Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణిత భూగోళము

దేవాలయములు తలలెత్తినవి. జాయపసేనాని రచించిన 'నృత్తరత్నాకరము' రామప్పలో శిల్పరూపమున లాస్య మొనరించుట కాంచవచ్చును. ఏకశిలానగరమునందలి మనోహరములగు ద్వారముల నిర్మాణమునకు సైతము ఆతడే కారకుడని కొందరందురు. 'కవిబ్రహ్మ'ను స్వయముగా గౌరవించిన భాగ్య మీ రాజేంద్రున కబ్బినది. విశ్వేశ్వరులవంటి మహామహితాత్ముల సేవానురక్తుడై ఐహి కాముష్మిక లాభముల నందినట్టివా డాతడు.

ఆతడొక నిర్మాణ కార్యకర్త; సువిశాలాంధ్ర సామ్రాజ్యమును ఏక చ్ఛత్రముగ 'ఆంధ్ర నగరము' (ఓరుగల్లు) రాజధానిగా అరువది రెండు సంవత్సరములు అప్రతి హతముగా నేలి దిగంత యశమును సముపార్జించిన సమ్రాట్టు.

జి. వి. సు.

గణిత భూగోళము :

విశ్వమునందు భూమియొక్క ఉనికి ː సుమారు 81/2 లక్షలమైళ్ళ వ్యాసముగల సూర్యగోళము ఖేచర గోళముల (Heavenly bodies) లో నెల్ల పెద్దది. అది భూమికి 93 మిలియను మైళ్ళ దూరమున సౌరమండలము (Solar System) యొక్క కేంద్రమందు స్థిరమై నిలిచియున్నది. మన భూమియొక్క వ్యాసము ఆ సూర్యగోళము యొక్క వ్యాసముకంTe 109 రెట్లు చిన్నది. భూమియొక్క గురుత్వాకర్షణశక్తి సూర్యగోళముయొక్క గురుత్వాకర్షణ శక్తికంటె 28 రెట్లు తక్కువగా ఉన్నది. గురుత్వాకర్షణశక్తి, కేంద్రాపగ (Centrifugal) శక్తి కారణముగా, బుధ, శుక్ర, భూమి, కుజ, గురు, శని, యురేనస్, నెప్త్యూన్, ఫ్లూటో అను తొమ్మిది గ్రహములు వేరు వేరు వేగ ప్రమాణములతో తమ తమ కక్ష్యలందు (Orbits) సూర్యునిచుట్టు పరిభ్రమించు చుండును. ఇవన్నియు సూర్యుడు సమకేంద్రముగా (Concentric) ఉండునట్లు అమర్పబడి యున్నవి. బుధ, శుక్రగ్రహములు సూర్యునికి ఎక్కువ సమీపముగా నున్నవి. మిగిలినవి వాటికంటె ఎక్కువ దూరములో నున్నవి. గ్రహముల యొక్క పరస్పరాకర్షణములు వాటియొక్క పరిమాణములకు అనుగుణముగా నుండును. ఈ గ్రహములకు స్వకీయమగు కాంతి ఉండదు. కాని సూర్యుని కాంతి వాటిపై ప్రతిబింబించుచుండును. సూర్యునివలె ఒక స్థానమందు గోళములో స్థిరముగానుండు తేజోమూర్తులను నక్షత్రములందురు. భూమి తిరుగుట వలన ఆకాశములో అవి తిరిగినట్లు కనిపించును.

గ్రహములచుట్టు వేరువేరు సంఖ్య గల చంద్రమండలములు అను ఉపగ్రహములు పరిభ్రమించు చుండును. నెప్త్యూనుకు భూమికివలె ఒకటే చంద్రమండలము కలదు. కుజునికి రెండు, యురేనసుకు నాలుగు చంద్రమండల ములు కలవు. గురునకు, శనికి చెరి తొమ్మిది చంద్రమండలము లున్నవి. బుధ శుక్ర గ్రహములకు చంద్ర మండలములు లేనేలేవు. మన చంద్రగోళము యొక్క వ్యాసము భూమియొక్క వ్యాసములో నాలుగవ వంతు ఉండును. అది భూమికి 2,40,000 మైళ్ళ దూరములో నుండి భూమిచుట్టు 291/2 రోజులలో ఒక ప్రదక్షిణము చేయును. ఇట్టి గ్రహ - ఉపగ్రహముల యొక్కయు, అసంఖ్యాకములయిన ఉల్కల యొక్కయు సముదాయము సౌరమండలముగా ఏర్పడినది. దూరముగానున్న మన నక్షత్ర మండలమునకు కోట్లకొలది మైళ్ళ కావల బాహ్యాకాశము నందు లక్షలకొలది గ్రహ నీహారికలు (Nebulae) కలవు. ఒక్కొక్క గ్రహ నీహారికకు మరల వాటివాటి గ్రహములతోను, ఉపగ్రహములతోను కూడియుండు లక్షలకొలది సూర్యమండలములు కలవు.(ఎడ్డింగ్‌టన్ అభిప్రాయమునుబట్టి 11,000 మిలియన్ల, మిలియన్ల, మిలియనులు)ఇది అంతయు విశ్వము (universe) యొక్క స్వరూపము.

భూమియొక్క ఆకృతి, సాంద్రత: మన భూమి ఘనగోళప్రాయాకృతిని (spheroidal) కలిగియున్నది. అది ధ్రువములను కలుపునట్టి ఇరుసు ననుసరించి కావించు దైనిక పరిభ్రమణము కారణముగా భూమధ్య రేఖ (Equator) మీద ఉబ్బుగను. ధ్రువములవద్ద చదునుగను ఏర్పడి యున్నది. బాగుగా ఎత్తైన స్థలములనుండి సముద్ర క్షితిజము (Horizon) ను కచ్చితముగా పరిశీలించి భూమియొక్క వ్యాసార్థమును (Radius) లెక్కకట్ట వచ్చును. భూమధ్య రేఖ యొద్దనుండు వ్యాసము, ధ్రువముల యొద్దనుండు వ్యాసము కచ్చితముగా సమానములు గావు. మొదటి దాని పొడవు 7926.6 మైళ్ళు;

247