పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధనువునకు విలువ యుండదు గదా! ఆహారము, నిద్ర మున్నగులక్షణములు మానవులకు నితరజంతువులకు సమానములే. ధర్మాధర్మముల వివేకమే మానవునియందలి విశేషము. ఆ వివేకమునకు విద్యయే మూలము. విద్యలేని మానవుడు వింతపశు వన బడును" అని కొంతసేపు దు:ఖించెను.

మరల "సర్వవిధముల యత్నించి సుతులను సుగుణ వంతులుగా జేయదగును. వట్టికోరికలతో నూరకుండక తగువిధమున బ్రయత్నించిన దేవుడును సాయపడకపోడు. కుమారులకు విద్యాభ్యాసము చేయింపకున్న దోసము తలి దండ్రులది. ఒంటిచక్రమువలన రథమునకు నడక గలుగని యట్లు పురుష యత్నము, దైవసాహాయ్యము గూడిరానిచో గార్యములు సిద్ధింపవు. కావున దగిన ప్రయత్న మొనరించెదను" అని దీర్ఘముగా నాలోచించి మఱునాడు పండితు లందఱను రావించి సభగావించి వారితో నిట్లు పలికెను.

"విద్వాంసులారా! విద్యాహీనులై యెల్ల వేళల జెడుదారుల దిరుగుచున్న నాసుతులకు నీతిశాస్త్ర ముపదేశించి గుణవంతులను జేయజాలు పండితులెవరైన గలరా?"

ఇట్లు ప్రశ్నింపగా మహాపండితు డగు విష్ణుశర్మ యను భూసురుడు "రాజా! ఉత్తమకులమున జనించిన నీసుతులను విద్వాంసులుగా జేయుట యెంతపని? నీకులమున నపండితు లెట్లు పుట్టుదురు?