Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిబ్బను ఎడ్వర్డు

సంగ్రహ ఆంధ్ర

గిబ్బను, ఎడ్వర్డు (1737-1794) :

ఎడ్వర్డు గిబ్బను మహాశయుడు ప్రసిద్ధ ఆంగ్ల చరిత్రకారుడు. ఇతడు రచియించిన రోమను సామ్రాజ్య పతన చరిత్ర (The History of the Decline and fall of the Roman Empire) వలన, ఈతని కీర్తి ఐరోపా ఖండమందు మాత్రమేగాక, యావత్ప్రపంచము నందును వ్యాపించినది.

గిబ్బను లండను నగరమునకు సమీపమున గల 'పుట్ని' అను గ్రామమున 27 ఏప్రియలు 1737 వ సంవత్సరములో 'ఎడ్వర్డు గిబ్బన్ ' మరియు 'జూడెత్ పోర్టెన్' అను దంపతులకు ప్రథమ సంతానముగా జన్మించెను. ఇతని తరువాత ఆ దంపతులు కార్గురు జన్మించిరి గాని, వారందరు బాల్యముననే మరణించిరి.

గిబ్బను బాల్యమున మిక్కిలి అనారోగ్యవంతుడుగా నుండి నరములకు సంబంధించిన వ్యాధితో మిక్కిలి బాధపడెను. బాల్యమున తల్లి చనిపోవుటవలన ఇతనిని పినతల్లి పెంచినది. ఆమెయందీతని కపారమైన ప్రేమయు, భక్తియు గలదు.

గిబ్బను తొమ్మిది, పదకొండు సంవత్సరముల మధ్యవయస్సులో తన స్వగ్రామములోని ఒక బోర్డింగుస్కూలులో కాయకష్టముతో మిక్కిలి దుర్భరమైన జీవితమును గడపి 'లాటిన్' భాషయందలి వ్యాకరణ లక్షణమును నేర్చుకొనెను. 1749-1750 సంవత్సరముల మధ్యకాలములో 'వెస్టు మిన్‌స్టరు' నందు మూడవ ఫారమువరకు అతి కష్టముమీద చదివెను. ఆ తరువాత మూడు సంవత్సరముల కాలము, నిలకడలేని జీవితముతో అనేక బాధల ననుభవించుచు, నేనెన్నియో చారిత్రక గ్రంథములను పఠించెను.

గిబ్బను తండ్రి 3 వ ఏప్రియలు 1752 సంవత్సరమున గిబ్బనును 'ఆక్సుఫర్డు' విశ్వవిద్యాలయములోని "మేక్ డోలెన్ " కాలేజియందు చేర్పించెను. అచ్చట పదునాలుగు మాసములు మాత్ర మీతడు విద్య నభ్యసించెను. కాని ఆ విద్యవలన అతని కేమాత్రమును లాభము కలుగలేదు. అందువలననే గిబ్బను తన జీవిత చరిత్రలో ఆనాటి విద్యా విధానమును గురించి వివరించుచు ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయములోని విద్యావిధానము మిక్కిలి క్షీణదశలో నుండి, ఆ విశ్వవిద్యాలయపు చరిత్రకే కళంకము తెచ్చునదిగా నున్నదనియు, ఉపాధ్యాయులు విలాసవంతమగు జీవితము గడపుచు, తమ యిచ్చవచ్చినట్లు ప్రవర్తించు చుండెడి వారనియు, గనుకనే తానా విశ్వవిద్యాలయమున ఏ మాత్రపు లాభమును పొందజాలక పోతిననియు, తన జీవితములో అంత ఎక్కువకాలము వ్యర్థముగా గడపిన సందర్భము మరియొకటి లేదనియు ఆతడు వ్రాసెను.

ఇచ్చట విద్య నభ్యసించుచున్న రోజులలో గిబ్బనునకు శరీరారోగ్యము బాగుపడి, క్రమముగా మేధాశక్తియు విద్యాతృష్ణయు అధికము కాజొచ్చెను. ఇతనికి బాల్యము నుండియు మతవిషయకమైన చర్చలయందును, తత్సంబంధములైన గ్రంథములను పఠించుటయందును అభిలాష మెండు. అందువలననే యీతడు తన 17 సంవత్సరముల వయస్సునందే రోమన్ కేథలిక్ మతమునందు ప్రవేశించెను. అందువలన నీతనిని ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయము బహిష్కరించినది. అంతట తండ్రి యీతనిని కవియు వేదాంతియునగు, మాలెట్ నొద్ద ప్రవేశ పెట్టెను. కాని విద్యాతృష్ణ గల యీతనికి అచ్చట అంత ప్రయోజనము కలుగలేదు. అందువలన తండ్రి యీతనిని 'లాసినా' కు పంపెను . అచ్చట 'పెవిలియార్డు' అను విద్వాంసునియొద్ద నివసింప సాగెను. పెవిలియార్డు చాల బీదవాడైనను గొప్ప విద్యావేత్త. మంచి తెలివితేటలు గలవాడు. దానికితోడు గొప్ప అభివృద్ధికరమైన భావములు గలవాడు. ఇతడు తన శక్తినంతను ఉపయోగించి గిబ్బనును మరల ప్రొటెస్టెంటు మతములోనికి చేరునట్లు చేయుటమాత్రమే గాక, అతని విజ్ఞానతృష్ణకు తగినవిధముగా, మంచి మంచి గ్రంథములనుజూపి, వానిని చదువుటకు ప్రోత్సహించెను. ఈమహాశయుని ప్రభావమువలన గిబ్బను అనవసర మతసంబంధమైన చర్చలను మానివేసి, నిజమైన విజ్ఞానము నార్జించుటకు కృషి ప్రారంభించెను. దానికితోడు అచ్చటి వాతావరణముగూడ, అతని భావములకును, ఆశయములకును తగినట్లుగా మిక్కిలి ఉన్నతముగానుండి ప్రోత్సాహకరముగా నుండెను. అందువలన నిచ్చట 'ఫ్రెంచి' భాషా వాఙ్మయమునంతను కూలంకషముగా పఠించి 'లాటిన్’ భాషనుగూడ నేర్చుకొని ఆ రెండు భాషలయందును అసమానమైన పాండిత్యమును సంపాదించెను. 1753 వ సంవ

356