలయములోని ఆరువేల గ్రంథములమధ్య మిక్కిలి ప్రశాంతముగా మిగిలిన రెండు భాగములను పూర్తిచేసి నాలుగు సంవత్సరములలో ముగించెను. ఈమధ్య కాలములో నాతడు 'లాసినా' నగరమును విడచి ఎటుపోకుండ మిక్కిలి పట్టు

357