గద్యవాఙ్మయము (తెలుగు)
సంగ్రహ ఆంధ్ర
'ఆంధ్రభాషాభివృద్ధి' అను వాఙ్మయవిషయక వ్యాసము ప్రకటించిరి. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారి భాస్కరరామాయణ కర్తృత్వమును గురించిన వ్యాసము (1898), వెన్నేటి రామచంద్రరావుగారి 'మనువసు ప్రకాశిక', బ్రహ్మయ్యశాస్త్రిగారే రచించిన వసుప్రకాశిక విమర్శనము, నన్నయభట్టారక చరిత్రము కూడ విమర్శనాత్మక గ్రంథములే.
వీరేశలింగము - అతని రచనలు : చిన్నయసూరితో అభివృద్ధిని పొందిన వచనవాఙ్మయము వీరేశలింగముగారి రచనలలో మరింత వికాసము పొందినది. సూరి రచనలు కేవలము గ్రాంథికములై సులభబోధకములు కాకపోవుటచే అవి పండితులకు మాత్రమే పఠనీయము లైనవి. కేవలము సాహిత్యసేవయేకాక, సాంఘికసంస్కరణము కూడ వీరేశలింగముగారి ధ్యేయమగుటచే వారు సులభ బోధకములగు రచనలు చేసిరి. వీరేశలింగముగారి గ్రంథములలో అధికభాగము వచనమే యగుట యొక విశేషము. అందుకే ఈయనకు గద్యతిక్కన యను పేరు కలిగినది. "నే నేర్పరచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుగుభాషలో మృదువైన సులభశైలిని, సలక్షణమైన వచనరచన చేయుట" అని వారే 'వివేక వర్ధనీ' పత్రికా ముఖమున తెలిపిరి. వీరి రచనలలో సుబోధత, వైశద్యము, సమత, జీవము ముఖ్యలక్షణములుగా పేర్కొనవలెను. వీరి గద్యరచనయందలి విభాగములు నవల, కథలు, జీవిత చరిత్రలు, వ్యాసములు, ప్రహసనములు, గ్రంథ విమర్శనములు, చారిత్రక గ్రంథములు, పత్రికా రచనములు, శాస్త్రగ్రంథములు, ఉపన్యాసములు అను నవై యున్నవి.
బాలురకు పఠనీయములుగా నుండు పెక్కు కథలను వీరేశలింగముగారు రచించిరి. వీరి 'సత్యరాజాపూర్వదేశ యాత్రలు' మున్నగు కథాగ్రంథములు ప్రౌఢులుసైతము చదువతగినవి. ఇవి ఆంగ్లానుసరణములే యైనను సలక్షణ స్వతంత్ర రచనలతో నున్నవి.
ప్రసిద్ధ స్త్రీపురుషులయొక్క జీవిత చరిత్రలను వ్రాసిన వారిలో ప్రథములు వీరేశలింగముగారు. వీరి విక్టోరియా మహారాజ్ఞీ చరిత్ర, జీసస్ చరిత్ర, భవిష్యద్రచయితలకు మార్గదర్శకములైనవి. ప్రత్యేక శీర్షికలతో అతిదీర్ఘము కాక, అతిక్లుప్తమును కాక విషయ వివరణము కలిగియున్న లఘురచనకు వ్యాసమని పేరు. ఇట్టి రచనలను వీరేశలింగముగారు పెక్కు వెలయించిరి. దేశాభిమానము, సంఘ సంస్కరణము, సత్ప్రవర్తన మున్నగు విషయములను గూర్చి వీరు వ్రాసిన వ్యాసములు పెక్కులున్నవి. సాంఘిక దురాచారములను విమర్శించుచు హాస్యప్రధానముగా వీరు రచించిన ప్రహసనములు పెక్కులు కలవు. ఈయన 58 ప్రహసనములు రచించెను. బ్రహ్మవివాహము, అపూర్వ బ్రహ్మచర్యము, విచిత్ర వివాహము, మహాబధిర ప్రహసనము ఆదిగా గలవి ప్రఖ్యాతములు.
గ్రంథవిమర్శన విషయమున కూడ వీరేశలింగముగారే అగ్రేసరులు. వేంకటరత్నకవి 'విగ్రహతంత్రవిమర్శనము' పేర్కొనదగినది. విమర్శ వ్యక్తిగతముగా కాక సాహిత్య ప్రధానముగా నుండుట గమనింపతగినది.
వీరేశలింగముగారు రచించిన చారిత్రక గ్రంథములను మూడు విభాగములు చేయవచ్చును. 1. స్వదేశ సంస్థాన చరిత్రలు, 2. స్వీయ చరిత్ర, 3 ఆంధ్ర కవుల చరిత్రలు. వీనిలో చివరిది ముఖ్యమైనది. ఈ వచన గ్రంథము క్రీ. శ. 11 వ శతాబ్దమునుండి 19 వ శతాబ్దమువరకు గల కవుల చరిత్రను సులభశైలిలో వివరించు చున్నది. వచనమున స్వీయచరిత్ర వ్రాయుటకు వీరేశలింగముగారే ప్రథములు. 'వివేక వర్ధనీ' పత్రికా ముఖమునను, 'హాస్య సంజీవని' యందును వీరు వ్రాసిన వ్యాసములు పత్రికా రచనమున వీరికిగల నేర్పును ప్రకటించును. ప్రాచ్య పాశ్చాత్య సంబంధ శాస్త్రీయ గ్రంథములను కూడ వారు రచించిరి. ఈ గ్రంథములందుపయోగింపబడిన పారిభాషిక పదజాలము కొంత ప్రాచీనమును, కొంత స్వయంకల్పితమునై యున్నది. తర్క సంగ్రహము, కావ్య సంగ్రహము, అలంకార సంగ్రహము, జ్యోతిశ్శాస్త్రము, జంతుశాస్త్రము, శారీరక శాస్త్రము (Physiology) అనునవి వీరినవీనగ్రంథములు. వివిధ సభల యందు ఉపన్యసించు సందర్భమున వీరేశలింగముగారు ముందు తమ ప్రసంగములను వ్రాసికొని చదువుట పరిపాటి. తరువాత వాటిని పత్రికా ముఖమున ప్రకటించు చుండువారు. ఈ ఉపన్యాసములు విషయ వైవిధ్యము కలవై సులభశైలిలో సరళముగా నుండును. "దేశీయ
290