పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతయత్నించినను బకమును మధురముగా బలికింపలేముగాని, చిలుకను బలికించు టేమికష్టము? నీకుమారుల నాఱుమాసములలో నీతిశాస్త్రజ్ఞుల నొనరించి యొప్పగింపగలను" అని బదులు పలికెను.

అందులకు రా జెంతయు సంతసించి యిట్లనెను. "గాజు బంగారముతోడి సంబంధమున మరకతమణికాంతి నొందును. అట్లే సజ్జనస్నేహము నొందిన మూర్ఖుడును నేర్పు సంపాదింప గలడు గదా! కీటకము కుసుమ సంపర్కమున సుజనుల శిర మెక్కును. సత్పురుషులు ప్రతిష్ఠించుటవలన బాషాణమే దైవత్వము నొందును. నదీగతములగు జలములు సుఖముగా ద్రాగుటకు యోగ్యములు. సముద్రగతములగు నా సలిలములే త్రావుట కయోగ్యము లగును. ఆడువారి కనులయం దుంచబడిన నల్లని కాటుకయు నందము నొందునట్లు దుర్జనుడును మంచివారి యాశ్రయమువలన రాణించును. మిము బోలు పండితులకడ జేరి నాసుతులు నీతివిదు లగుట వింతకాదు. కావున వారలకు విద్యయొసగు భారము మీయదియే." యని పలికి బహుమాన పూర్వకముగా విష్ణుశర్మకు సుదర్శనుడు తనకుమారుల నొప్పగించెను.

పిమ్మట విష్ణుశర్మ యారాజకుమారుల నొక సుందరమైన భవనమునకు గొనిపోయి సుఖముగా గూరుచుండ జేసి వారితో నిట్లు పలికెను.