Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గతితార్కిక భౌతికవాదము

సుప్రసిద్ధమైన తమ ఆర్థిక శాస్త్ర గ్రంథములలో వివరించిన రాజకీయ తత్త్వ సిద్దాంతమునకు గతితార్కిక భౌతిక వాదమని పేరు. 1917 వ సంవత్సరమున రష్యాదేశ మందు కమ్యూనిస్టు వ్యవస్థ నెలకొనినప్పటినుండి, ఆ దేశ మందును, ప్రపంచమందలి ఇతర సామ్యవాద దేశము లందును ఈ గతితార్కికవాదము అధికారిక సిద్ధాంతమైనది.

గతితార్కిక భౌతికవాద మనగా నేమి ? భౌతిక వాద మొక శాస్త్రీయమైన తాత్త్విక సిద్ధాంతము. భౌతికవాదము బహుభంగుల నిర్వచింపబడి వివరింపబడి ఉన్నది. అన్ని దృక్పథములందును ఒక అంశము సర్వసాధారణ మైనది (common) గా నున్నది. ఈ విశ్వమున మనస్సునకు స్వతంత్రమైన, ఐచ్ఛికమైన ప్రవృత్తిలేదు. దాని ప్రవృత్తి మానసేతర విషయముల యొక్క (non-mental entity) చలనముచే తుదకు నిర్ణయింపబడును. ఆ చలనములను మనస్సు తనయం దిముడ్చుకొని పర్యాలోచన చేయును. ఇట్టి మానసేతర విషయము సామాన్యముగా భౌతిక పదార్థమని భావింపబడుచున్నది. కొందరు భౌతికవాదులు మనస్సు యొక్క అస్తిత్వమును పూర్తిగా నిరాకరింతురు. కాని స్వతంత్రమైన చొరవ (Initiative) మనస్సునకు లేదను విషయమున మాత్రము భౌతికవాదు లందరును ఏకీభావము ప్రకటించెదరు. కారల్ మార్క్స్ రెండవ బృందమునకు చెందినవాడు. ప్రాచీన, ఆధునిక తత్త్వశాస్త్రములను మార్క్స్ రెండు తరగతులుగా వర్గీకరించెను : (1) పదార్థము (Matter) మనస్సుకంటె తార్కికముగను (logical), కాలక్రమాను గతముగను (chronological), ముందరిదే (prior) నని విశ్వసించెడి భౌతికవాదులు. (2) మనస్సు పదార్థము కంటె తార్కికముగను, కాలక్రమానుగతముగను పూర్వపుదే నని భావించెడి ఆత్మవాదులు. వీరిలో మార్క్స్ మొదటి తరగతికి చెందినవాడు. కాని 18, 19 వ శతాబ్దుల నాటి భౌతికవాదులకంటె మార్క్స్ భిన్నాభిప్రాయము గలవాడు. ఈ శతాబ్దులనాటి భౌతికవాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రకారము మనస్సు మైనము వంటి పదార్థమని తెలియుచున్నది. బాహ్య ప్రపంచమునుండి ఈ పదార్థముపై ఇంద్రియ గ్రహణముల (sensations) వలె భావముద్రలు (impressions) ప్రసరించును. ఇట్టి భౌతిక వాద సిద్ధాంతము నెడల మార్క్స్ తన ఆక్షేపణము ప్రకటించెను. కారణమేమన, బాహ్య ప్రపంచమునుగూర్చి 'తెలియుట' (Knowing = మననము లేక ధ్యానము చేయుట) అను భావము లేదనియే అతడు వాదించును. తద్విరుద్ధముగా, బాహ్యప్రపంచము నుండి బయలువెడలు భావ పరంపరల నుండియు, సంఘటనల నుండియు కలుగు మానసిక పరివర్తనలచేతనే మానవుడు ఏ ఆలోచననైనను, కార్యమునైనను చేయనారంభించునని మార్క్స్ అభిప్రాయము. బాహ్య ప్రపంచమును తెలిసికొనుటయే గాక, దానిని పరివర్తనము చేయుట మానవ ప్రవృత్తిలో గల సార్థక్యము. బాహ్య ప్రపంచమును గూర్చి తెలిసికొనుట వలననే మనము తృప్తిపడుట లేదన్న అంశమును కాదనలేము. కాని బాహ్యప్రపంచమును తెలిసికొనుట మాత్రమే మానవుని ధ్యేయము కాగూడదు. ఏదేని యొక కార్య మాచరించుటకే మన మొక విషయమును తెలిసికొందుము. ఆచరణకు అన్వయింపబడని ఎట్టి జ్ఞానమైనను స్వతంత్రముగ మానవునకు సంక్రమింపజాలదు . సిద్ధించిన జ్ఞానముతో తెలిసికొనిన పదార్థమును మార్చుట వలననే, అట్టి జ్ఞానము సార్థకమగును. కార్యాచరణము వలననే పరిసరముల ప్రభావము మారును. ఆ కార్యాచరణము వలననే కర్తగూడ మారగలడు. ఈ విధముగ మానవ ప్రకృతి గాని, లేక విశ్వము గాని, చలనరహితముగ నుండదని మార్క్స్ యొక్క విశ్వాసము. మానవుడును, ఆతని ప్రకృతియు నిరంతరముగ పరివర్తనము చెందుచు, అతనితో పాటు నిర్విరామముగ మారెడు విశ్వమును గూర్చి జ్ఞాన మార్జించుచు, తనకు సిద్ధించిన జ్ఞానముచే ఇతోధికముగ మార్పును కలుగజేయుటకై ఆతడు ఉత్సాహముతో ఉద్యమించును.

ఇట్టి భౌతికవాదరూపమునకు 'గతితార్కికము' అను విశేషణపదమును చేర్చుటచే, సామాజిక పరిణామమునకు గతితార్కిక సిద్ధాంతములను అన్వయముచేయు పునాది ఏర్పడుచున్నది. గ్రీసుదేశములో ప్రప్రథమముగా 'గతితార్కికము' అను పదము ప్రయోగింపబడెను. ప్రత్యర్థుల నడుమ చర్చలమూలమున వాస్తవవిషయమును తెలిసి

277