Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొల్లేరు సరస్సు

సంగ్రహ ఆంధ్ర


కొల్లేరు సరస్సు :

I

ఈ సరస్సు కృష్ణా, పశ్చిమ గోదావరిజిల్లాల సరిహద్దులో నున్నది. ఇది ఏలూరునకు ఆగ్నేయముగను, కైకలూరునకు ఉత్తరముగను కలదు. ఈ సరస్సు ఈ రెండు తాలూకాలకు చెందియున్నను అధికభాగము ఏలూరు తాలూకాయందే విస్తరించియున్నది. ఇది యొక చరిత్రాత్మకమైన సరస్సు. ఆంధ్రకోస్తాలో సహజసిద్ధమయిన పెద్ద మంచినీటి జలాశయము ఇది యొక్కటే. స్థూలముగా అండాకారములో నుండి మెరకగానున్న ఈ పెద్దసరస్సు మొదట బంగాళాఖాతములో ఒక భాగమై యుండెను. దీని కిరుప్రక్కలను మహానదులైన గోదావరీ, కృష్ణలు సముద్రములోనికి చొచ్చుకొనిపోవునప్పుడు ఒక దాని దక్షిణపుచివర మరొకదాని ఉత్తరపు కొనతో కలియుచున్నది. ఆ విధముగా ఏర్పడిన భూభాగము కొల్లేటిని సముద్రపునీటినుండి విడదీయుచున్నది.

ఈ మంచినీటి సరస్సు ప్రధానముగా తమ్మిలేరు, బుడమేరు అను పెద్దవాగులచే పోషింపబడుచున్నది. ఈ రెండును తూర్పుకనుమలలో పుట్టుచున్నవి. వీటిలో మొదటిది చింతలపూడి, ఏలూరు తాలూకాలగుండ ప్రవహించుచు వచ్చి ఈ సరస్సులో చేరును. రెండవది విజయవాడ, గన్నవరము, కైకలూరు తాలూకాల గుండ వచ్చి దీనిలో చేరును. ఈ రెండు వాగులచే నిది వర్షాకాలమందు ఒక మహాసముద్రమువలె కన్పట్టు చుండును. పెక్కు భూములు వరదలపాలై పోవుచుండును. ఈ వాగులనీరు ఈ సరస్సులో తేరుకొనును, కాని అవి తీసికొనివచ్చెడి వండువలన ఇది త్వరితముగా మెట్ట వేసిపోవుచున్నది. ఇట్లీ సరస్సు కొలది కాలములో అదృశ్యము కాగలదేమో ! దీని వైశాల్యము ఎక్కువగా మారుచుండును. వర్షాకాలములో దీనివైశాల్యము 100చ. మైళ్ళకు మించిపోవును. వర్షములులేని కాలములోనిది బాగుగా తగ్గి ఒక్కొక్కప్పుడు ఎండిపోవుచుండును. 1900 వ సంవత్సరములో వర్షములు లేనప్పుడు ఇట్లే జరిగినది. దీనిని బాగుచేసి గట్లు వేయుటచే సహజముగా దీని పరిమాణము తగ్గుచున్నది. కృష్ణా, గోదావరి జిల్లాలలోని మురుగునీరు చాలభాగము ఈ సరస్సులోనికి చేరును. ఇందలి నీరు “పరెంటలు అవ" "జ్యూయర్అ వ" అను రెండు మార్గములద్వారమున బయటికిపోయి ఉప్పుటేరుతో కలసి సముద్రములో పడుచున్నది.

కొల్లేరుమధ్య అనేకములగు లంకలు కలవు. ఆ లంక లందు సుమారు 26 గ్రామములు కలవు. అవి మిక్కిలి సారవంతములయి, ఎక్కువ ఫలసాయము నిచ్చుచుండును. కాని బుడమేరు వరదలవల్ల తరచుగా అపారమగు నష్టములు కలుగుచుండును. అట్టి సమయములందు రాకపోకలు స్తంభించి రైతులు పెక్కు అగచాట్లకు లోనగుచుందురు.

కొల్లేరులో చేపలు సమృద్ధిగా నుండును. అన్నిరకముల పక్షులు ఇచట నివసించుచుండును. ఒకప్పుడు ఇచటి నుండి పక్షులు, చర్మములు ఎగుమతిచేయబడు చుండెడివట ! ప్రస్తుత మీ సరస్సునుండి పంపింగు విధానములో కొంత భూమికి నీరు అందించబడుచున్నది. ఆ నీటి కందుబాటులోనుండు తీరప్రాంతము లనేకములు మిగుల సారవంతములై అధిక ఫలసాయమును ఇచ్చుచున్నవి.

కొల్లేరు సరోవరముండు ప్రదేశములో పూర్వము 12 ఆమడల విస్తృతిగల ఒక మహానగరముండెడి దట! అందు యాగ కర్మనిష్ఠాగరిష్ఠులగు శ్రోత్రియు లనేకులు వసించు చుండిరట ! 'కొల్లు' అను గ్రామదేవత నారాధించుచు వారందరు మంత్రశాస్త్రపారగులై ఆ దేవతా ప్రీతికై వివిధ క్రియాకలాపముల నొనర్చుచుండిరి. అట్టి పట్టణమున ఒకానొక సమయమందు ఘటిల్లిన దీర్ఘకాలికమయిన అనావృష్టి ఫలితముగా నిర్జలక్షామ మేర్పడెను. బ్రాహ్మణుల యాగాది క్రియలవల్లగూడ నీరు లభించెడిదికాదట! ఒక బ్రాహ్మణగృహిణి జలాభావముచే కాలిమడితో అక్షతలను తడిపి హోమమునకై భర్తకొసగెనట. వాటిని అగ్నియందు వ్రేల్చగనే అవి బంగారు కణికలవలె రూపొందెనట ! స్వర్ణలాభాపేక్షచే అందరును అట్లే చేయనారంభించిరట! ఇట్లు ఆ పురమంతయు, అనాచార కారణమున భ్రష్టమైపోయెను. ఒక బ్రాహ్మణ కుటుంబము మాత్రము ఇట్టి దురాచారమునకు పాల్పడక జలాభావమును అట్లే సహించుచుండెను. ఒకనాడా గ్రామముయొక్క శక్తి దేవత అగ్నిహోత్రములతో ఆ చోటును విడిచిపోవలెననియు, పోవునపుడు మార్గమందు ఒక్కొక్క అగ్నికణ

92