Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

విందుము. కొంతకాలము క్రిందట కాంగోలో వేటలో పట్టుబడిన యొక గజమునకు నాలుగు ప్రహరణ దంతము లున్నవని పత్రికలలో వార్త వచ్చెను. అట్టి చతుర్దంత దంతులను గురించి గజశాస్త్రకారు లేమియు వ్రాయలేదు.

గజసాముద్రికము : 1. గజావయవముల శుభాశుభ లక్షణములు :

తొండము : విశాలమైనదియు, గుండ్రముగా నున్నదియు, చక్కని బిందుజాలము గలదియు, చిగురుటాకువలె మృదువైనదియు, బంగారు వన్నెగలిగి సన్ననై యున్న రోమములు గలదియు, పరిమళించు నిశ్వాస వాయువు గలదియు స్రోతోయుతమైన పుష్కరము గలదియు, పొడవైన తదగ్రాంగుళిగలదియు నగు తొండము శుభకరమైనది.

దంతములు : బంగారము, తేనె, మొగలిపూవు, నేయి, చంద్రుడు. జాజి అనువాని వన్నెగలిగి, గీట్లు లేనివై, పృథులములు, సమములు, దృఢములు, స్థూలములు, ఉన్నతములును అయి, దక్షిణదిక్కున ఎత్తై, ఛేదింపగా చక్రవజ్రబాణశూలదండాది ముద్రలతోగూడి డొల్లలు గానట్టి దంతములు ప్రశస్తములు.

కనులు : నీలములు, దీర్ఘములు, మృదువులు నగు రోమములు గల రెప్పలతో, రక్త, కృష్ణ, శుక్లవర్ణములు గల మండలములతో గూడి విశాలములై చూడచక్కనైన నేత్రములు శుభదములు.

చెవులు : మృదువులై, వర్తులములై, బిందుసందోహ యుతములై, విస్తృతములై, లంబమానములై, రేఖలు లేనివై, ఛిద్రములులేని యంచులుగలవై ప్రకాశించు చూళికలవై (కర్ణమూలములు) దుందుభిధ్వనులతో వెలయునట్టి కర్ణములు మంగళాకరములు.

శిరస్సు : ఉన్నతము, రోమసహితము, ఉత్తమ కుంభస్థలయుతము, సుందర నేత్రయుగ్మశోభితము అగు గజ మస్తకము భవ్యము.

మెడ : సన్ననిదియు, పొడవైనదియు, వ్రేలాడు గళ చర్మము గలదియు అగు మెడ శుభమైనదికాదు. దీనికి భిన్నమైనది శుభకరము.

వెన్ను : అరటియాకు వెన్ను కాడవలె శోభిల్లుచు, ధనుర్దండాకారమున వెలయుచు, మాంసలమై యుండు వంశాదండము క్షేమకారి.

మూపు : విశాలమై, తిన్ననై పుష్టమైయుండు స్కంధము కల్యాణప్రదము.

రోమములు : చిక్కువడకుండుట, స్పష్టముగా కనిపించుట, శరీరమున వాలియుండకుండుట, జంటలుగా మొలవకుండుట, సన్నగా నుండుట అనునవి ఉత్తమ రోమగుణములు. ముఖమున, వీపున, చెవులయందు, కుక్షిని, అండములపైన, వాలమూలమున రక్తవర్ణ రోమము లున్న గజములు అశుభములు.

నఖములు : తెల్లనివియు, స్నిగ్ధములైనవియు, అర్థచంద్రాకారములు గలిగినవియు అగు గోళ్ళు ప్రశస్తములు. అన్యములు అప్రశస్తములు. నఖసంఖ్య యిరువదిగాగాని, పదునెనిమిదిగాగాని యుండిన శుభము. ఇంతకన్న అధికసంఖ్యగలవైనను, అల్పసంఖ్యగలవైనను గజనఖములు అనర్థ హేతువులే యగును. 'అనుత్పన్ననఖం నాగం సమర్థమపి సంత్యజేత్' అన్నారు. కావున సర్వలక్షణశోభితమైన దయ్యు నఖములు లేకున్నదైనచో, అట్టి గజము అమంగళకరము గావున విడిచి వేయదగినది.

2. బిందుజాలకము : తెల్లనివి, పచ్చనివి, లేతయెరుపు వన్నెవి, బంగారు రంగువి యైన బిందువులు శోభదాయకములు. నెమలి, డేగ, కాకి, గ్రద్ద, గాడిద, కోతివంటి వన్నెలుగల బొట్లు అశుభములు.

3. ఆవర్తములు : గజములకు సుళ్ళు సాధారణముగా ఆరుచోట్ల పుట్టును. చర్మములు, రోమములు, నెలవులు, కేశములు, వాలము, బిందువులు అనునవి ఆవర్తము లుద్భవించు స్థానములు. రోమజ, కేశజ, దంతభంగజములైన ఆవర్తములు శోభహేతువులు. చర్మరోమవాలజములైన సుళ్లు కీళ్ళ కెల్ల గుళ్ళు. దక్షిణావర్తము శుభకరము. వామావర్తము అశుభమూలము. శుభావర్తములైనను అస క్షేత్రసంభవములైనచో శుభముల నీయవు. నొసలు, మెడ, కనులు, కుంభస్థలము, చెవులు, రొమ్ము ఈ యవయవములం దున్న ఆవర్తములు శుభదాయకములు. స్తనాంతరము, శిరోమధ్యమున, కుంభముల నడుమ, కర్ణమూలములయందు, వక్షస్థలమున ఆవర్తము లున్న గజమును పంచమంగళగజ మందురు.

233