Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాజు పరిశ్రమ

సంగ్రహ ఆంధ్ర

రేకెత్తెను. గ్రామీణ జీవితములో నూతన తేజస్సు పొడమెను. గ్రామ సీమలలోని కొనుగోలుశక్తి హెచ్చెను. ఇది యొక మహత్తరమైన విజయము. గాంధిజీ స్థాపించిన అఖిలభారత చరఖా సంఘము, గ్రామ పరిశ్రమల సంఘము ఈనాటి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి పునాదివేసెను. ఈనాడు చిన్నతరగతి కుటీర పరిశ్రమలకు విలువ ఒసగబడుచున్నది. దీనికి కూడా గాంధీజీ వేసిన పునాదియే కారణ మనవలయును. గాంధీజీ దూరదృష్టి కలవాడు. అందుచేత నే విద్యుచ్ఛక్తి కూడ మన పరిశ్రమలలో ఉపయోగింపదగినదని ఆతడు వచించెను. కావున ఆర్థిక సిద్ధాంతములలో గాంధి సిద్ధాంతములకొక ప్రత్యేకస్థానము గలదు.

ఆర్. వి. రా.

గాజు పరిశ్రమ :

అగ్నిపర్వతములు బ్రద్దలైన ఫలితముగా ఒక్కొక్కప్పుడు కొన్ని సమ్మేళనముల వలన గాజుపదార్థ మేర్పడును. ఇట్టి పదార్థము 'వాల్కానిక్ గాజు' అని కూడ పిలువబడును. ప్రకృతిలో 'అబ్సీడియన్' అను ద్రవ్యముగా గాజు లభ్యమైనను, ఇది ప్రముఖముగా కొన్ని పదార్థములయొక్క సమ్మేళనమువలన కృత్రిమముగా రూపొందునని మాత్రమే చెప్పనగును. కొన్ని లోహపు ఆమ్లజనిదములను (Oxides) ఇసుకలో మిశ్ర మొనర్చి, కరగబెట్టిన ఫలితముగా గాజు తయారగును. ఇది స్ఫటికనిర్మాణము కలదిగా కనిపించక, గట్టిగా, వెళుసుగా గూడ నుండును. గాజు పగిలినప్పుడు, పగులువారిన ప్రదేశమున నతోదరములైన నొక్కులును, (Concave depressions) ఉన్నతోదరములైన ఉబ్బెత్తులును (Convex elevations) ఏర్పడును. ఇది 'కంకాయిడల్ పగులు' (Conchoidal fracture) అను విశిష్ట గుణము కలది; నియతముగా వెలుతురును పరావర్తనము చేయు లేక వక్రీభవనము (Refraction) చేయు స్వభావము గల ఉపరితలమును కలిగియుండును.

సంపూర్ణ పారదర్శకత్వము (Transparence) గాజునకు గల అత్యంత అమూల్యమైన భౌతిక లక్షణములలో నొకటి. వివిధములైన ద్రవ్యములయొక్క అనుకూల సమ్మేళనముచే, గాజుయొక్క సంపూర్ణ కిరణభేద్య గుణమును (Transparence), అసంపూర్ణ కిరణ భేద్య గుణమును (Translucence), వర్ణములును ప్రతి స్వల్పాంశమున ఎప్పటికప్పుడు మారుచుండును. సాధారణముగా తెల్లని గాజుపలకలు గవాక్షములకు విరివిగా ఉపయోగింపబడు చున్నవి. దృక్పరికరములు (Optical instruments) తయారు చేయుటకు ఎక్కువ కిరణభేద్యత కలిగి, వక్రీభవన (Refractive), వికిరణ (Dispersive) శక్తులను కలిగియున్న ప్రత్యేక తరగతుల గాజు అవసరము. గాజుపాత్రలయందు గాని, గాజుసీసాలయందుగాని సాధారణముగా ఎట్టి విషద్రావకము లుంచినను. వాటి దుష్ప్రభావములను ఆ గాజుపాత్రలు ప్రతిఘటింప గలవు. అందుచే ఆ ద్రావకములవలన గాజుపాత్రల కెట్టి నష్టమును ఘటిల్ల నేరదు. ఇట్టి శక్తి కలిగిన పదార్థముల సమ్మేళనముతో గాజుసామాను తయారగును. కాని గాజు ఉదజప్లవ కామ్లము (Hydrofluoric acid) లో వేసినంతనే కరగిపోవును.

కరిగిన గాజును పోత పోయవచ్చును. సన్నని గొట్టముల ద్వారమున మూసలలోనికి ఊదవచ్చును; అంతే కాక, కడ్డీలుగా లాగవచ్చును; లేదా, దారపుపోగులుగా గూడ తీయవచ్చును. మనము కోరిన మరే యితర రూపమున నైనను దానిని తయారు చేయవచ్చును.

చరిత్ర : గాజు నిర్మాణ కళ అతి ప్రాచీనమైనది. థీబ్జు నగరము (ఈజిప్టు) కడనున్న సమాధులపై గల చిత్రణములే ఇందుకు నిదర్శనములు. క్రీ. పూ. 1400 వ సంవత్సర ప్రాంతమున వెలసిన ఈచిత్రణములు, ఆధునిక యుగమున మానవుడు తయారుచేయు గాజు పదార్థముల పనితనమును పోలియున్నవి. అస్సీరియనులు, ఫొయినీషియనులు, గ్రీకులు, ఎట్రుకనులు అభ్యసించిన ఈకళ అత్యంత ఉన్నతదశకు చెందియున్నది. మధ్య యుగములలో కళాత్మకమైన గాజువస్తువులను తీర్చి దిద్దుటలో వెనీసు నగరము (ఇటలీ) ప్రఖ్యాతిగాంచియున్నది.

క్రీ. శ. 1790 లో గ్వినార్డ్ (Guinard) అను గడియారములు చేయు స్విట్జర్లండ్ దేశీయుడు ప్రథమమున సులోచనములకు ఉపయోగపడు గాజును కరగించి కలియబెట్టు (stirring) విధానమును కనుగొనెను. అనంతరము అతడు ఏకజాతీయమైన (homogeneous) కళ్లద్ద

324