పుట:SamskrutaNayamulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19

సంస్కృతన్యాయములు

గజస్నానన్యాయము

ఏనుఁగు తాను మునుఁగుటకు వీలగునంత లోతుగల నదులు మున్నగువానిలోఁగాని స్నానముచేయదు. కాని నదిలో నుండి యీవలకు వచ్చిన మఱునిముసముననే త్రోవలోని చెత్త, క్రుళ్ళుడు తొండెముతో పైన వైచికొనును. దుమ్ము పోసికొనును. అట్లే ఏదేనికార్యము "చేసియు వ్యర్థమే" అనుట నీ న్యాయము తెలుపును. భాస్కర. యుద్ధ. 138

గడ్డురికాన్యాయము, గడ్డులికా ప్రవాహన్యాయము

గొఱ్ఱెలమందలో నొకటి ప్రమాదముననైనఁ బ్రవాహమునఁ బడినచో, తక్కినవన్నియు నెంతవారించినను, ఆగక ఆప్రవాహములో దుముకును.

గతజలసేతుబంధనన్యాయము

నీరు పోయినపిదప కట్ట వేసినట్లు. భార. భీష్మ. 3.84

గర్తజంబుకన్యాయము

గుంటనక్క చేష్టలు.

గర్దభచందనన్యాయము

గాడిద గందపుపొడి మోసినను, దానికి సువాసన తెలియదు. వేమన.