Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖమ్మముజిల్లా

సంగ్రహ ఆంధ్ర

నకు సుమారు పది సంవత్సరములు పట్టినదట ! దుర్గప్రవేశము క్రీ. శ. 1006 లో జరిగినట్లు తెలియుచున్నది. ఈ సమయముననే గజపతి రాజులు ఈ ప్రాంతముపై దండయాత్రలు సాగించినారు. రెడ్డిప్రభువుల వంశమువారు సుమారు 300 సంవత్సరములు అధికారము వహించిరి. అనంతరము నందపాణి, కాళ్లూరు, గుడ్లూరు అనెడి మూడు వంశములవారు రాజ్యాధిపత్యము వహించిరి (1424). 15 వ శతాబ్దములో షితాబుఖాన్ అను సీతాపతిరాజు పాలించెను. తరువాత 1512 లో గోలకొండ సుల్తానులు వశపరచుకొనిరి. పిమ్మట ఆసఫ్ జాహి నిజాములు ఈప్రాంతముపై ఆధిపత్యము వహించిరి. ఖమ్మము దుర్గమునకు అధికారిగా జాఫరుబేగ్ అనువానిని నిజాము నియమించెను. ఈ జాఫర్ బేగ్ 1761 నుండి 1808 వరకు పరిపాలించెను. వీని యనంతరము రెండవ జఫరుద్దౌలా అనువాడు అధికారము వహించెను. ఇతడు మహాశూరుడు; మహాక్రూరుడు. ఇతడు తెలంగాణ తూర్పు భాగము నంతయు అల్లకల్లోలము గావించెను అందుచే ఇతడు ధంసా (ధ్వంస) అను వెగటుమాటతో ప్రఖ్యాతిచెందెను. 1301 ఫసలీప్రాంతములో నిజాము ఈ ఖమ్మము దుర్గమును నవాబు షౌకత్ జంగు పూర్వీకులకు జాగీరుగా నొసగెను. హైద్రాబాదుపై ఇండియా గవర్నమెంటువారు పోలీసుచర్య జరిపి (1948) జాగీర్దారీ విధానమును రద్దుచేసేవరకు ఈ దుర్గము జాగీర్దారుల అధీనములో నుండెను. ఈ విధముగా ఖమ్మము పట్టణము హిందూ మహమ్మదీయ రాజుల పరిపాలనలో అనేక సంస్కృతీ, సభ్యతలతో విలసిల్లినది.

ఆ. వీ.


ఖరోష్ఠిలిపి :

భారతదేశమున చాలా ప్రాచీనకాలమునందున్న లిపులలో బ్రాహ్మీ మొదటిది ; ఖరోష్ఠి రెండవది. బ్రహ్మీ లిపి ఎక్కువ ప్రచారములో నుండి దేశమునందంతటను వ్యాపించి నేడు అమలులోనున్న భారతీయ లిపు లన్నింటికిని ప్రాతిపదిక ఆయెను. ఖరోష్ఠి భారత దేశమున పశ్చిమ భాగములోను, వాయవ్య భాగములోను క్రీ. పూ. నాల్గవ శతాబ్దమునుండి క్రీ. వె. మూడవ శతాబ్దమువరకును సుమారు ఏడువందల సంవత్సరములు ప్రచారములో నుండి రూపుమాసి పోయెను. బ్రహ్మీ మామూలుగా మనము చదువునట్లు ఎడమవైపునుండి కుడివైపునకు వ్రాయబడుచుండెను. ఖరోష్ఠి అట్లుగాక ఉరుదూ, ఫారసీ, అరబ్బీ భాషలవలె కుడివైపునుండి ఎడమవైపునకు వ్రాయబడుచుండెను. బ్రహ్మీ లిపిలో నియమబద్ధమైన గీతలు, సుందరమైన రేఖలు, స్థిరపడిన రూపములు కనిపించును. ఖరోష్ఠి లిపిలో చాలవరకు నిలువుగీతలు, అడ్డగీతలు, వంకరగీతలు కన్పించుటవలన, పని తొందరలో నుండి హడావిడిగా వ్రాయు వ్యాపారస్తులును, గుమాస్తాలును మొదలగువారు వ్రాసినట్లుగా గాన్పించును. బ్రహ్మీలిపిలో గుణింతములు, గుర్తులు పరకలాటి చిన్నగుర్తుతో సూచింపబడును. సాధారణముగా అక్షరమునకు పైన కలిగే మార్పులుకొద్ది; అక్షరముయొక్క క్రిందిభాగములోనే మార్పులు చాలవరకు కనిపించి గుండ్రని ఆకారము అక్షరమునకు ఏర్పడుచున్నది. ఖరోష్ఠి అక్షరములకు గుణింతములు మొదలైనవి పైభాగము మీదనే ఏర్పడుట వలన గుండ్రటి అక్షరములు దాదాపు లేవనియే చెప్పవచ్చును. వర్ణముల ఆకారమును, ప్రమాణమును ఒకేరకముగా నుండవు.

ఈ లిపి పంజాబ్, సింధు, ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు, తూర్పుగాంధారము, తూర్పుటర్కీస్థాన్ ప్రాంతములలో ఎక్కువ వ్యాప్తిలో ఉండెను. క్రీ. పూ. రెండు, మూడు దశాబ్దములనాటి భారతీయ - యవనరాజుల నాణెములపైనను, కఱ్ఱలపైనను, కాగితములపైనను, చర్మములపైనను వ్రాసిన శాసనములు ఖరోష్ఠి లిపిలో గాన్పించుచున్నవి. తూర్పు టర్కీస్థాన్ లోని బౌద్ధుల గోసంగి విహారశిథిలాలలో బౌద్ధగ్రంథము లెన్నియో ఈ ఖరోష్ఠి లిపిలో వ్రాయబడినవి దొరికినవి. ఇవి సుమారు క్రీ. వె. రెండవ శతాబ్దము నాటివి. కాని ఎక్కువభాగము ఖరోష్ఠీ శాసనములు భారతదేశములోనే, పంజాబ్‌లోను, ప్రాచీన గాంధారములోను దొరకినవి. ఈ శాసనములు చాలవరకు ఇప్పటికి సుమారు రెండువేల సంవత్సరముల నాటివి.

కాని ప్రాచీన ఖరోష్ఠిలిపి సింధునదికి తూర్పున ఉన్న తక్షశిలా (షాదేరి) ప్రాంతమందును, అదేనదికి పడమట నున్న పుష్కలావతి (చర్సాధా లేక హష్టీనగర్ ) జిల్లా

208