Jump to content

పుట:SamardaRamadasu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గునవి చేయుచుండవలెనని యాజ్ఞాపింపబడిరి. శిష్యులందఱు సన్యాసులు, అందుచేత గురువువలెనే వారును విరాగులు, బిచ్చమెత్తుట, కీర్తనలు భజనలు చేయించుట తప్ప మఱి యే యితర లోకసంబంధములను వారు పెట్టుకొనగూడదు. ప్రతి శిష్యుడు తన మఠము చుట్టునున్న కొన్ని యిండ్లకు బ్రతి దినము పోయి బిచ్చ మెత్తుకొనవలయును, బిచ్చమునకై యే యింటికి బోవ దలచునో యా యిల్లు చేరగానే యాతడొక శ్లోకమును చదువ వలెను. అక్కడ బిచ్చము నిమిత్తము కొన్ని నిమిషములు మాత్రమే యుండవలెను. అంతలో బిచ్చము దొరికినను, దొరకకున్నను గిరుక్కున మరలి మఱియొక యింటికి బోవలెను. సంపూర్ణ స్వార్థత్యాగ దీక్షయే రామదాసుని మతమునకు గీటురాయి. శిష్యులు దినమున కొక్క పూటమాత్రమే కొంచెము పప్పు, అన్నము దిని రాత్రి నిరాహారులై యుండవలయును. తక్కిన కాలము వారు తమతమ మఠములలో మతబోధలు చేయుట, నుపాసనలు, జరిపించుట మొదలగు కార్యములను జేయుచుండ వలెను. ఆ బోధనలు వినుటకు జను లనేకు లక్కడికి జేరుచుందురు. ప్రధాను లగు యీ శిష్యులు సమస్త మత రహస్యముల యందు బోధితులై యాఱితేరిన వారగుటచే వారియొక్క వాగమృతమును గ్రోలి జను లానందించు చుండిరి.

కొన్ని సంవత్సరములలోనే రామదాసుడు తన మఠముల వలను దేశమందంతట బన్ని వ్యాపింప జేసెను. శిథిలమైన హిందూమతము నుద్దరించుట యపారమైన యాత్మజ్ఞానము, నాత్మవిశ్వాసము గల రామదాసుని వంటి మహాధీరులకు సైతము దుష్కర మని యా కాలపు చరిత్ర నెఱిగిన వారి కందఱకు దోచకపోదు. క్రమ క్రమముగా శిష్యులకు శిష్యులు, వారికి బ్రతిశిష్యులు బయలుదేరి మహారాష్ట్ర దేశమునం గల ప్రతి గ్రామమునకు బ్రతి పల్లియకు బోయి యెల్లచోట్ల రామదాసుని ధర్మములు, మతము బోధించుచు "మనాచీ శ్లోకములు" జదువుచు సూర్యరశ్మివలె నది ఎల్లయెడల వ్యాపించునటుల జేసిరి. ఆయన శిష్యులు దేశస్వాతంత్ర్యము నిరసింపకుండ మతబోధకు దోడు స్వేచ్ఛను గూడ బోధించిరి. తమ మాతృభాష యగు మహారాష్ట్ర భాష యెంతో యద్భు