Jump to content

పుట:SamardaRamadasu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

చరమ ప్రకరణము

ఈ సంగ్రహ చరిత్రము మీద తెఱ పడవేయకమునుపు రాజకీయాందోళనమున రామదాసు డెంతవఱకు పనిచేసెనో సంగ్రహముగ తెలుపందగును. రామదాసశివాజీల సమావేశములకు మున్ను శివాజీయొక్క రాజకీయ వ్యవహారము కొంత వఱకు బ్రోత్సాహకరముగ నుండినను, తరువాత నా వ్యవహారములు తాల్చినంత వైశాల్యమును, బలమును నవి పొందియుండ లేదు. శివాజీ రామదాసులు చేతులు కలుపుగొనిన తరువాతను, రామదాసుని మతబోధకులు స్వరాజ్యసంస్థాపనకుకూడ పాటుపడజొచ్చిరి. మతబోధకులు స్వధర్మ సంరక్షణకై యొక మహావీరుడు దేశమున ప్రభవించినాడని బోధించి సిపాయీలను, గుమస్తాలను, రాయబారులను, వేగులవాండ్రను, శివాజీ కొలువులో జేర్ప జొచ్చిరి. రామదాసుడు మానవతత్వమును, జక్కగా విభాగించి పరిశోధింపగల ప్రజ్ఞావంతుడు గనుక గొలువుచేయుటకు దనకడ కెవ్వరు వచ్చినను, వాడెందుకు పనికివచ్చునో యావిషయమై యొక జాబు వ్రాసి శివాజీకడకు బంపుచుండును, ఇత్తెరంగున, వందలు, వేలు భటులు శివాజీ ధ్వజముక్రింద నిలిచి, మహమ్మదీయుల యొక్కయు, మహారాష్ట్రప్రభువుల యొక్కయు, సర్దారులయొక్కయు, నాటంకములను నొకమూలకు ద్రోసి, శివాజీని సింహాసన మెక్కించిరి. అందు చేతనే శివాజీ మొట్టమొదట రామదాసుని గద్దె నెక్కించి, పిమ్మట, నాతని యాజ్ఞప్రకారము సింహాసనమెక్కి, రాజయ్యెను. రామదాసునియొక్క, విశాల దృష్టి ఏజాతివానినైన విడువక, జాతి పునర్నిర్మాణమునకు, నెల్లవారి సానుభూతిని సంగ్రహించెను. రాజ్యాంగవ్యవహారములనేగాక, రామదాసుడు శివాజీకి శాసననిర్మాణమందుగూడ సహాయపడెను. దండయాత్రలు జరుపుటలో గూడ