Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్ష-కిరణములు

సంగ్రహ ఆంధ్ర

గల అనర్థమును నివారించుటకు స్వతంత్రయోచనతో కూడి ఆచరణీయములైన ప్రతిపాదనలు ఇతడు చేసెను. ఇవి ఆర్థిక శాస్త్రవేత్తగా ఇతడు సాధించిన ప్రధాన విషయములు. ఇతడు 1939 సం. మార్చి. 21 వ తేదీన మరణించెను.

ఆర్. ఎన్. ఎస్.


క్ష

క్ష-కిరణములు (X - Rays) :

విద్యుదయస్కాంత సిద్ధాంతము (Electromagnetic Theory) ప్రకారము క్ష (X ఎక్సు) కిరణములు లేక 'రాంట్ జెన్' కిరణములు (Rontgen Rays) సాధారణ కాంతికిరణముల జాతికి చెందినవే అని చెప్పుచున్నారు. కాని వాటి తరంగముల పరిమాణము చాల తక్కువగా నుండుటచే, అవి భిన్నస్వభావము కలిగియున్నవి. గత శతాబ్దాంతములో పెక్కుశాస్త్రజ్ఞులు వాయువులలో గల విద్యుత్ప్రసరణము (Discharge of electricity through gases) ను పరిశీలింపదొడగిరి. వారిలో జర్మనీ దేశస్థుడయిన ప్రొఫెసర్ విల్ హెల్మ్ కోనార్డు రాంట్ జెన్ (Professor Welhelm Konard Rontgen) అను నతడు ఒకడు. 1895 సంవత్సరములో ఒకనాడు అతడు అట్టి ప్రయోగములు చేయుచున్నప్పుడు ఆ గదిలోనున్న బేరియం ప్లాటినో సయనైడు (barium platino cyanide) పూతగల ఒక అట్ట కాంతితో మెరయుట చూచెను. దానికి కారణము ఆతడు ఉపయోగించుచున్న క్రూక్సు నాళము (Crookes tube) నుండి వచ్చు కిరణములే అని అతడు వెంటనే కనుగొనెను. ఆ కిరణముల స్వభావము అతనికి తెలియకపోవుటచే వాటికి అతడు X (ఎక్సు) కిరణములని పేరిడెను. అలాగే ఈ కిరణములను హిందూదేశ భాషలలో క్ష - కిరణము లనుచున్నారు. రాంట్ జెన్ చేత కనిపెట్టబడుటచే వాటిని 'రాంట్ జెన్' కిరణములని కూడ అనుచున్నారు. రాంట్ జెన్ 'X కిరణములను కనిపెట్టుటయేగాక వాటి ముఖ్యధర్మములను (properties) కూడ కనుగొనెను. ఈ కిరణములకు అపార దర్శక (opaque) పదార్థములనుగూడ చొచ్చుకొని పోగలశక్తి కలదని అతడు కనుగొనెను. అంతేకాక, అవి ఆ కారణముచేత, వైద్య శాస్త్రములోను, పరిశ్రమలలోను చాల ఉపయోగపడగలవని కూడ అతడు సూచించెను. ఈ కిరణములకును సాధారణ కాంతి కిరణములకును కొన్ని పోలికలున్నట్లు అతడు గ్రహించెను. కాని ఏ పదార్థములోను X-(క్ష) కిరణములు వక్రీభవనము చెందక పోవుటచే, ఈ కిరణములు కాంతికిరణములవలె తరంగములే అని అతడు నమ్మలేకపోయెను. కాని తరువాత లావె (Lave), బ్రాగ్ (Bragg) మొదలగు శాస్త్రజ్ఞుల కృషి వలన ఇవి పరావర్తనము, వక్రీభవనము చెందగలవనియు, ఇవి కాంతికిరణముల జాతికి చెందియున్నవనియు స్పష్టముగా తెలిసినది.

X (క్ష) - కిరణములను ఉత్పత్తిచేయు విధము (Generation of X-rays) :

అతివేగముతో ప్రయాణముచేయు ఎలక్ట్రానులు (electrons) ఏ పదార్థమునైనను ఢీకొనినచో X - కిరణములు ఉద్భవించును. ఎలక్ట్రానులు పదార్థములను డీకొనునపుడు వాటి గతిశక్తి (kinetic energy) క్షీణించును. ఈ క్షీణించిన శక్తియే X - కిరణములుగా మారును. క్రూక్సు నాళములోని 'కాతోడు' కిరణములు (cathode rays) గాజుతో చేయబడిన నాళమును ఢీకొనుటవలన మొదటి X - కిరణములు ఉద్భవించినవి. ఈ పద్ధతినే శాస్త్రజ్ఞులు కొంత కాలమువరకు X - కిరణములను ఉత్పత్తిచేయుటకు అవలంబించిరి. కాని ఇట్లు ఉద్భవించిన కిరణముల తీవ్రత (intensity) చాల తక్కువగా నుండెను. తీవ్రతను హెచ్చించుటకు ఎలక్ట్రానులను నాళముయొక్క ఒక బిందువువద్దకు కేంద్రీక


1. X (ఎక్సు) అనునది ఇంగ్లీషుభాషలో 24వ అక్షరము. పేరు తెలియనప్పుడో, పేరు చెప్పదలచుకొననప్పుడో ఈ అక్షరమును ఇంగ్లీషువారు పేర్కొందురు.

138