Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖననశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

ఆ ప్రాంతమునందు ఆర్థికప్రయోజనముకల ఖనిజ పదార్థము అధిక పరిమాణములో లభ్యము కాగలదా యని తెలిసికొనవలసియున్నది. ఏ ప్రాంతమునందు త్రవ్వకము కొనసాగించవలెనని నిర్ణయము కావింపబడెనో. అచ్చోట ఆశింపబడిన ఖనిజముయొక్క ఉనికి, దాని లక్షణము, మందము, పరిమాణము మున్నగు అంశములను పరిశోధించవలసి యున్నది. దీనిని నిర్వహించుటకు ఖనన శాస్త్రజ్ఞుడు ప్రప్రథమములో భూమియొక్క ఉపరితలమును పరిశీలించి (prospecting), రంధ్రములను త్రవ్వించ వలెను. ఈ క్రమవిధానముద్వారా లభించు సమాచారమును జాగ్రతగా పరిశీలించవలెను.

ఉపరితల పరిశీలనము : పర్వతప్రాంతము లందును, కాలువలు - నదుల యొక్క తీరప్రదేశము లందును, బావులు - క్వారీలు- రోడ్లు - రైల్వేలు మొదలగు వాటి త్రవ్వకముల యందును గల పదార్థములలో ఖనిజ లక్షణము లేవైన కలవేమో యని పరిశోధించు విధానమునకు ఉపరితల పరిశీలనము (Prospecting) అని పేరు. ఖనిజ లక్షణములుగల పదార్థములను కనుగొన్న పిదప మరింత లోతుగా అన్వేషణ జరుపుటకై ఆ ప్రదేశమునందు మాదిరి గోతులు (shafts) త్రవ్వుదురు. ఉపరితలమున లభ్యమైన పదార్థములనుండి భూగర్భము నందున్న ఖనిజ పదార్థములు సుదూరముగ నున్నచో లోతైన రంధ్రములను త్రవ్వుట (boring) ద్వారా పరిశోధనలు జరుపవలసి యుండును.

భూమిలో గొట్టమును దించుట (Boring) : చేతితో గాని, యంత్ర సహాయమున గాని కొలది వ్యాసము గల నిడుపైన గొట్టమును భూమిలోనికి దించుచు బెజ్జమును తొలిచి దానినుండి లభ్యమగు రకరకములైన అంతర్గత

చిత్రము - 50

పటము - 1

పదార్థములను (cores) నిశితముగా పరిశీలింపవలయును. ఈ విధముగా పరిశీలనము జరుపుట వలన అవసరమగు సమాచారము లభించగలదు. (1 వ పటము చూడుడు)

భూగర్భములో త్రవ్వకపు విధానములు Methods of working mines): ఖనిజపదార్థము కలదని పరిశీలన ఫలితముగా నిర్ణయించబడిన తరువాత ఆ ఖనిజ పదార్థము బొగ్గువలె పొరలుగా (Stratified) నున్నదో లేక బంగారమువలె నాళముల (Veins) రూపములో నున్నదో తేలగలదు. దాని ననుసరించి త్రవ్వకములు, కార్యనిర్వహణము మొదలగు కార్యకలాపములు నిర్ణయింపబడును. ఖననశాస్త్రములో బొగ్గు త్రవ్వకము, లోహముల త్రవ్వకము అను రెండు శాఖలు ముఖ్యములై యున్నవి.

బొగ్గు త్రవ్వకపు విధానము: బొగ్గుగనులను త్రవ్వి, బొగ్గును వెలికి తీయుటకు రెండు ముఖ్యమైన పద్ధతులు గలవు. (1) బార్డు - స్తంభ నిర్మాణపు పద్ధతి (Bord and Pillar method), (2) పొడుగయిన గోడను నిర్మించు పద్ధతి (long wall method) ప్రస్తుత మవలంబించుచున్న ఇతర విధానము లన్నియు ఈ రెండు పద్దతుల యొక్క సంస్కరణములే.

బార్డు - స్తంభ నిర్మాణ విధానము : ఈ పద్ధతిలో రెండు విస్పష్టమైన ప్రక్రియలు గలవు. (1) భూగర్భములో ఒకదాని కొకటి సమకోణములో నుండునట్లు నిర్మించబడిన మార్గములను స్తంభముల ఆకృతిలో విభజించుట. పై కప్పు కూలి పడకుండ ఈ స్తంభములు ఆధారములుగా నుండును. దీనిని “వర్కింగ్ ఇన్ ది హోల్" అనియు లేక “ డెవలెప్ మెంటు" అనియు పిలుతురు (2) పనియైన పిదప ఒకదానివెంట నొకటిగా ఈ స్తంభములను పడగొట్ట వలయును. దీనిని "వర్కింగ్ ఇన్ ది బ్రోకెన్' (Working in the Broken) అనియు, లేక "డి పిల్లరింగ్ " (De-pillaring) అనియు అందురు.

నవీన పద్ధతి ప్రకారము ఒక్కొక్కగనిని కొన్ని విభాగములుగను లేక మండలములుగను (Panels or Districts) విభజించి, వాటియందు స్తంభములను నిర్మాణము గావింతురు. త్రవ్వకపు కార్యకలాపము లన్నియు అయిన పిదప పై జెప్పిన రీతిగా ఈ స్తంభములను పడగొట్టుదురు. ఉదాహరణమునకు (2 వ పటము చూడుడు)

180