Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

గోల్డ్‌కోస్టు మినహా మిగిలినదేశములలో దొరకు ఖనిజము అంత మేలురకమైనది కాదు.

నికెల్ : ఈలోహము సంయుక్తలోహముల (ఇత్తడి, కంచు, ఉక్కు మొ.) తయారీయం దెక్కువగా వినియోగింపబడు చున్నది. ప్రపంచ సంపదలో చాల భాగము సడ్బరీ, ఓన్‌టారియోప్రాంతములందే విస్తరించియున్నది. ఇచ్చట 240 మిలియనుటన్నుల ఖనిజము కలదని అంచనా. సాలుకు 130,000 టన్నుల నికెల్ ఇచ్చట ఉత్పత్తి యగుచున్నది. ఈ లోహము న్యూకేలెడోనియా, ఫిన్ లెండు, రష్యా దేశములందు స్వల్పముగా దొరకును. భారతదేశమున ఈ ఖనిజము దాదాపు లేదనియే చెప్పవచ్చును. (తిరువాన్కూరు, కోలారు ప్రాంతములలో అతి స్వల్పముగ దొరకునని కన్గొనబడినది.)

క్రోమియం : ఇది గూడ మిశ్రమలోహము తయారీయందే ఎక్కువగా వినియోగింపబడుచున్నది స్టెయిన్ లెస్ స్టీల్ యందు క్రోమియం 18 శాతము, నికెల్ 8 శాతము ఉండుటచే, దానికి ఉత్తమ లక్షణము లేర్పడినవి. ఇది సాలుకు దాదాపు 2 మిలియను టన్నుల వరకు ఉత్పత్తియగుచున్నది. ఉత్పత్తి అయ్యెడి ముఖ్యదేశములు : రష్యా, రొడీషియా, దక్షిణాఫ్రికా, టర్కీ. భారతదేశమున ఈ ఖనిజమునకు మైసూరులోని అర్సికరై, బీహారులోని సింగ్ భూమ్ ప్రాంతములు ప్రధానములు. క్యూబా, ఫిలిప్పైన్స్, ఇండియా, గ్రీసు, జపాను, న్యూకెలెడోనియా, రొడీసియా, దక్షిణాఫ్రికాదేశములు ఒక్కొక్కటి సాలుకు 11/2 - 31/2 లక్షల టన్నులు ఉత్పత్తిచేయుచున్నవి. రష్యాదేశమందలి ఖనిజము చాల ఉత్తమమైనది ; లోహశాతము అధికము (40-56%). ఇచ్చట 13 మిలియను టన్నుల సంపద కలదని అంచనా. అమెరికాయం దీ ఖనిజము దాదాపు లేదనియే చెప్పవచ్చును.

రాతినార (Asbestos) : ఖనిజము లన్నిటిలోను దీనికొక విశిష్టత గలదు. ఇది సన్నని, మెత్తని, చిన్న చిన్న దారములుగా దొరకును. దీనిని గుడ్డలుగా నేయవచ్చును. ఇవి రెండు రకములు : (1) దారముగా వడుకుటకు వీలైనవి ; (2) అందుకు వీలుకానివి. నిప్పులో వేసినను, ద్రావకములో వేసినను దీనికి చలనములేదు. ఇది బ్రేక్ లైనింగ్స్ (break linings) ఉష్ణ నిరోధకావసరములకు ఎక్కువగా వినియోగింపబడుచున్నది. ప్రపంచము మొత్తమున సాలుకు 5 లేక 6 లక్షల టన్నుల దారము ఉత్పత్తియగుచున్నది అందులో 60 శాతము కెనడాదేశమందలి క్విబెక్ ప్రాంతము నుండి వచ్చుచున్నది. ఇచ్చటి నార చాల మెత్తగా నుండి 5 అం. వరకు పొడవు గలిగి యుండును. రష్యాదేశమందుగూడ ఈఖనిజము సమృద్ధిగా దొరకును. అచ్చట మొత్తము 20 గనులనుండి ఈ ఖనిజము తీయబడుచున్నది. దక్షిణరొడీషియాదేశమందలి నారలో 30 శాతము దారము వడుకుటకు వీలైనది. ఇచ్చట మొత్తము 7 మిలియను టన్నుల సంపద గలదని అంచనా. దక్షిణాఫ్రికాయందలి నార దాదాపు 11 అం. వరకు పొడవుగల్గి యుండుట అచ్చటి విశిష్టత. అచ్చటి నార మొత్తము పొడవు సగటున 6 అం. ఈ సంపద అధికముగా కలదని అంచనా. భారతదేశమున ఈ ఖనిజము బీహారు, ఒరిస్సా, బొంబాయి, మైసూరు రాష్ట్రములందును, ఆంధ్రప్రదేశ్ లో కడపజిల్లా యందును స్వల్పముగ దొరకును. కాని ఈ దేశమందు దొరకు నార రెండవ తరగతికి చెందినది. అమెరికా, సైప్రస్, జపాన్, ఇటలీ, కొరియా, చెకస్లోవేకియా, ఫిన్లాండు దేశములందుకూడ ఈ ఖనిజము స్వల్పముగా దొరకును.

గ్రాఫైట్ : రాసాయనికముగా ఈ ఖనిజము ఒక్క బొగ్గును మాత్రమే కలిగియుండును. ఇది కృత్రిమముగ కూడ తయారగుచున్నది. ఇది ఏ ద్రావకమునందు కూడ కరగకుండుట, 3000° సెంటిగ్రేడు ఉష్ణోగ్రతవరకు ఘన పదార్థముగనే ఉండుట దీని విశిష్టలక్షణము. లోహములు కరగించుటకు వీలగు పాత్రలను తయారు చేయుటకును, పెన్సిళ్ళు, రంగులు, లూబ్రికెంట్సు తయారీయందును ఈ ఖనిజము వినియోగింప బడుచున్నది. ప్రపంచము మొత్తముమీద ఈ ఖనిజము సాలుకు 11/2 నుండి 3 లక్షల టన్నులవరకు ఉత్పత్తి యగుచున్నది. ఈఖనిజము దొరకు దేశములలో రష్యా, బవేరియా, ఆస్ట్రియా, సిలోన్, మెడగాస్కర్, మెక్సికో దేశములు ప్రధానములు. రష్యాదేశమందలి సైబీరియా ప్రాంతమున ప్రపంచములోకెల్ల ప్రధానమగు గనులు కలవు. ఇచ్చట పెన్సిళ్లు తయారుచేయుటకు వీలుగా గ్రాఫైటు ముద్దలు ముద్దలుగా దొరకును. బవేరియా, ఆస్ట్రియా, చెకొస్లోవేకియా దేశములు

197