Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖననశాస్త్రము

తిక్కన శౌర్యపరాక్రమ వృత్తాంతము నెల్లూరు చేరగా, సిద్దనామాత్యుడు తనయుని మృతకళేబరము కొరకు రణరంగమునకు వచ్చెను. నెత్తుటి వరదలో తేలియాడుచు నెగిసి నెగిసి పడుచుండెడు తిక్కన కండలను చూచి, తండ్రి కన్నీరు కార్చి, కావి ధోవతిలో పొదివి నెల్లూరికి తెచ్చెను.

పుణ్యాంగనయగు తిక్కనభార్య ఆ కావిధోవతిలోని కండలను చూచి,


“ఓమామ ! వినవయ్య యొక విన్నపంబు
సత్యంబు స్త్రీ పురుష సమ్మతి వినుము
పురుషుడే ముందైనఁ బుణ్యకాంతలకు
బతిగూడి యొక్క టై పరలోకయాత్ర
పుణ్యప్రదంబని పొగడును శ్రుతులు
పతినెడబాయుట పరగదోషంబు
నాప్రాణ విభునితో నన్నంపు"

మని మామగారివలన సహగమనమునకు ఆజ్ఞ తీసికొని భర్తతో సహగమనము చేసెను.

ఖడ్గతిక్కననుగూర్చి యెక చాటుధార:


"ఏమి తపంబు జేసి పర
         మేశ్వరు నేమిటఁ బూజచేసిరో
రాముని తల్లియున్ బరశు
          రాముని తల్లియు భీముతల్లియున్
గాముని కన్నతల్లియును
          గంజదళాక్షు ననుంగు తల్లియున్
శ్రీ మహితప్రతాపు డగు
          సిద్ధన తిక్కన కన్నతల్లియున్ "


"తిక్కన కాటమరాజుగార్లకు యుద్ధమై తిక్కన పరలోకగతుడైన స్థళము యిప్పుడు పట్టపురాయి గ్రామానకు తూర్పు భాగమందున పినాకినీ నదీతీరమందున పూర్వమందు పరశురామ దేవరకు నందనచక్రవర్తి ప్రతిష్ఠచేసిన స్థళము. ఇది ఇప్పుడు స్థళజ్ఞులు ఆ జాగా పేరు తిక్కనపాడు అని చెప్పుకుంటూ వున్నారు. ఆ స్ధళమందు వఖరాయిమీద గుర్రమును అందుపైన వఖ సవార్ను చెక్కి వున్నది. అది తిక్కన మంత్రి ప్రతిమే" అని స్థళజ్ఞులు వాడుకుంటున్నారు" అని పట్టుపురాయి కై ఫీ యతు తెలుపు చున్నది.

కా సీ.


ఖననశాస్త్రము (The Science and Art of Mining) :

పరిచయము : ఆర్థిక ప్రాముఖ్యముగల వేర్వేరు ఖనిజ పదార్థములను సంపాదించుటకు అన్వేషణము జరుపుట, భూమిని లోతుగా త్రవ్వుట, లభ్యమైన ముడిపదార్థములను భూగర్భమునుండి వెలికితీయుట, విపణివీథిలో దానిని విక్రయించుట మొదలగు కార్యకలాపములకు ఖనన శాస్త్రమని పేరు. పలువిధములగు ఖనిజములు, శిలలు వివిధ పారిశ్రామికరంగములందు లోహసంబంధమైన మౌలిక- ముడిపదార్థములు (basic raw materials) గా గాని, ముఖ్యమగు అనుబంధపదార్థములు (auxiliary substances) గా గాని అవసరమగుచుండుటనుబట్టి ఖనన శాస్త్రమునకుగల ప్రాముఖ్యము అధికమగుచున్నది. ఉష్ణమును. శక్తిని కల్పించుటకు బొగ్గు, నూనె మన కవసర మగుచున్నవి. ఇటులనే యంత్రములను తయారుచేయుటకును, వంతెనలు నిర్మించుటకును లోహములు కావలసి యున్నవి. ఇదేవిధముగ నివసించుటకై గృహములను నిర్మించుకొనుటకు వలయు సామగ్రి, రాసాయనిక పరిశ్రమకు ఖనిజపదార్థములును, ఆహారపదార్థములకు లవణమును మన కవసరమగు చున్నవి.

భూగర్భములోని ఖనిజపదార్థమును పగులగొట్టుట, దానిని భూమిపైకి చేరవేయుట గనిలో పనిచేయు ఖనకుని విధులై యున్నవి. కాని ప్రధానమైన ఈ రెండుపనులను నిర్వర్తించుటకు పూర్వము, ఆనేకములగు ఇతర అనుబంధ కార్యకలాపములను నెర వేర్పవలసి యుండును. భూగర్భములో లోతున నుండు భాగములకు చేరుకొనుటకై ఆటంకమును కల్పించు నీటిని వెలికితోడివేయుట, భూగర్భములో పనిచేయు కార్మికుల కవసరమగు వెలుగును, గాలిని ధారాళముగ ప్రవేశపెట్టుట, పైకప్పులు, ప్రక్క భాగములు కూలిపోకుండ బలమైన ఆధారములు నిర్మించుట, ఉత్పత్తిని అధికముచేయుటకై భూగర్భములో యంత్రము లుపయోగించుట, భూగర్భమునుండి వేర్వేరు ప్రాంతములకు సమాచారముల నందించుటకై సాంకేతిక సంజ్ఞల నేర్పరచుకొనుట, ప్రమాదములను సాధ్యమైనంత మేరకు తగ్గించుటకై భద్రతాచర్యలు తీసికొనుట — ఇవన్నియు అనుబంధ కార్యకలాపములు .

ప్రాథమిక పరిశోధనలు : భూమిని త్రవ్వుటకు పూర్వము

179