Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోడి రామమూర్తి నాయడు సంగ్రహ ఆంధ్ర

కీకర్ సింగ్, అర్జున్ సింగ్'; గులాంమహమ్మద్, కమరుద్దీన్ అహమ్మద్ మొదలయినవారు శ్రీ రామమూర్తి నాయనికి జోహారు లర్పించెడివారు. ఇతడు సర్కసు ప్రదర్శనములు కావించుచు దేశము నెల్ల ముమ్మారు సంచార మొనర్చెను.

రామమూర్తి నాయ డొనర్చిన ముఖ్యమైన ప్రదర్శ నాంశములు : (1) ఇనుప గొలుసులను తెంచుట. (2) 800 పౌనుల బరువుగల రాతిని తన ఛాతిమీద పెట్టించుకొని సమ్మెటచే దానిపై కొట్టించుకొనుట. (3) రెండెద్దుల బండ్లలో రెండింటియందు నిండుగా మనుష్యులను కూర్చుండ బెట్టుకొని ఒక దాని కుడిచక్రమును తన ఛాతిమీదుగను, మరియొకదాని ఎడమచక్రమును తన తొడలమీదుగను ఏక కాలమున లాగించుకొనుట. (4) ఒక్కొక్కదానియందు 36 అశ్వముల శక్తిగల రెండు మోటారుబండ్లను త్రాళ్లతో తన రెండు జబ్బలకును కట్టించుకొని ఆ బండ్లను సాగనిచ్చి, వాటి వేగమును స్తంభింప జేయుటయే గాక వాటి ఎనిమిది చక్రములు పైకి లేచి గిరగిర తిరుగునట్లు చేయుట. (5) లోనికి వాయు వును పూరించి, కుంభించి యున్న ఇతని బాహుదండలకు పదిమంది మనుజు లొక లావైనమోకును బిగించి కట్టుట, దాని నతడు తన రేచక క్రియచే విడిపోవు నట్లొనర్చుట. ఇతడు రేచించినపుడు ఆతని ఛాతి 48 అంగుళముల పరి మాణమును, కుంచించినపుడు 58 అంగుళముల పరిమాణ మును కలిగియుం డెడిది. (6) 3 టన్నుల బరువు గల ఏను గును, కేవల కుంభక క్రియచేతనఛాతిమీద నెక్కించుకొ నెడి వాడు. ఇట్టి విలక్షణ ప్రదర్శనముల నింతవర కెవ్వరును చేసియుండలేదు.

భారతదేశములోని సంస్థానాధీశులును, రాజ ప్రతి నిధులును, గవర్నరులును ప్రముఖ దేశభక్తులగు అర వింద ఘోషు, లాలా లజపత్ రాయ, బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, శిశిరకుమారఘోషు, మదన మోహన మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, డాక్టరు భోగ రాజు పట్టాభిసీతారామయ్య పంతులు, మహాత్మాగాంధి మున్నగు పలువురు మహాశయులచే ఇతడు పొగ డ్తలను గాంచెను. బ్రిటిషు సామ్రాజ్య చక్రవర్తి యగు పంచమ జార్జి శ్రీ రామమూర్తి ప్రదర్శనమున కచ్చెరువంది ఇతని కొక బంగారు పతకము నిచ్చి గౌరవించెను. ఇట్లు బహుమతులుగా లభించిన అనేక పతకములను ఇతడు తన నల్లనికోటుపై ధరించెడివాడు.

రామమూ ర్తి నాయుడు హిందూస్తానీ యందును, ఆంగ్లమునందును, తన మాతృభాష యగు ఆంధ్రము నందును అనర్గళముగను, గంభీరముగను ఉపన్యసించెడి వాడు. స్వరాజ్యసిద్ధి యయినపిమ్మట దేశరక్షణార్థమై వలసిన దేహబలమును సంపాదించుకొనవలెనని యువతీ యువకులకు ఉపన్యాసముల ద్వారమున ప్రబోధించెడి వాడు. ఇతడు ఎల్లప్పుడును అత్యుత్సాహముతోను, నగు మోముతోను ఉండెడివాడు. భారత దేశములోని ప్రతి గ్రామమందును ఒక వ్యాయామశాలను స్థాపించి నియ మిత కాలములో యువతీయువకులకు వ్యాయామశిక్షణ మొసగుట ఆవశ్యక మని ఇతడు ప్రచారము చేసెడి వాడు.

ఒకప్పుడు ప్రేక్షకులలో నొకడు " నీ కిష్టమైన ఆహార మెద్ది?" యని ఇతనిని ప్రశ్నింపగా, తనకు కందిపప్పు, నెయ్యి, పెరుగు చాల అభిమానపాత్రములయిన వస్తువు లని చెప్పెను. వేదపారగు లగు బ్రాహ్మణులు తనను చూడ వచ్చినపుడు వారిని సత్కరించి వారి ఆశీర్వచన ములను వినయవి ధేయతలతో స్వీకరించెడివాడు. గ్రంథా లయములపట్ల ఇతనికి అత్యంత శ్రద్ధాసక్తులుండెడివి. సర్కసు ప్రదర్శనములవలన అనేక లక్షల పరిమితి గల ధనమును ఆర్జించి అనేక ధర్మకార్యములు చే సెడివాడు, బీద విద్యార్థులకు పుస్తకములకొరకు, దుస్తులకొరకు ధన మిచ్చెడివాడు.

1928 వ సంవత్సరమున ఇతడు సర్కసు ఉద్యమము నుండి విరమించుకొని కొలది కాలము విశ్రాంతి గైకొ నెను. పిదప కాశీ విశ్వవిద్యాలయ ఉపాధ్యకులైన పండిత శ్రీ మదన మోహన మాలవ్యా గారు ఇతనిని ఆహ్వానించి అచట వ్యాయామ శిక్షణ దర్శకునిగా నియమించిరి. ఇతడు 1938 లో కీర్తి శేషు డయ్యెను. ఇట్టి జగద్విఖ్యాత బలశాలి యగు కోడి రామమూర్తి నాయడు ఆంధ్రు భారతీయుల కెల్లరకును చిరసంస్మరణీయుడు.

య. సిం.

102