పుట:SamardaRamadasu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందుచేత నతడు సూర్యాజీని బిలిచి తాను నేర్చిన విద్యనంతయు నారాయణుడు గ్రహించెననియు నెక్కుడు విద్య కావలసినపక్షమున వేరే యేర్పాటు చేసికొనవలసినదనియు జెప్పెను. నారాయణునకు నైదవయేడు రాగానే తండ్రి తన స్థితిగతులకు దగినంత వైభవముతో నందనునకు నుపనయనము జేసెను. కాని దైవ యోగమున 1615 సం||న సూర్యాజీ కుటుంబ పోషణమునకు మాతృసంరక్షణమునకు జిన్న పిల్లలైన శ్రేష్ఠుని, నారాయణుని విడచి కాలధర్మము వొందెను. ఏది వచ్చినను నారాయణుడు లెక్కచేయక దృడనిశ్చయము కలవాడై యుండెను. కానున్నది కాకమానదని యతని యభిప్రాయము. చిన్నతనమందు గూడ నితరుల దృష్టిలో నసాధ్యమని తోచిన విషయముకూడ నారాయణునకు సులభముగ సాధ్యమయ్యెడిది. ఇతరులు కార్యసాధనమున గలవారపాటు నొందినప్పుడు నారాయణుడు తొందర యేమియు లేక నిశ్చలమనస్సుతో గార్యసాధనము చేయువాడు. అతడు తలచుకొన్న పని ఎంత దుర్ఘటమైనను నెందరు వలదని వారించినను దాని నత డవలీలగా నిర్వహించువాడు. నారాయణునకు సమర్థరామదాసు డని పేరువచ్చుటకు భవిష్యత్కాలమున బహుసాహసకార్యములు చేయుటకు నిదియే బీజమని చెప్పవచ్చును. అతని దృడనిశ్చయము క్రమక్రమముగ నాత్మవిశ్వాసమును స్వతంత్రభావమును వృద్ధిపొందించెను. సూర్యాజీ మరణానంతరమున బాలకు లిద్దరు గృహకృత్యములను దేవతారాధన మొదలగు పవిత్రకృత్యములను నవవైధవ్య దు:ఖముచేత మూలబడియున్న తల్లికి సంతృప్తిగలుగునట్లు చేయదొడగిరి. శ్రేష్ఠుడు, తమ్ముడైన నారాయణునకు వేదము మంత్రశాస్త్రము మొదలగు విద్యలు శ్రద్ధతో నేర్పి యతనిని విద్యావంతుని జేసెను. నారాయణుడు విద్య నేర్చుటయే గాక యన్నగారి కంటె వైరాగ్యనిస్పృహత్వములయందు మిన్నయై యుండెను. సూర్యాజీ బ్రతికియుండగనే శ్రేష్ఠుడు వేదపాఠశాల యొకటిపెట్టి దానిని యధావిధిగ జరుపుచుండెను. అతడు విద్యార్థులను శోధించి తగిన వారికి మంత్రశాస్త్రము నుపదేశించి ప్రవీణుల జేయ దొడగెను. నారాయణు డెనిమిది సంవత్సరముల వయస్సు గలిగి యున్నప్పు డన్నగారు తోడి బాలున కొకనికి మంత్రోపదేశము జేయుచుండగ జూచి, తనకు గూడా నది