పుట:Sangitarasataran022902mbp.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ నాటకమును క్రోధిసంవత్సర చైత్రమాసములో (1904 యేప్రిల్‌) నారంభించి దాసు నారాయణరావు B.A.,B.L. రెండంకములును మూడవయంకములో ఇఱుకుగృహంబులు౯ మలినహేయనివాసములు అను వృత్తము సగము వరకును రచియించిన పిమ్మట క్రోధిసంవత్సర భాద్రపద శుద్ధమున (1904 సెప్టెంబరు) రోగపీడితుఁడై యొక సంవత్సరము మాత్రము భూలోకమునందు జీవించి విశ్వావసు సంవత్సర భాద్రపద శుద్ధమున (1905 సెప్టెంబరు) పునరావృత్తి రహితశాశ్వతపదవి నొందెను. అంతట అతని తండ్రినగు నేనతని యిష్టమును గైకొనియున్న వాఁడనైనందున అ పద్యముయొక్క మూడవ చరణమును మొదలు చేసుకొని తుదముట్టించితి.

ఇది ఆర్నాల్డుదొరగారి లైట్‌ అఫ్‌ యేష్యాననుసరించి వ్రాయబడినది గాన కొన్ని చోటుల రసోచితముగా ఎక్కువచేయబడినది. కొన్ని భాగములు విడువబడినవి.

పదుగురికి తెలియునట్లు తేలిక శైలిని వ్రాయబడినది. తప్పులు కుప్పలుతెప్పలు అయినను సాధారణముగా నాటకము జనానందకరముగానే యుండునని తలంచెదను. దృశ్య ప్రబంధముగాన ప్రయోగ కాలమునందు సరసులు రసము గ్రహింపవలయుగాని పఠనీయమని యూరక పఠించిన మాత్రముచే నట్టియానందము ననుభవింపవలను గలుఁగదు. ఎట్టులైన సజ్జనులకు వందనములు చేసి తప్పులు క్షమింపంగోరెదను.

విధేయుడు
దాసు శ్రీరాములు