Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

ములు. శిల్పమును దృష్టియం దుంచుకొని కథానికా రచన చేసినవారిలో ముఖ్యులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వీరి కథలు ఎనిమిది సంపుటములుగా వెలువడినవి. ఇవి మానవజీవితమునకు ప్రతిబింబములు. సరళ వ్యావహారికశైలిని వీ రవలంబించిరి. శ్రీ గుడిపాటి వెంకటచలంగారి కథలు ప్రత్యేకతను చాటుచున్నవి. వీరి కథలన్నియు ఆకర్షకములు. సంప్రదాయోల్లంఘనము, స్వైరవిహారము వీరి రచనాలంబనములు. వీరి 'హంపీ కన్యలు', 'సినిమాజ్వరము' ఆంధ్రపాఠకుల మన్ననలను పొందినవి. శ్రీ కొడవటిగంటి కుటుంబరావు స్వతంత్రముగా కథారచనచేయుటయందు నైపుణ్యముకలవారు. వీరి కథలలో చెప్పదగినది ఉత్తమ పాత్రపోషణ. ఇందు వ్యంగ్యము, చమత్కారము అంగములుగానుండును. శైలి వ్యావహారికమే. ‘పక్షికోసం వెళ్ళినపంజరం', 'లేచిపోయిన మనిషి', 'ఆడజన్మ' మున్నగు కథలు ప్రఖ్యాతములు. ఇవిగాక చింతాదీక్షితులుగారి ఏకాదశి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి కథలు, పాలగుమ్మి పద్మరాజుగారి గాలివాన, బుచ్చిబాబుగారి నిరంతరత్రయం, పేర్కొనదగినవి. శ్రీ భరద్వాజ, ధనికొండ, మధురాంతకం రాజారాం, భాస్కరభట్ల కృష్ణారావు, పొట్లపల్లి రామారావు మొదలగువారుకూడ కథకులుగా ప్రసిద్ధిపొందిరి. కథానిక వలన వ్యావహారిక వచన రచన చక్కని ప్రాచుర్యమును పొందినది.

వ్యాసములు, విమర్శనములు, పరిశోధనలు : ఆథునిక వ్యాసకర్తలలో అగ్రగణ్యులుగా పేర్కొనదగినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు. ఆంగ్లమునగల 'స్పెక్టేటరు' అను వ్యాసముల ననుసరించి వీరు తెలుగున వ్రాసిన వ్యాసములు 'సాక్షి' యను పేర ఆరు సంపుటములుగా ప్రచురితములై బహుజనామోదమును పొందినవి. సాంఘిక దురాచారములు విమర్శన మిందు ముఖ్య వస్తువు. చమత్కారముగా వ్యంగ్యముగా నెంతటి గంభీర విషయమునైనను చెప్పుటయందు వీరికిగల నేర్పు అద్వితీయము. శైలివ్యావహారికమునకు సమీపముగా నుండు గ్రాంథిక వచనము. తెలుగున ఇంతటి ప్రసిద్ధి వహించిన వ్యాసకర్తలు మరెవ్వరును లేరు.

ఆంధ్రదేశమున వెలువడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక ఇత్యాదుల ద్వారమున పెక్కు వ్యాసములు ప్రచురితములైనవి. ఇందలి సంపాదకీయ వ్యాసములు వివిధ విషయభరితములు, ముట్నూరి కృష్ణారావుగారి వ్యాసములు “సమీక్ష" యనుపేర సంపుటీకరింపబడినవి. చరిత్రకు సంబంధించిన పెక్కువ్యాసములు కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు రచించియున్నారు. వీరి ననుసరించి మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వ్రాసిన వ్యాసములు ప్రసిద్ధినార్జించినవి. శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారి విద్యార్థి ప్రకాశిక కోరాడ రామకృష్ణయ్యగారి సారస్వత వ్యాసములు, వావిలాల సోమయాజులుగారి మణిప్రవాళము మున్నగునవి ఉత్తమ వ్యాస సంపుటములు.

ఆంగ్ల విమర్శన శిల్పము నాదర్శముగా గొని ఆంధ్రమున విమర్శనము వ్రాసినవారిలో మొదటివారు కీ. శే. కట్టమంచి రామలింగారెడ్డిగారు. వీరి కవిత్వ తత్త్వ విచారము ఉత్తమ విమర్శన గ్రంథము. కళాపూర్ణోదయమును గురించి వీరు వ్రాసిన వ్యాసము భవిష్యద్రచయితలకు మార్గదర్శకమైనట్టిది. సరస సాహిత్య విమర్శకు అనంతకృష్ణశర్మగారి రచనలు లక్ష్యములు. వీరి 'నాటకోపన్యాసములు', ‘సారస్వతాలోకనము' విమర్శనాత్మక వ్యాసములు. విశ్వనాథ సత్యనారాయణగారి 'నన్నయ్యగారి ప్రసన్నకథా కలితార్థయుక్తి' ఒక చక్కని విమర్శన గ్రంథము. పుట్టపర్తి నారాయణాచార్యులుగారి 'ప్రబంధ నాయికలు', కేశవపంతుల నరసింహశాస్త్రిగారి 'ప్రబంధ పాత్రలు', కోరాడ రామకృష్ణయ్యగారి 'ఆంధ్ర భారత కవితా విమర్శనము' పేర్కొనదగినవి.

ఆధునిక యుగమున ఆంధ్రవాఙ్మయ చరిత్రలు కొన్ని వెలసినవి. వెంకటనారాయణరావుగారు వ్రాసిన ఆంధ్రవాఙ్మయ చరిత్రము సంగ్రహమైనను సమగ్రమైనది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు రచించిన ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము క్రీ. శ. 1800 వరకు గల సాహిత్య పరిణామమును వర్ణించు సరళ వచన గ్రంథము. వీరు, ఖండవల్లి బాలేందుశేఖరంగారితో కలిసి రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి'అను గ్రంథము సమగ్రాంధ్ర సంస్కృతిచరిత్రను వివరించు ఏకైక గ్రంథము. కీ. శే. కురుగంటి సీతారామయ్యగారు వ్రాసిన 'నవ్యాంధ్ర సాహిత్య

292