Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖమ్మముజిల్లా

సంగ్రహ ఆంధ్ర

లభ్యమగును. కాని ఈ రెండు ప్రదేశములనుండి పూర్వము ఉత్పత్తిజరగినది. కాని అది నష్టదాయకముగ పరిణమించుటచే, ఆ ప్రాంతములలో ప్రస్తుతము పని నిలిపివేయ బడినది. ఇంకను ఈ దేశములోని వివిధ ప్రాంతపు ఇసుకలలో ఈ ఖనిజమున్నట్లు కనుగొనబడినను, అది చాల స్వల్పమగుటచే అచ్చట కూడ పని జరుగుటలేదు.

వెండి : దీని ఉపయోగములు, అవసరములు బంగారమును పోలియేయుండును. ప్రపంచమున దీని ఉత్పత్తి సాలుకు 275 మిలియను ఔన్సులు. ఇందులో 80 శాతము ఉత్తర, దక్షిణ అమెరికా ఖండముల నుండి వచ్చుచున్నది. ఉత్తర ఖండమందలి కార్టిలెరా ప్రాంతము, దక్షిణఖండమందలి ఏన్‌డియస్ ప్రాంతము ఈ ఖనిజము దొరకు ముఖ్య ప్రదేశములు. ప్రపంచపు ఉత్పత్తిలో 33 శాతము మెక్సికో నుండియు, 16 శాతము అమెరికానుండియు, 10 శాతము కెనడా నుండియు, 9 శాతము పెరూ నుండియు, 5 శాతము బొలివియా నుండియు, 5 శాతము బెల్జియన్ కాంగో నుండియు, 2 శాతము హొండురాస్ నుండియు, ఉత్పత్తి యగుచున్నది. తరువాత ఈ ఖనిజమునకు ఆస్ట్రేలియా ఖండము ఎన్నికకన్నది. ఈ దేశమునకు ప్రపంచమున 5 వ స్థానము కలదు. ఇందులో 98 శాతము మూడు ప్రాంతములనుండి వచ్చుచున్నది. (న్యూసౌత్ వేల్స్ (65%), క్వీన్స్ లాండ్ (25%) టాస్మేనియా (8%)). ఈప్రాంతములలో సీసము, తుత్తునాగము, అత్యధికముగా వెండితో కలిసియున్నవి. కాబట్టి వెండికి ఇచ్చట ద్వితీయ స్థానము మాత్రమే కలదు. భారతదేశమున వెండిగనులు లేవనియే చెప్పవచ్చును. కాని బంగారము తీయునప్పుడు, మిగిలిపోయిన పదార్థమునుండి వెండి తీయబడును. ఇట్లు కోలారు గనులనుండి 40,000 ఔన్సులు, అనంతపురము గనులనుండి 500 ఔన్సులు తీయబడుచుండెడిది. ఈ ప్రాంతములలోని వెండి శాతము హెచ్చగు సూచన లేమాత్రమును లేవు.

ఈ. వెం. ఎం. రా.


ఖమ్మము జిల్లా :

నిర్మాణము : ఖమ్మముమెట్టుజిల్లా వేర్వేరు కాలములందు పెక్కు మార్పులు చెందుచు వచ్చినది. క్రీ. శ. 1299 సం. కు పూర్వమే ఖమ్మముమెట్టు నగరము జిల్లా ప్రధాన కేంద్రముగా నుండెను. గోలకొండ సుల్తాన్ అబుల్ హసన్ తానాషా కాలములో గోలకొండ రాజ్యమునందు 21 సర్కారులును, 355 పరగణాలును ఉండెను. తరువాత స్వాతంత్ర్యము వహించిన అసఫ్ జా నిజాముల్ ముల్కు (1724) రాష్ట్రము నంతను 40 సర్కారులుగా విభజించెను. ఈ 40 సర్కారులలో వరంగల్, ఖమ్మముమెట్టుజిల్లా లుండెను. సర్ సాలారుజంగు మహామంత్రిగా నున్నప్పుడు (1867), నిజాము రాష్ట్రము 5 డివిజనులు గను, 17 జిల్లాలుగను విభజింపబడియుండెను అప్పటి తూర్పుడివిజనులో ఖమ్మముమెట్టుజిల్లా ఒకటిగానుండెను. ఆనాటికే ఆ జిల్లా 9779చ. మై. వైశాల్యమును, 9 తాలూకాలను కలిగియుండెను. వరంగల్ జిల్లా ప్రసక్తి కానరాదు. అది ఖమ్మముమెట్టుజిల్లాలో చేరిపోయినది. 1905 లో జిల్లాల పునర్నిర్మాణముజరిగినది. అప్పుడు వరంగల్ సూబా నిర్మాణముచేసి, అందు వరంగల్, కరీంనగరు, ఆదిలాబాదు జిల్లాలు చేర్చబడెను. ఖమ్మముమెట్టు జిల్లాకే వరంగల్ జిల్లా అని నామకరణముచేసి, జిల్లా కార్యాలయములన్నియు ఖమ్మముమెట్టునుండి వరంగల్లునకుమార్చబడినవి. దానితో ఖమ్మముమెట్టు తాలూకాస్థాయినిచెందెను.

వరంగల్‌జిల్లా తిరిగి మార్పులకు లోనైనది. ఖమ్మముమెట్టు, మధిర, ఎల్లందు, పాల్వంచ, బూర్గుంపహడు అను అయిదు తాలూకాలను వరంగల్ జిల్లానుండి విడదీసి ఖమ్మముమెట్టు జిల్లాగా ఏర్పాటు చేయబడెను (1-10-1953). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేర్పడిన తరువాత తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలము, నూగూరు తాలూకాలు ఖమ్మముమెట్టుజిల్లాలో చేర్చబడినవి (1960). ఈవిధముగా ఇప్పుడు ఖమ్మముమెట్టుజిల్లాలో ఖమ్మముమెట్టు, మధిర, ఎల్లందు, పాల్వంచ, బూర్గుంపహడు, భద్రాచలము, నూగూరు అను ఏడు తాలూకా లున్నవి.

ఎల్లలు : ఈ జిల్లాకు ఉత్తరమున వరంగల్ జిల్లా, దక్షిణమున కృష్ణాజిల్లా, తూర్పున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, పశ్చిమమున నల్లగొండ జిల్లా ఎల్లలుగా నున్నవి. జిల్లా విస్తీర్ణము 5486.45 చ. మై. 1951 లెక్కలప్రకారము జనాభా 8,12,992 మంది. ఇందు పురుషులు 4,15,985 మంది; స్త్రీలు 3,97,007 మంది. ఈ జిల్లాలో 946 గ్రామములును, 6 పట్టణములును గలవు. జనసాంద్రత 148.

200