Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

తార చరిత్ర సంగ్రహము (1861). తిమ్మరాజు లక్ష్మణరాయకవిగారి శ్రీ మార్కండేయపురాణసార సంగ్రహము (1876), శ్రీ కూర్మపురాణ సంగ్రహము (1877), శ్రీమత్స్యపురాణసార సంగ్రహము (1877). ఈ గ్రంథములన్నియు సులభగ్రాంథిక వచనమున రచితము లైనవే.

వీరేశలింగయుగము (1890 నుండి) : క్రీ. శ. 1890 నుండియే కందుకూరి వీరేశలింగముగారి రచన ప్రచారము చెందినను, వారి రచనా ప్రభావము 1900 నుండి స్ఫుటముగా కానిపించును. 1899 వ సంవత్సరమునాటికి వారి రచనలన్నియు సంపుటములుగా వెలువడినవి. అందువలన విద్యా సంస్కారము కలవారు వారిరచన లనేక ముఖములుగా పరిశీలించి నూతనరీతిని వచనరచన ప్రారంభించిరి. వీరి రచనలలో శైలీకాఠిన్యము లేదు. తేలికగను, గ్రాంథికముగను నుండు శైలిని వీరవలంబించిరి. వీరేశలింగ యుగమున వచన వాఙ్మయశాఖ పలు భిన్నముఖములుగా చిగిర్చినది. ముఖ్యవిభాము లివి:

నవల : ఆంగ్ల భాషా ప్రభావమున ఆంధ్ర భాషలో నుద్భవించిన ప్రక్రియలలో నవల మొదటిది. వీరేశలింగము గారికి పూర్వమే కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు 1867సం.న 'మహాశ్వేత' యను నవలను ప్రకటించిరి 1872 లో నరహరి గోపాలకృష్ణమ్మ సెట్టి 'రంగరాజ చరిత్ర' యను నవలను ప్రకటించెను. కాని వీరు వీనిని నవలలుగా పేర్కొనలేదు. వీరేశలింగముగారు గోల్డుస్మిత్ వ్రాసిన “వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డు" అను నవల ననుసరించి రాజశేఖర చరిత్ర యను నొక నవలను రచించిరి. నవల కుండదగిన లక్షణము లన్నియు దీని కుండుటచే నాంధ్రభాషలో నిది ప్రథమనవలగా ప్రఖ్యాతి నార్జించినది. వీరేశలింగముగారు నడిపిన "చింతామణి” పత్రికా ప్రోత్సాహమున కొన్నినవలలు ప్రచురితములైనవి. 1893లో ఖండవిల్లి రామచంద్రుడు వ్రాసిన ధర్మవతీ విలాసము, తల్లాప్రగడ సూర్యనారాయణరావు రచించిన సంజీవరాయ చరిత్రము అనువాటికి ఈ పత్రిక బహుమతుల నిచ్చినది. ఈ నవలలీ పత్రికలో ప్రకటింప బడినవి. సాహిత్యరంగమున చిలకమర్తి లక్ష్మీనరసింహకవి యొక్క ఆవిర్భావముతో తెలుగు నవలా రచనకు మంచి వికాసము కలిగినది. “చింతామణి” పత్రికా ప్రోత్సాహమున చిలకమర్తి కవి తన ప్రథమ రచన రామచంద్రవిజయమును ప్రచురించెను. దీనికి బహుళ ప్రచారము కలిగినది. ఈ పత్రికాముఖముననే ఈయన రచించిన అహల్యాబాయి (1897). కర్పూరమంజరి (1898), వెలుగును చూచినవి. ఇవికూడ ప్రజాదరమును బడసినవి. ఇవికాక ఖండవిల్లి రామచంద్రుడుగారి మాలతీ రాఘవము, టేకుమళ్ళ రాజగోపాలరావుగారి త్రివిక్రమ విలాసము, రెంటాల వెంకటసుబ్బారావుగారి కేసరీ విలాసము, కూనపులి లక్ష్మీనరసయ్యగారి 'బక్షీ' పేర్కొన దగినవి.

ఈ కాలమున చరిత్రకు సంబంధించిన కొన్ని వచన గ్రంథములు ప్రచురితమైనవి. బుక్క పట్టణము రాఘవాచార్యులు "తెనుగు రాజుల చరిత్రలు" అను గ్రంథమును 1881 లో రచించిరి. ఇది ముద్రణమునందలేదు. 1885 లో ఒడయరు వీరనాగయ్యగారు చాణక్య చరిత్రను వ్రాసిరి. గురుజాడ రామమూర్తిపంతులు "కవి జీవితము" లను పేర కవుల చరిత్రను రచించిరి. వీరే బెండపూడి అన్నమంత్రి చరిత్ర (1897), తిమ్మరుసు చరిత్ర (1898) కూడ రచించిరి.

ఆంగ్ల భాషా ప్రభావమున ఈ కాలమున తెలుగులో వ్యాసములు, ఉపన్యాసములు కొన్ని రచితములైనవి. 1881 లో రచింపబడిన వావిలాల వాసుదేవశాస్త్రిగారి 'ఆంధ్ర భాషను గూర్చిన ఉపన్యాసము'ను మొదట పేర్కొనవలెను. కాల్డ్వెలుగారి భాషాసిద్ధాంతములను పరిశీలించి వ్రాయబడినది ఈ వ్యాసము. గోపాలరావునాయడుగారు 1896 లో 'ఆంధ్ర భాషా చరిత్ర సంగ్రహము' అను ఉపన్యాసమును గ్రంథ రూపమున ప్రకటించిరి. 1885-1900 వరకు బహువిధములైన భాషాసాహిత్య విషయక వ్యాసములు 'చింతామణి' యందు ప్రకటితమైనవి. తెలుగులో వాఙ్మయవిమర్శన మను ప్రక్రియ కూడ ఆంగ్లభాషాప్రభావమున కలిగినదే. ఈ కాలమున నిట్టి విమర్శనములు కొన్ని వెడలినవి. చెన్నరాజధానీ కళాశాలలో దక్షిణామూర్తిగారు పింగళి సూరననుగూర్చి విమర్శనాపూర్వకముగ నుపన్యసించిరి. ఇది 1893 లో ముద్రితమైనది. 1896 లో శ్రీ కొచ్చర్లకోట రామచంద్ర వెంకట కృష్ణారావు బహద్దరువారు

289