Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడియారములు

సంగ్రహ ఆంధ్ర

దాని గొట్టము కదలుటకును విచిత్రమైన ఏర్పాటు చేయబడుచుండెను. పెట్టెలోనున్న నీరు, నీటిసాయమువలన త్రిప్పబడు చక్రముపైకి ప్రవహించుచుండెను. నీటివలన త్రిప్పబడు చక్రము అక్షమున కమర్పబడిన చిన్న పళ్ళ చక్రమును త్రిప్పుచుండెను. ఈ చక్రము మరొక చిన్న చక్రముయొక్క పళ్ళమధ్య పడునట్లుగా అమర్పబడి యుండుటచే ఆ చిన్న చక్రముగూడ తిరుగును. ఆచక్రము మరొక చిన్న పళ్లచక్రమును త్రిప్పగలిగెడిది. ఈ విధముగ నాలుగు చక్రములు తిరిగి, చివరకు గడియారము నిలిచి యున్న అక్షమును త్రిప్పుచుండెను. ప్రతి 24 గంటలకు 'Λ' ఆకారములో వంగిన పంపుద్వారా నీరు బయటికి వచ్చి అచటనున్న నీటిచక్రమును త్రిప్పుచుండెడిది. ఈ నాలుగు చక్రములు చివరకు అక్షమును త్రిప్పుటతో గడియారము తిరిగెడిది. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే గడియారము ఒకచుట్టు తిరిగెడిది. క్లెసీబియస్ తరువాతివారు ఇంతకంటె క్లిష్టమైన గడియారములను కనిపెట్టినట్లు తెలియుచున్నది.

చిత్రము - 79

పటము - 3

యిసుక గడియారము

ఇక భారతదేశములో కాలప్రమాణమును గుణించు పెక్కు సాధనములు వేలకొలది సంవత్సరముల నుండి వాడుక యందున్నట్లు చారిత్రక పరిశోధకులు పేర్కొని యున్నారు. ఉదాహరణమునకు, కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి కాలములో (క్రీ. శ. 1295–1326) ఓరుగల్లు నగరము నందు కాలపరిమాణమును తెలుపు గడియార ముండెనని తెలియుచున్నది. ఈ గడియారము ఇప్పటి మన గడియారముల వలె గంటలను తెలుపునది గాక ఘడియలను తెలుపునదిగా నుండెడిది. అట్టివానిని 'ఘటికా యంత్రము' లనుచుండిరి. క్రీడాభిరామములో:


"ఉ. ఉడువీథిన్ శిఖరావలంబి యగు
            నంధ్రోర్వీశు మోసాలపై
      గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్
            ఘంటా ఘణాత్కారమున్
      సడలెన్ భానుడు పశ్చిమంబునకు
            వైశ్యాపూట కూటింటికిన్
      గుడువంబోదమె లెక్క యిచ్చి కడు
            నాకొన్నార మిప్పట్టునన్."

అని మంచన గోవిందశర్మ యను బ్రాహ్మణుడు తన చెలికాడగు కోమటి టిట్టిభ సెట్టితో పలికినట్లు వ్రాయబడి యున్నది. దీనిని బట్టి ఆ కాలమునందు గూడ కాలపరిమాణమును దెలిపెడు గడియారములను బట్టి గడియలను దెలుపుచు గంటలు కొట్టుచుండిరి. అట్లగుటచేతనే 'యాంధ్రోర్వీశు మోసాల రెండెనిమిదులు (16) మ్రోసెనని' చెప్పబడెను. అనగా అప్పటికి సూర్యోదయాది పదునారు గడియలయి యుండెనని గ్రహింపవలయును. ప్రాచీనుల లెక్కప్రకారము అహఃప్రమాణము 30 గడియలగుటచే 16 గడియలగు నప్పటికి మన గడియారముల ప్రకారము పగలు 12 గం. 24 నిమిషము లగును. అది భోజన వేళ యే గదా!

ఘటికా యంత్రముల నిర్మాణ మెట్టిదో సరిగా తెలియదుగాని, ఒక తొట్టిలో నీరుపోసి యుంచెదరనియు, ఆనీటిలో అడుగున చిన్న రంధ్రముగల చిన్నగిన్నెను ఉంచెదరనియు, ఆ రంధ్రముగుండ గిన్నెలోనికి నీరెక్కి పూర్తిగ నిండునప్పుడు ఆ గిన్నె నీటిలో మునిగిపోవు ననియు, అదియే గడియకాలమని గుణించుచుండిరనియు తెలియు చున్నది.

కాలమాన విషయమునుగూర్చి ఆంధ్ర భాగవతములో తృతీయ స్కంధమునందు ఇట్లు వ్రాయబడియున్నది :

“దివస పరిమాణ విజ్ఞేయంబగు నాడికోన్మానాలక్షణంబు ఎరింగింతు వినుము :

"షట్పలతామ్రంబునం బాత్రంబు రచియించి చతుర్మాష సువర్ణంబునం జతురంగుళాయామ శలాకంబు గల్పించి, దానందత్పాత్రమూలంబున ఛిద్రంబు గల్పించి, తచ్ఛిద్రమునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందునంత కాలం బొక్కనాడికయగు”

గమనిక : 2 నాడికలు = ఒక ముహూర్తము = 2 గడియలు. అనగా, నాడిక = ఒక గడియ = 24 నిమిషములు.

21/2 గడియలు = ఒక గంట.

24 గం X 21/2 గ. = 60 గడియలు = 1 దినము.

పాలగడియారము : పూర్వము ఈజిప్టునందలి నైలు ద్వీపములో 'ఒసిరిస్' అను దేవాలయ ముండెను. దాని

238