Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాంధి (ఆర్థిక సిద్ధాంతములు)

వచ్చెను. అభివృద్ధిపొందని ఆర్థికవ్యవస్థలో పెట్టుబడి కొదువగా, మానవశక్తి సమృద్ధిగా ఉండుట సహజము. అట్టి పరిస్థితులలో గ్రామపరిశ్రమలను, చేతిపనులను ప్రోత్సహించి, గ్రామములను స్వయంపోషకములుగా చేయుటయే, దేశమునందలి పెక్కుకోట్ల ప్రజల జీవన ప్రమాణమును వృద్ధిచేయుటకు సవ్యమైన మార్గమని అతడు చెప్పెను. అయితే, అట్టిది ఈ యాంత్రిక, పారిశ్రామికయుగములో సాధ్యమా? అది గడియారమును వెనుకకు నడిపించుట వంటిది కాదా ? అని సంశయించువారు అనేకులు గలరు. కాని గాంధీజీ అభ్యుదయ వ్యతిరేకి కాదు. తనకు యంత్రముల విషయమున ప్రతికూలభావము లేదనియు, విద్యుచ్ఛక్తి, నౌకానిర్మాణము, ఇనుపకర్మాగారములు, యంత్రముల తయారీ మొదలగు కార్యక్రమములు గ్రామీణుల చేతిపనుల సరసనే వర్ధిల్ల వచ్చుననియు అయన నొక్కి చెప్పెను.

గాంధిగారి ఆర్థిక సిద్ధాంతములలో ఆర్థిక అసమానత్వమును, దోపిడిని అరికట్టవలెననునది మరియొకటి. ఆయన తనను దరిద్రనారాయణుని సేవకునిగా పరిగణించుకొనెను. స్వరాజ్యము పేదలస్వరాజ్యము కావలయునని వాంఛించెను. కొలదిమంది స్వప్రయోజనపరులై, పేదల సమాధులపై సౌధములు నిర్మించుకొనుటకు తోడ్పడు ఆర్థిక వ్యవస్థను ఆతడు నిరసించెను. ఆర్థిక అసమానత్వమును అవినీతికి మారుపేరుగ ఆతడు పరిగణించెను.

ఇందుండియే గాంధి మహాత్ముడు సామ్యవాదియా అను మరియొక ముఖ్యప్రశ్న ఉదయించుచున్నది. సామ్యవాదమునకును గాంధీ తత్త్వమునకును పెక్కు పోలికలు ఉన్నమాట నిజమే. గాంధి. మార్క్స్ అను నిరువురుకూడ తమ కాలములయందలి అర్థిక వ్యవస్థలలోని లోపములను ఎత్తి చూపి దానిపై తిరుగుబాటు చేసినవారే. ఇర్వురును 'లాభాపేక్ష' (Profit motive) అను విషయమును నిరసించినవారే. ఇర్వురును సమానత్వముపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను ఆశించినవారే.

అయితే ఈ రెండువాదములకును మధ్యగల సామ్యము కంటె భేదములే పెక్కులున్నవి. గాంధిజీ బోధించిన అహింస, ధనికుల హృదయములలో పరివర్తనము కల్గించి వారిని పేదలయొక్క క్షేమమునకు ధర్మకర్తలను చేయుట, ఈ సిద్ధాంతమునకును, ఇట్టి మరికొన్ని సిద్ధాంతములకును మార్క్స్ బోధించిన సామ్య వాదములో తావు లేనేలేదు. వర్గకలహము మొదలగు సిద్ధాంతములకు గాంధీజీయొక్క ఆర్థిక తత్త్వములో స్థానములేదు . సామ్యవాదులు బలప్రయోగముపై ఆధారపడి తామాశించిన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకొనవలెనని అశించిరి. గాంధీజీ మాత్రము నైతిక ప్రవర్తనముపై ఆధారపడెను. వాస్తవమునకు గాంధీ తత్త్వములో ప్రభుత్వమునకు (State) స్థానమేలేదు. ఆయన స్వయంపోషకములైన గ్రామముల సమ్మేళనమును కాంక్షించెను.

ఇట్లు గాంధిమహాత్ముని ఆర్థిక సిద్ధాంతములలో విశిష్ట లక్షణములు గలవు. అదృష్టవశమున నేటి మేధావులు గాంధీ తత్త్వము విషయమున తమకు మున్నుగల ఉదాసీనతను విడనాడి దానిని గ్రహించుటకు ప్రయత్నించు చున్నారు. అనేకమంది పాశ్చాత్య మేధావులలో కూడ ఇట్టి ఆకాంక్ష దినదినము వృద్ధిపొందుచున్నది. నేటి అనేక విశ్వవిద్యాలయములలో గాంధీమహాత్ముని సూత్రములు అర్థశాస్త్ర విద్యార్థులకు బోధింపబడుచున్నవి. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ఆతని ఆదేశములకు అనుగుణ్యముగా అనేక సంస్థలను నెలకొల్పి, గృహ పరిశ్రమలను పునరుద్ధరించుటకు కృషిచేయుచున్నవి. ప్రజల జీవన ప్రమాణమును వృద్ధికి తెచ్చుటలో ఆ ప్రయత్నములు పొందిన విజయమే బాపూజీ సిద్ధాంతముల ప్రసక్తికి ప్రబల నిదర్శనము.

ఇతర దేశములందలి కొందరు ఆర్థికశాస్త్రవేత్తలు తాము ప్రతిపాదించిన ఆర్థిక సూత్రములను తమ కాలములో స్వయముగా అమలు జరిపి, తమ ప్రజల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దలేక పోయిరి. వారి సిద్ధాంతములను ఇతరులు అమలులో పెట్టిరి. కాని గాంధి మహాత్ముడు తన సిద్ధాంతములను ప్రజలకు బోధించుటయేగాక స్వయముగా వాటిని అమలులోపెట్టి గ్రామీణ జీవితములోను, ఆర్థిక సిద్ధాంతములలోను నూతనములైన పద్ధతులను ప్రవేశ పెట్టెను. అనాటి ఆర్థికశాస్త్ర పండితులలో పెక్కురు గాంధీజీని దూషించుచుండిరి. కాని భారత దేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత గ్రామీణ పరిశ్రమలలో, స్వదేశ పరిశ్రమలలో క్రొత్త ఉత్సాహము

323