Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గారడి విద్య


       కుచతటముల మై నలదగ లేదా
       ఓ చెలియా

చ. 2. కురులు కూడియు కూడ నటువంటి తొలినాడే
                    కూడి నెనఱుంచగలేదా
       కరుణతో నిను నెల్లకాలమును విడువక నే
                    కాచుకొమ్మనఁగలేదా
      వరుసతో దాను నేమించు నూడిగ లెల్ల
                    వడివడిగ సేయగలేదా
      మరు కేళి వేళ నే నెదురెదురుగ వెన్నుగూడి
                   పెదవిని నొక్కగలేదా !
       ఓ చెలియ.

మను, వసుచరిత్రాది ప్రబంధసాహిత్యమునకు, గాన సాహిత్యమునకు, విశేష తారతమ్యము గలదు. ఆశ్రవ్య ప్రబంధములు శృంగార వీర కరుణాది రసతరంగితములు; ఆష్టాదశ వర్ణనాలంకృతములు; చిత్రబంధ కవిత్వ రచనా సంకలితములు; ప్రౌఢాంధ్ర భాషాజ్ఞానో త్పాదకములు; ఉత్తమ నాయికా నాయక లక్షణో పేతములు; నానా లంకార భూయిష్ఠములు; ద్రాక్షాది త్రివిధపాక పరిపక్వములు; నాయికల పాదాది కేశాంతవర్ణనలతో గూడినవియు నై యుండును.

గాన సాహిత్యము విశేషించి భక్తిరస ప్రధానమై యుండును. ఇందు నవవిధ భక్తులగు “తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం బను నీ తొమ్మిది భక్తిమార్గముల" స్వరూపము గుంఫితమై యుండును. భగవద్గుణాను వర్ణనముతో నిండి యుండును. జ్ఞాన వై రాగ్య బోధకమైయుండును. పదముల యందలి, జావళుల యందలి సాహిత్యము గోపికలు చేసినట్టి శృంగారభక్తియుతమై యుండును. భక్తుడు తన్ను నాయికగా భావించి, పరమాత్మను నాయకునిగ నెంచి తనపరితాపమును ఆతనితో దెల్పు శృంగార భక్తి విషయమే ఈ పదజావళుల సాహిత్యముచే ప్రకటితమగు చున్నది. ఈ గేయఫణుతులన్నియు తాళ -ఆవృత్తములోని అక్షరముల పరిమితి ననుసరించి యతిప్రాసాది లక్షణములతో గూడియున్నవి. వీటిలో గొన్నిటికి గణనియములు లేవు. ఆద్యంతాక్షర నియమములు కూడ గల్గినవిగలవు. దీక్షితులవారి కీర్తనములలో ప్రతి పాదమునకు ఇట్టి ఆద్యంతాక్షర నియమముగలదు.

ఇంక జానపదగీతముల సాహిత్యమునకు గూడ ఒక విధమగు ప్రత్యేకత గలదు. స్త్రీలు పాడుకొను లంకా యాగము, కుచ్చలకథ మొదలగునవికూడ హృద్యమైన, సులభమైన భాషావిశేషములతోగూడి యున్నవి. ఆంధ్ర వాఙ్మయమున ఈ గాన సాహిత్యమునకుగూడ నొక యర్హస్థానము గలదనుటలో సందేహములేదు.

చి. వే. శ.

గారడి విద్య (Jugglery) :

గారడి (త) అను పదము "గారడము” (గారడము+ఇ) నుండియు, గారడము “గరుడ” శబ్దము నుండియు ఉత్పన్నమైనట్లు కనిపించుచున్నది. "గారడము" అనగా 'విషమంత్రము లేక మాయ.' గరుడుడు పాములకు శత్రువు. పాములవాడు కూడ పాములకు శత్రువు. కనుక పాములవానిని, వానిమంత్రములను, మాయలను గారడి అని మొదట వ్యవహరించెడి వారు. కాని క్రమముగ పాములవాళ్ళు ఉదరపోషణార్థము, ఊరూరను తిరుగుచు పాములకు సంబంధించిన పనులే కాక మాయలు అనగా గారడి విద్యాప్రదర్శనలు కూడ చూపించుచు వచ్చిరి. అందువలన ఆ మాయా ప్రదర్శనలు, గారడివిద్యగా పేర్కొనబడు చున్నవి. ఇవి ఇట్లు పేర్కొనబడుటకు కన్నడపదమైన "గాడిగార” (మాయ చేయువాడు) యొక్క ప్రభావము కూడ కొంత ఉండి యుండవచ్చును.

గారడివిద్య హస్తలాఘవము మీద ఎక్కువగా ఆధారపడిన “మాయల” ప్రదర్శనము. ఇదియొక తంత్రము నందు చెప్పబడి యున్నది. ఇంద్రజాలము, మహేంద్రజాలము, టక్కు, టమారు, గజకర్ణవిద్య, గోకర్ణవిద్య, కనుకట్టు అనునవి గారడివిద్యజాతికి సంబంధించినవే. కాని దానికంటె ప్రదర్శన సందర్భమున ఇంకను ఎక్కువ శక్తి సామర్థ్యములు అవసరము కలిగినవి.

ఇంద్రజాలమును గురించి గుణాఢ్యుని బృహత్కథలో పేర్కొనబడినది. గారడికంటె కష్టతరమైన ఇంద్రజాలము గుణాఢ్యుని కాలమునాటికి ప్రచారములో నున్నయెడల అంతకుమునుపే మనదేశములో గారడి

345