Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రస్వరూప రచన - కంచెలు

అల్పముగ నుండును. దీర్ఘకాలము మన్నుటకును, చెదపురుగులబారి పడకుండుటకును, భూమిలోనికి పోవు గుంజలయొక్క అడుగు భాగమును కరిగిన 'కోల్టారు'తో గాని, ‘క్రియెసొట్' ద్రావణముతో గాని పూత పూయుదురు. సాధారణముగ ఈ గుంజలమందము 5 నుండి 7 అంగుళములును, మొత్తము పొడవు 7 నుండి 8 అడుగులు నుండును.

కాంక్రీటు స్తంభములకంటెను, ఉక్కు స్తంభములకంటెను, రాతి స్తంభములు చౌకగా లభింపగలవు. అయితే అవి సులభముగ అందుబాటులో నుండగలవా అనునదే ప్రశ్న. కాని రాతి స్తంభములకు ఏపాటి గట్టి దెబ్బ తగిలినను, అవి పగులును. ఇట్టి స్తంభములకు కంచెతీగెను ముడివేయుట సులభముకాదు. స్తంభములకు చిల్లులు తొలచిగాని, లేక ఇనుప కొక్కెములు అమర్చిగాని, తీగెను వాటిలో చొప్పింపవలయును.

రాతి స్తంభములుగాని, కాంక్రీటు స్తంభములుగాని సామాన్యముగా 6 అడుగుల పొడవుండును. 11/2 అడుగుల వరకు భూమిలోనికి పాతి, తీగెను కట్టుటకై భూమిపైన 41/2 అడుగుల మేరకు ఉంచవచ్చును. రాతి స్తంభములు దీర్ఘ చతురస్రముగనుండి 9×7 అంగుళముల మందముండును. 'కాంక్రీటు స్తంభములు కొన్ని వర్తులాకారముగను, కొన్ని చతురస్రముగనుండును. కాంక్రీటు స్తంభములుగూడ కూచియాకారము (tapering shape)లో లభ్యమగును. ఇవి అడుగుభాగమున 6 అంగుళములు, చివర భాగమున 4 అంగుళములు మందము కలిగి యుండును.

లోహ స్తంభములు ఉక్కుతోడను, పోత ఇనుముతోడను చేయబడును. ఇవి కొయ్య, కాంక్రీటు, రాతిస్తంభముల కంటెను మిగుల బలిష్ఠములై ఉరుములు, మెరుపులు, పిడుగు దెబ్బలకు తాళగలిగియుండును. త్రుప్పు పట్టకుండ వీటిపై రంగు పూయవచ్చును. కోణాకారముగ నుండు ఈ యినుప స్తంభముల కనిష్ట, గరిష్ట మందములు వరుసగ 11/2"X11/2"X1/4" నుండి 2"X2"X1/4" వరకు ఉండును. గరిష్ట మందముగల స్తంభములను మూలల యందును, కనిష్టమందముగల స్తంభములను వాటి నడుమను పాతవలయును. మూలలయందుగల స్తంభములు అధికమగు ఒత్తిడికి తట్టుకొనవలసి యుండుటచే, వాటి మందములు అధికముగ నుండవలయును. దీర్ఘకాలము మన్నుటకై ఈ స్తంభములు సున్నము, కంకరతో నింపిన గోతులయందు పాతబడును.

ఎలెక్ట్రిక్ కంచె : పై నుదహరించిన కంచెలతో పాటుగ ఎలెక్ట్రిక్ తీగెలతోగూడ కొన్ని ప్రదేశములందు-ముఖ్యముగ డెయిరీ వ్యవసాయ క్షేత్రములందు—కంచెను నిర్మింతురు. క్షేత్రావరణమునుండి బాహ్య ప్రదేశములలోనికి పశువులు పోకుండ నిరోధించుటకై ఎలెక్ట్రిక్ కంచె నిర్మింపబడును. సుమారు 600 వోల్టులు శక్తిగల విద్యుచ్ఛక్తిని తీగెలందు ప్రవేశ పెట్టినచో, అట్టి తీగెను తాకిన యెడల చురుకైన ఆఘాతము తగులును. అట్లుగాక, విద్యుచ్ఛక్తి పాటవమును 11 మిల్లి ఆంపియర్ల (.011 amperes) వరకు మాత్రమే పరిమిత మొనర్చినచో, దాని వలన ప్రమాదముండదు. ఈ కాలమున పెక్కు కంపెనీలు ఎలెక్ట్రిక్ కంచెను నిర్మించుటకై అవసరమైన పరికరములను సమకూర్చుచున్నవి. 75 అడుగుల దూరమున పాతబడిన స్తంభములపై ఇన్స్యులేటర్లు అమర్చబడును. నున్నని తీగె నొకదానిని స్తంభములమీదుగా ఇన్స్యులేటర్లలో చొప్పించెదరు. అనువైన యంత్రముద్వారా ఈ తీగెలో విద్యుత్తును ప్రవేశ పెట్టుదురు. ఇట్టి విద్యుత్ తీగెను తాకిన జంతువునకు నిశితమైన ఆఘాతము తగులును. కొన్ని తరుణములందు నేల మిక్కిలి పొడిగా నున్న యెడల, ఎలెక్ట్రిక్ తీగెకు కొన్ని అంగుళములు ఎడముగా మరొక తీగె అమర్చబడును. రెండుతీగెలు తాకిననేగాని, జంతువునకు చురుకుముట్టదు. పెద్దజంతువులను అదుపునం దుంచుటకై నేలమట్టమునుండి 36 నుండి 40 అంగుళముల పైగా ఎలెక్ట్రిక్ తీగె అమర్పబడును. ఇట్టి ఎలెక్ట్రిక్ తీగెలు వీధులయందలి 'లైన్ కరెంట్' వలనగాని లేక బ్యాటరీల వలనగాని పనిచేయగలవు.

సమాప్తి : సశాస్త్రీయముగ వ్యవసాయము చేయుటకై పంటపొలములకు సలక్షణముగ కంచె నిర్మించుట యొక ముఖ్యలక్షణమై యున్నది. కంచెవేయుటవలన చోరులనుండియు, పశువులు మొదలైన వాటినుండియు పంటను రక్షించుకొనుటయేగాక, కొన్ని వ్యవసాయ కలాపములలో కాలమును, శ్రమను పొదుపుచేసికొనుట

167