Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)

వీథులు' ఆధునిక సాహిత్యమున సమగ్ర సమీక్షాగ్రంథము. ఇవన్నియు సులభ గ్రాంథిక వచనములుగా నున్న వే.

కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆంధ్ర పరిశోధకులలో ప్రముఖస్థానము నాక్రమించగలవారు. వీరు రచించిన శృంగార శ్రీనాథము చారిత్రకముగను, సాహిత్యకముగను పెక్కు నూత్న విషయములను తెలుపు గ్రంథము. మరికొన్ని వ్యాసములు వీరు రచించినవి మీగడ తఱకలు, సింహావలోకనము అను పేర ప్రచురింపబడినవి. ఇవియు పరిశోధనాత్మకములే. శ్రీ నిడదవోలు వెంకట్రావుగారి ఆంధ్రకవులు జీవితములు, దక్షిణాంధ్ర కవులు అనునవి మదరాసు విశ్వవిద్యాలయమువారు ప్రకటించిన సాహిత్య పరిశోధన గ్రంథములు. కీ. శే. ప్రతాపరెడ్డిగారు బహువిధముల మత సాంఘిక విషయములను శోధించి, ఆంధ్రుల సాంఘిక చరిత్రమును కూర్చిరి. వివిధ వస్తు సంబంధములైన పరిశోధన వ్యాసములు పెక్కు సాహిత్య పత్రికలలో ప్రచురితమైనవి. ఈకాలమున భాషావిషయమగు పరిశోధన కూడ జరిగినది. ఆంధ్రము ద్రవిడ భాషాజన్యమను కాల్డ్వెలు గారి సిద్ధాంతమును గ్రహించి కోరాడ రామకృష్ణయ్యగారు భాషాచారిత్రక వ్యాసములు, గంటి జోగిసోమయాజిగారు ఆంధ్రభాషా వికాసము అను గ్రంథములను వ్రాసిరి. శ్రీ సోమయాజిగారి గ్రంథము పరిశోధనాత్మకములలో బృహత్తరమైన గ్రంథము. ఆంధ్రము సంస్కృతభాషా జన్యము అను సిద్ధాంతమును బలపరచిన కీ. శే. చిలుకూరి నారాయణరావుగారి గ్రంథముకూడ పెక్కు పరిశోధన విషయములతో కూడి యున్నది. పరిశోధనమునకు సంబంధించిన పటములకు విశ్వవిద్యాలయము లందు పరిశ్రమించిన పలువురు పండితులు ఉత్తమ బృహద్వ్యాసములను రచించియున్నారు. ప్రాఙ్నన్నయ యుగమునందలి భాష, ఆంధ్రభాషపై నాంగ్లభాషా ప్రభావము, ఆంధ్ర జానపద వాఙ్మయము, యక్షగానము మొదలగు శీర్షికలతో ప్రామాణిక పరిశోధనలు జరిగినవి.

ఆధునిక కాలమున ఇరత సాహిత్య ప్రక్రియలకన్న హెచ్చు వేగముగాను, సర్వతో ముఖముగాను వచనము అభివృద్ధిచెందుట ముదావహము.

ఎం. కు.


గద్యవాఙ్మయము (సంస్కృతము) :

సంస్కృతభాష విశ్వభాషాప్రపంచమున ప్రాచీనతమ మైనది. అది అఖిలభాషలకు జనని. భాషాంతర విలక్షణములును, విశిష్టములునైన ప్రకృతి ప్రత్యయాది సంస్కార విశేషములచే సంస్కరింపబడినదగుటచే దానికి సంస్కృతమని పేరు. ‘భాష్యతే, భాషణాది వ్యవహారః అనుష్ఠీయతే, యయా సా భాషా'. దేనిచే భాషణాది వ్యవహారము కావింపబడునో అది భాషయగుచున్నది. అట్టి సంస్కృత భాషచే నిర్మింపబడిన కావ్యములు సంస్కృత కావ్యములు. తాదృశకావ్యముల సముదాయమే సంస్కృత వాఙ్మయ మగుచున్నది. 'కవితే చాతుర్యేణేతి కవిః తస్య కర్మ కావ్యం.' పద్యకావ్య మనియు, గద్యకావ్య మనియు కావ్యము ద్వివిధము. ఛందోబద్ధమైనది పద్యకావ్యము. తద్భిన్నమైనది గద్యకావ్యము.

వేదములందలి గద్యభాగములే ప్రాచీన మహర్షి విరచిత గద్యములకును. తదనంతర మహాకవి విరచితము లయిన గద్యములకును మూలభూతములని తెలియుచున్నది. లౌకికభాషగా సంస్కృతము వాడుకలోనున్న ప్రాచీన కాలమున సంభాషణ ప్రతి సంభాషణములకు గద్యమే సాధనమయ్యెను.

వేదములందలి బ్రాహ్మణములు వేదమంత్రార్థ వివరణాత్మకములు. బ్రాహ్మణములలో కొన్ని విధినిషేధములను బోధించుచున్నవి. కొన్ని స్తుతిపరములుగా, నిందాపరములుగా నుండి, విధినిషేధములకు ప్రోద్బలకములై విరాజిల్లుచున్నవి. తైత్తిరీయ యజుర్వేదము నందు తప్ప ఇతర వేదములందలి బ్రాహ్మణములన్నియు ప్రాయశః . గద్యాత్మకములుగానే కనిపించుచున్నవి. తైత్తిరీయ యజుర్వేదమునందు ఏడు కాండములుగా నున్న సంహితాభాగము ముప్పాతిక మూడువంతులు గద్యాత్మకమైయున్నది. బ్రాహ్మణ శేషభూతములయిన ఆరణ్యకములును, ఆరణ్యకోత్తరకాలికము లయిన ఉపనిషత్తులును గద్యమయములుగ నున్నవి.

వేదముల అపౌరుషేయత్వమును విశ్వసించువారు వేదములందలి వివిధభాగములగు బ్రాహ్మణ - ఆరణ్యక ఉపనిషత్తులందుగల భాషాకాఠిన్య లాలిత్యము లేక కాలికములును, స్వతస్సిద్ధములునై యున్నవనుచున్నారు.

293