Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

వర్ణనీయగజములు : అవలక్షణములు గల కొన్ని గజములు వర్ణనీయము లని శాస్త్రకారులు వక్కాణించి యున్నారు. లక్షణోపేతమైన హస్తి మంగళహేతువైనట్లే, దుర్లక్షణదూషితమైన కుంభి యనేకానర్థములకు మూలమగునను విశ్వాసము అతి ప్రాచీనమైనదిగా కన్పట్టుచున్నది. రత్నహయాదుల విషయమునను భారతీయు లిట్టి దృక్పథమునే కలిగియున్నారు. కొన్ని వర్ణనీయ కరు లివి :

1. మొక్కలీయము : దంతములు లేని గజమును మొక్కలీయ మందురు. సర్వలక్షణ సంపన్న మైనను కొమ్ములులేని యట్టి మొక్కలీయమును గ్రక్కున విడువ వలెను.

2. షండము : నడచునప్పుడు కాలు కాలు రాచుకొను నట్టి గజము షండము. అది తక్కిన లక్షణము లెన్ని గలిగినదైనను దూరమున విడువవలసినది.

3. పిష్టకము : అధికమైన జఘనము, విస్తృతమైన స్తనాంతరము గలిగి, గమనదోషదుష్టయైన గజమునకు, పిష్టకమని పేరు. ఇదియు నింద్యము, వర్ణనీయము.

4. కుబ్జము : పొత్తికడుపు, మొలయు, చిన్నవిగాను, వెన్ను వెనుక భాగము . ఎత్తైనదిగాను ఉండి బలహీనమైన దంతి కుబ్జ మనబడును. ఇది విసర్జింప దగినది.

5. పూతన : దంతములు, చెవులు, కన్నులు, పాదములు, పార్శ్వములు అనువానిలో ఏదియైనను ఒక్కొక్కటి లేకపోయి, నల్లమబ్బువంటి మేనివన్నె గలిగి, ఎరుపుమించిన పసుపురంగు గల గోళ్ళతో, రోమములతో ఒప్పు గజమును పూతన యందురు. ఇది మిక్కిలి యమంగళకరము. ఈ దుష్టదంతిని దూరముగా విడిచి వచ్చి శాంతి చేసికొనవలెను.

6. మాతృకము : ఎడమవైపు కర్మము, దంతములేని సామజము మాతృకము. ఇది నిలిచినచోటు పెద్దమ్మకోట. దీనిని మెలకువతో శత్రురాజ్యములోనికి తోలింపవలెను.

7. మత్కుణము : మేలిబిందుకములేమి, రూపసంపద యేమి, పెనుసత్తువయేమి ఇట్టి వన్నెచిన్నె లెన్నియున్న నదేల దండికొమ్ముజంట యుండదేని, మత్కుణాఖ్యమది యమంగళకరమగు, వడిగ దవుల దాని విడువదగును.

8. మాయుకము : చిన్నవియగు చెవులు, చిన్నదియగు తోక, చిన్నదియగు మగగుర్తు -కడు నిడుపైన తొండము, సన్నని మెడ, చెడు కంపు, నల్లని యెడలు, నల్లనినాలుకయు గలది మాయుక గజము. సర్వనాశకము కావున త్యాజ్యము.

హస్తినీలక్షణము : గుండ్రని తలయు, సువిభక్తములైన స్తనములు, చక్కని కేశములు, పిచ్చుక వన్నె కనులు, తెల్లని నున్నని ముఖము, ఎఱ్ఱని శ్రోణిభాగము, సుందరమైన గమనము, ఎఱ్ఱకలువలవంటి దంతములు గలిగి చూడముచ్చటైన ఆకారసంపదతో వెలయునట్టి కరిణి శుభకారిణి. ఇది యూథనాయకత్వము వహింప సమర్థములైన కలభములను ప్రసవించును. మంగళ దేవతలవంటి యట్టివశలు ఏ రాజున కుండునో, యాతడు సర్వసంపన్నిలయు డగును. పర్వసమయములలో హస్తినీ పూజ విహితమైనది.


'గంధమాల్యానులేపైశ్చ చారుభిర్వివిధాత్మకై 8
ధూపైశ్చ మధుపర్కైశ్చ వశాం పర్వసు పూజయేత్'

తక్కిన విషయములలో హస్తి లక్షణములే హస్తినికిని సమన్వయించును.

సాంగ్రామిక గజము : ఇది యుద్ధములలో ఆరితేరిన మహాగజము. 'సాంగ్రామికో భవేద్రాజ్ఞ స్త్వభిషేకో చితో గజః' అనుటచే యీ సాంగ్రామిక గజమే రాజుల పట్టాభిషేకోత్సవములలో అధిరోహించుట కర్హమైనదని తెలియుచున్నది. ఈ జాతి కరీంద్రము ఏకాదశ గుణశోభిత మగును. మధుసన్నిభ దంతములు, శ్యామవర్ణము, తేనెవన్నె కనులు, ఉదరభాగమున శ్వేతవర్ణము, ముఖమున కమలశోభ, తుమ్మెదలవంటి నల్లని వాలములు, చంద్రునివంటి స్వచ్ఛ నఖములు, మామిడిచిగురు వన్నె మేఢ్రము, తక్కిన యవయవములు పచ్చనివై ఎఱ్ఱని బిందువులచే చిత్రితమైన మోము గలది సాంగ్రామిక గజము . అట్టి గజరాజు గల భూమీశ్వరుడు సాగరాంతమైన మహీతలమును సుఖముగా ఏలును.


సాంగ్రామిక గజ మిట్లు నిర్వర్ణింపబడినది :
'మహాశిరాః మహాకాయో,
       మహామేఢ్రో మహాకరః
మహాదంతోదర శ్చైవ
       మహాగాత్రాపరాసనః

234