Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్ర యంత్రములు

చిత్తడి నేలలందు 150 మొదలు 300 అడుగులవరకు ఒక్కొక్కటి వంతున కాలువలు నిర్మింపబడును. ఇసుక నేలలందు 300 మొదలు 600 అడుగులకు ఒక్కొక్కటియు, రేవడిభూములందు 30 మొదలు 40 అడుగులకు ఒక్కొక్కటియు కాలువలను నిర్మింతురు. నీటిపారుదల ప్రదేశములలో ఒక మైలు పొడవుగల ఇట్టి కాలువల మూలమున 80 ఎకరముల నేల తడిసి, సాగగును. ఈ కాలువల నిర్మాణమునకు ఉపయోగపడు సిమెంటు కాంక్రీటు పెంకులయొక్కగాని, కాల్చిన మట్టి పెంకులయొక్కగాని కొలత, కాలువయొక్క ఏట వాలును బట్టియు, పారుదల కావలసియున్న నీటి పరిమాణమును బట్టియు నిర్ణయింపబడును.

ముగింపు : సరియైన నీటి సరఫరా, మురుగు నీటిపారుదల - ఈ రెండును ఏపు అయిన పైరుల పెంపుదలకు, పుష్కలమైన పంట రాబడికి అవసరము. సవ్యమైన మురుగు పారుదల విధానమువలన పైరుకు అవసరమైన నీటిని వెలుపలికి పంపి, పంటలయొక్క ఆరోగ్యమును కాపాడుటకు వీలగును.

ఈ విధముగా పైరులకు ఏర్పాటుచేయు నీటిసరఫరా, మురుగునీటి పారుదల - ఈ రెండును అన్యోన్యాధారములై పంటల ఆరోగ్యమును కాపాడుటకును, అధికమగు ఫలసాయమును పొందుటకును దోహద మొసగును.

బి. ఆర్. బి.


క్షేత్ర యంత్రములు :

భారతదేశముయొక్క ఆర్థిక సౌష్ఠవము వ్యవసాయముపై ఆధారపడియున్నది. ఇతర పరిశ్రమలవలెనే, వ్యవసాయోత్పత్తియొక్క సత్ఫలితములు ఈ రంగమునం దుపయోగించు పరికరములపైనను, యంత్రములపైనను ఆధారపడియుండును. వ్యవసాయ విధానములో సాగుబడి కుపయోగించు పరికరములును, యంత్రసామగ్రియు ఈ క్రింది విధముగా సహకరించును.

1. పైరు ఏపుగా పెరుగుటకై మున్ముందుగా నేలను లోతుగా కెళ్ళగించి పదును చేయవలెను. ఇందులకై కలుపు తీయుట, మంటి గడ్డలను మెత్తగా చితుకగొట్టుట, వర్ష జలమును పీల్చుకొనునట్లు భూమిని తయారుచేయుట, సహజమైనట్టియు, కృత్రిమమైనట్టియు ఎరువులను దున్నిన నేలలో చక్కగా కలిపివేయుట, వేళ్ళు బలిష్ఠముగా అభివృద్ధి నొందుటకై ఆరోగ్యకరమైన గాలి సోకునట్లు చేయుట అవసరము. ఈ కార్యకలాపములకై ఏదో యొకవిధమగు పరికరముల సహాయమవసరమగు చున్నది.

2. పొలములో విత్తనములు వెద పెట్టుటకును, పంటను కోత కోయుటకును, నూర్పిడి చేయుటకును, తూర్పారపట్టుటకును ఇతర వ్యవసాయ కార్యక్రమమును కొనసాగించుటకును సాధ్యమైనంత తక్కువమంది కార్మికులను నియోగించుట అవసరము. ఇటులనే వ్యవసాయోత్పత్తి కగు వ్యయమును తగ్గించుటయు, ఉత్పత్తిని అధికతర మొనర్చుటయు కూడ అవసరము.

వ్యవసాయయంత్ర పరికరములు వాటి విధులు : వ్యవసాయ యంత్ర పరికరములను ప్రధానముగా రెండు వర్గములుగా విభజింపవచ్చును.

(1) సాధారణముగా ఈ క్రింది పరికరములను పంటలను పండించుటకై వ్యవసాయదారులు ఉపయోగింతురు.

1. నాగళ్లు. 2. గుంటకలు లేక పాపటములు, 3. కట్టలను నిర్మించు యంత్రము (Bund-former), 4. విత్తనములు వెద పెట్టు నట్టియు, మొక్కలు నాటు నట్టియు యంత్రములు, 5. భూమిని త్రవ్వు రకరకములైన సాధనములు, 6. పంటలను కోతకోయు పరికరములు, యంత్రములు, 7. నూర్పిడిచేసి, తూర్పారపట్టు యంత్రములు.

(2) ఆహార ధాన్యములను, పశుగ్రాసమును శుభ్రపరచి క్రమవిధానములో వేరుపరచుటకై ఈ క్రింది యత్నములు గూడ అవసరమగుచున్నవి.

1. చెఱకు గడలను చితుకగొట్టు యంత్రము (Sugar-cane crusher), 2. వేరుసెనగ పొట్టు ఒలుచుయంత్రము (ground nut decorticator), 3. పర్షియన్ చక్రములు, పంపులు (Persian wheels and pumps). 4. నూనె గానుగలు (Oil ghanies), 5. పశు గ్రాసమును నరకు యంత్రము (chaff cutter).

ఇతర ముఖ్య యంత్రపరికరముల వర్ణనము :

1. నాగళ్లు : ఈ పరికరము మున్ముందుగా భూమిని దున్నుటకును, పైరు నాటిన తర్వాత కొంత కాలము వరకును విరివిగా వాడబడును. దేశీయమైన నాగలి,

149